కాలానుగుణంగా మారిన ఒక మహాశయుడు, కడవరకు పెరిగిన ఒక మానవతావాది శ్రీతాపీ ధర్మారావు. పద్దెనిమిది సంవత్సరాల యువకులలోనైనా ఆయన విప్లవ దృక్పథం, ఆయన పరివర్తనాకాంక్ష, ఆయన ప్రగతిశీలం చెదురుగా తప్ప కానవచ్చేవి కావు. నవపథాల ఆయన నిత్యపథికుడు.
పండితుడిగా, ఉపాధ్యాయుడుగా, కవిగా, రచయితగా తాపీ ధర్మారావు సంఘానికి చేసిన సేవ విస్తృతమైనది, విశిష్టమైనది. కనీసం మూడుతరాలకు ఆయన ఉత్తేజాన్ని కూర్చారు, ఉత్సాహాన్ని పంచిపెట్టారు. ఉత్తమ పథాల వెంట తనతో పాటు నడిపించడానికి ప్రయత్నించారు.
తాపీ ధర్మారావు పాండిత్యం ఘనమైనదే. కాని అంతకంటే ఘనమైనది ఆయన మౌలిక దృష్టి. అందువల్లనే ఏ మహా పండితునికి సాధ్యపడని రీతిలో ఆయన ప్రాచీన కావ్యాలకు వ్యాఖ్యలను వ్రాయగలిగారు. ఆయన రచనా పాటవం సామాన్యమైనట్టిది కాదు కాని, అంతకంటే ప్రశంసాపాత్రమైనది ఆయన రచనా వైవిధ్యం. ఆయన పద్యాలు వ్రాశారు, పాటలు వ్రాశారు, నవలలు వ్రాశారు, వ్యాసాలు వ్రాశారు, వ్యాఖ్యానాలు వ్రాశారు. పైగా,
సినిమా స్క్రిప్టు మొదలుకొని సైంటిఫిక్ ట్రీటైజ్ వరకు దేన్ని వ్రాసినా, దానిలో ఏదో ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని సాధించారు. ఎన్ని ప్రజ్ఞలున్నా, ఎంతగా మౌలికచింతన చేయగలిగినా, ఎన్ని రంగాలలో ఎంతగా రాణించినా, కొందరిలో పెద్ద బుద్ధి తక్కువ. ఇతరులు తమ కంటె పైకి పోతూ వుంటే వారు సహించలేరు, ఏదో ఒక విధంగా వారిని దాగనీయడానికే ప్రయత్నిస్తూ వుంటారు. ఇందుకు భిన్నంగా శ్రీధర్మారావు ఇతరుల విజయాలను తన విజయాలుగానే సంభావించుకొని, ఎంతో సంతోషిస్తూవుండేవారు. మరింతగా విజయాలను సాధించవలసిందిగా వారిని ప్రోత్సహిస్తూ వుండేవారు.
తీవ్ర భావాలు, ప్రగాఢ విశ్వాసాలు వాక్పౌరుష్యాన్ని పెంచడం కద్దు. ధర్మారావుగారివి తీవ్రభావాలే, ప్రగాఢ విశ్వాసాలే అయినా, ఆయన మృదుభాషి, ఎట్టి పరిస్థితులలోను ఆయన కటువుగా మాట్లాడేవారు కాదు, ఎవ్వరి మనసును నొప్పించేవారు కాదు. అంతకంటే గొప్ప విశేషం మరొకటి ఆయనలో వుండేది. ఆయనది ఒడిదుడుకుల బ్రతుకు. దారిద్ర్య బాధలు ఆయనకు తెలుసు, ఇతర బాధలు కూడా తెలుసు. అయినా, ఆయన నిత్య సంతోషి. పండితుడిగా, ఉపాధ్యాయుడుగా, కవిగా, రచయితగా సంఘానికి చేసిన సేవ విస్తృతమైనది, విశిష్టమైనది. కనీసం మూడుతరాలకు ఆయన ఉత్తేజాన్ని కూర్చారు, ఉత్సాహాన్ని పంచిపెట్టారు. ఉత్తమ పథాల వెంట తనతో పాటు నడిపించడానికి ప్రయత్నించారు. ఆయన ధన్యజీవి.
1973 మే 9 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘ధన్యజీవి: శ్రీ తాపీ ధర్మారావు’ నుంచి