పల్లెకో ప్రకృతి వనం

ABN , First Publish Date - 2020-07-08T10:23:54+05:30 IST

ప్రభుత్వం పల్లె పార్కులకు శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్క్‌ల తరహాలోనే పల్లెల్లో..

పల్లెకో ప్రకృతి వనం

380 పంచాయతీల్లో స్థలాలు సేకరించిన అధికారులు

ఐదు మున్సిపాలిటీల్లో మియావాకీ పార్క్‌ల ఏర్పాటు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ప్రభుత్వం పల్లె పార్కులకు శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్క్‌ల తరహాలోనే పల్లెల్లో కూడా ప్రకృతి వనం పేరిట పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలు సేకరించాలని నిర్ణయిచింది. మియావాకీ విధానంతో తక్కువ స్థలంలోనే మొక్కలు పెంచి పట్టణ, పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో పార్క్‌ల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరిస్తున్నారు. 


పల్లె పల్లెన ప్రకృతి వనం

జిల్లాలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో చిన్న పంచాయతీలో 20 గుంటల స్థలంలో వెయ్యి వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచనున్నారు. అలాగే పెద్ద పంచాయతీలో ఎకరం విస్తీర్ణంలో 4 వేల మొక్కలు నాటి పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉండగా, మొత్తం 380 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు 380 పంచాయతీల్లో ప్రకృతి వనాల కింద పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు భూములను పరిశీలిస్తున్నారు. తహసీల్దార్లు, మండల పరిషత్‌ అధికారులు సంయుక్తంగా స్థలాలను గుర్తిస్తున్నారు.


మియావాకీ విధానంతో పట్టణంలో పార్క్‌లు

జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా, మియావాకీ విధానం ద్వారా పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలు ఉండగా, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో ఒక్కో పార్క్‌ ఉంది. రాయికల్‌, ధర్మపురిలో ఇప్పటివరకు పార్క్‌లు లేవు. మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో పార్క్‌ ఉన్నప్పటికీ పెరిగిన జనాభా దృష్ట్యా సరిపోవడం లేదు. దీంతో పట్టణాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పూల మొక్కలను పెంచి, చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచే విధంగా మియావాకీ విధానం ద్వారా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. పక్షం రోజుల్లో భూ సేకరణ పూర్తి చేసి ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో మొత్తం దాదాపు 20 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.


పార్క్‌ల కోసం స్థలాలను సేకరిస్తున్నాం.. శేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల

ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తున్నాం. జిల్లాలో 380 పంచాయతీలు ఉండగా, ప్రతి పల్లెకు ప్రకృతి వనం పేరిట పార్క్‌లను ఏర్పాటు చేస్తాం. ఒక్కో పార్క్‌లో వెయ్యి నుంచి 4 వేల వరకు మొక్కలను పెంచి ప్రజలకు ఆహ్లాదం పంచేవిధంగా రూపుదిద్దుతాం.

Updated Date - 2020-07-08T10:23:54+05:30 IST