భక్తిశ్రద్ధలతో ధ్వజపట లేఖనం..

ABN , First Publish Date - 2021-04-19T05:56:35+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం గరుడ ధ్వజపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో ధ్వజపట లేఖనం..
ధ్వజపటానికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

 భద్రాద్రిలో నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ

 గోటి తలంబ్రాలను సమర్పించిన కోరుకొండ భక్తులు

భద్రాచలం, ఏప్రిల్‌ 18: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం గరుడ ధ్వజపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రామా లయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో తెల్లని వస్త్రంపై గరుత్మంతుడి చిత్రాన్ని చిత్రీకరించి, అనంతరం బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహించారు. కాగా సోమవారం ధ్వజారోహణం నిర్వహిస్తున్న క్రమంలో గరుత్మంతుడి చిత్రపటానికి గరుడాధివాసంను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం యాగశాలలో ధ్వజపట్టాన్ని తీసుకెళ్లి అదివాస కార్యక్రమాలు నిర్వహించారు గరుత్మం తుడి చిత్రపటానికి హారతి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. గరుత్మంతుడి చిత్రాన్ని అర్చకులు చిత్రీకరించగా వారిని సన్మానించారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో బి.శివాజీ, పర్యవే క్షకులు కత్తి శ్రీనివాస్‌, కిషోర్‌, దేవస్థానం ప్రధాన అర్చకులు పొడి చేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, పరిపాలన వైదిక సిబ్బంది పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ వారం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుఃస్థానార్చనం నిర్వహించనున్నారు.  

పర్ణశాలలో గరుడ ప్రతిష్ఠ

తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉదయం శ్రీరామాను జాచార్యస్వామికి స్నపన తిరుమంజనం, గరుడ ధ్వజపట లేఖనం, సాయంత్రం గరుడధ్వజ పటావిష్కరణ, గరుడ ధ్వజా దివాసం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, రఘు పుంగవాచార్యులు, రామాచార్యులు, శ్రీరంగం నరసింహాచార్యులు పాల్గొన్నారు.   

కోరుకొండ భక్తుల గోటి తలంబ్రాల సమర్పణ

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్త బృందం ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించింది. కొవిడ్‌-19 మార్గదర్శకాల నేపధ్యంలో కేవలం 20మంది మాత్రమే తలంబ్రాలను భద్రాచలానికి తీసుకువచ్చారు. శిరస్సుపై గోటి తంబ్రాలను ఉంచి భద్రగిరి ప్రదక్షణ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ, వైదిక సిబ్బందికి లాంఛనంగా 250కేజీల తలంబ్రాలను అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో ఉన్న 160 మండలాలకు చెందిన నాలుగువేల మంది రామ భక్తులు స్వయంగా వీటని గోటితో ఒలవడం విశేషం. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో వి.శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, కిషోర్‌, వేద పండితులు లింగాల రామకృష్ణ ప్రసాద్‌, శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావుతో పాటు భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో భక్త బృందం ఆదివారం పాదయాత్ర భద్రాచలం రామాలయానికి చేరుకున్నారు. వీరు తమ వెంట తెచ్చిన గోటి తలంబ్రాలను దేవస్థానం ఈవో బి.శివాజీకి అందజేశారు.  ఏపీలోని విజయవాడలోని గుణదల ద్వారకామాయి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భద్రాద్రి దేవస్థానంలో వివిధ శాశ్వత పథకాలకుగాను రూ1,74,240 అందజేశారు.  


19 నుంచి 30 వరకు అన్ని రకాల పూజలు, సేవలు రద్దు 

భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ 

భద్రాద్రి దేవస్థానంలో 19వ తేదీనుంచి 30వరకు అన్ని రకాల పూజలు, సేవలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో బి. శివాజీ తెలిపారు. ఈ రోజుల్లో తీర్ధ ప్రసాద వితరణ, శఠారి ఇవ్వడం కూడా నిలిపివేశామని తెలిపారు. దేవస్థానం నిత్యన్నదాన సత్రంలో భక్తులకు కేవలం ప్యాకెట్ల రూపంలో మాత్రమే అన్నప్రసాదం అందజేస్తామని పేర్కొన్నారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక 21, 22 తేదీల్లో స్వామి వారికి అన్ని రకాల దర్శనాలు, పూజలు, సేవలు, అన్నదాన వితరణ కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్ణశాల ఆలయంలోనూ ఇదే నిబంధనలు అమలవుతాయని స్పష్టం చేశారు. 



Updated Date - 2021-04-19T05:56:35+05:30 IST