ముగిసిన శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2021-10-17T04:48:26+05:30 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో విద్యాసరస్వతీ అమ్మవారు విజయదశిమి పర్వదినం సందర్భంగా భక్తులకు రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలతో పాటు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ముగిసిన శరన్నవరాత్రులు
రాజరాజేశ్వరీదేవి అలంకారంలో వర్గల్‌ విద్యాసరస్వతి అమ్మవారు, మర్పడగ విజయదుర్గామాత

చివరి రోజు రాజరాజేశ్వరీదేవి అలంకరణలో అమ్మవారు


వర్గల్‌/కొండపాక/చేర్యాల, అక్టోబరు 16 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో విద్యాసరస్వతీ అమ్మవారు విజయదశిమి పర్వదినం సందర్భంగా భక్తులకు రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలతో పాటు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజల అనంతరం విద్యాసరస్వతీ అమ్మవారి విజయ దివ్య దర్శనాన్ని భక్తులకు కల్పింపజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమ, గాజులు, జమ్మి ఆకులను అందజేశారు. 

మర్పడగ క్షేత్రంలో

కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిసాయి. చివరి రోజున విజయదుర్గాదేవి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. క్షేత్ర నిర్వాహకుడు డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణాహుతిని నిర్వహించారు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌, టీవీ ఆర్టిస్ట్‌ రమేష్‌, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. శనివారం ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాల రవీందర్‌, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, రాములు, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయంలో 

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిర్వహిస్తున్న దేవి త్రిరాత్రోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం దుర్గాదేవీ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాన్ని ఆలయ వీధుల గుండా ఊరేగించారు. అనంతరం కోనేరులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ శేఖర్‌, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:48:26+05:30 IST