భద్రగిరిలో నేటినుంచి నవాహ్నిక మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-17T06:04:10+05:30 IST

భద్రగిరిలో నేటినుంచి నవాహ్నిక మహోత్సవాలు

భద్రగిరిలో నేటినుంచి నవాహ్నిక మహోత్సవాలు
శ్రీ సీతారామచంద్రస్వామి వారు

నేడు అంకురార్పణ

భద్రాచలం, ఏప్రిల్‌ 16: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని వారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 13న ప్లవ నామ సంవత్సరం ఉగాది నాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభంకాగా నేటినుంచి నవాహ్నిక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్య కల్యాణ మహోత్సవానికి అంకురార్పణ గావించనున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నుంచి తీర్దెబిందెను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువచ్చి నిత్యకల్యాణ మండపంలో ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఇదే సమ యంలో కల్యాణ కార్యక్రమంలో పాల్గొనే వేదపండితులు, అర్చకులు తదితరు లకు దేవస్థానం అధికారులు దీక్ష వస్త్రాలను అందజేయనున్నారు. అనంతరం పంచామృతాలతో ఉత్సవమూర్తులకు విశేష స్నపనం నిర్వహించి సాయంత్రం అంకురారోపణం కార్యక్రమంలో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి మృత్సం గ్రహణం నిర్వహిస్తారు. కాగా నవాహ్నిక మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో దర్బారుసేవలు ఈ నెల 27వరకు నిర్వహించారు. పవళింపు సేవలు మే 4వరకు నిర్వహించారు. మే5న నూతన పర్యంకోత్సవం నిర్వహించనున్నారు.

వరుసగా రెండోసారి ఆలయ ప్రాంగణంలోనే..

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు భద్రాద్రి దేవస్థానం అధికారులు నవాహ్నిక మహోత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు. గతేడాది సైతం ఇదే రీతిన ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ఈసారి కరోనా వైరస్‌ రెండోవిడత వ్యాప్తి సైతం అధికంగా ఉండటంతో తొలిరోజున ఉత్సవాంగ స్నపనం, ఉత్సవ అంకురార్పణ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు. గతంలో తాతగుడిలో నిర్వహించే కార్యక్రమాలను ఈసారి కూడా ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు వైదిక వర్గాలు పేర్కొంటున్నాయి. 


ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఆహ్వానించిన దేవస్థానం ఈవో

ఈ నెల 21న నిర్వహించనున్న శ్రీసీతా రాముల కల్యాణం, 22న శ్రీరామ మహాపట్టాభి షేకాలను తిలకిచేందుకు రావాల్సిందిగా భద్రా చలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను దేవస్థానం ఈవో బి.శివాజీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శుక్రవారం భద్రాచలంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ సమయంలో దేవస్థానం ప్రసాదం, శాలువా ను మర్యాదపూర్వకంగా అందజేశారు.

Updated Date - 2021-04-17T06:04:10+05:30 IST