Abn logo
Oct 15 2021 @ 00:00AM

దయామృతవర్షిణి దుర్గమ్మ

చైత్రమాసంలో వసంత నవరాత్రులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ప్రసిద్ధమైనట్టే... దేశమంతా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు నిర్వహించుకోవడం అనాది ఆచారం. ఆ ‘అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ’, ఆదిశక్తి అయిన దుర్గామాత మహిషాసురుణ్ణి వధించి, ముల్లోకాలనూ రక్షించినందుకు కృతజ్ఞతగా... తొమ్మిది రోజుల పాటు ఆమెను కొలిచే సంప్రదాయాన్ని ఆసేతు హిమాచలం పాటిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ దేవీ నవరాత్రులను జరిపి, పదవరోజైన దశమిని విజయదశమిగా, దసరాగా భక్తి ప్రపత్తులతో జరుపుకొంటారు.


యుగయుగాల వేలుపు

యా దేవీ మధుకైటభ ప్రమథనీ; యాచండ ముండాపహాయా మాయా మహిషాసుర ప్రమథనీ; యా రక్త బీజాపహాయా సా శుంభ నిశుంభ సూదనకరీ; యాదేవ దేవార్చితాసా దేవీ మమపాతు దేహమఖిలం- మాతా సదా చండికా


‘‘దుష్టులైన మఽధు-కైటభులను నిర్జించి, చండ-ముండాసురులను వధించి, మహిషాసురుణ్ణి మట్టుపెట్టి, రక్తబీజుని పీచమణచి, శుంభ-నిశుంభులను సంహరించి... సకల లోక రక్షణ, ధర్మరక్షణ చేసి... సకలదేవతా కోటి పూజలందుకున్న సర్వ జగజ్జననీ! చండీమాతా! దుర్గాంబా! మమ్మల్ని సదా రక్షించి, చల్లగా చూడమ్మా!’’ అని ప్రార్థనలందుకుంటున్న దుర్గామాత యుగయుగాల వేలుపు. 


దేవీ ఆరాధన అతి ప్రాచీనమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాచుర్యంలో ఉన్న రామాయణ, మహాభారతాది ఇతిహాస కథల్లో దుర్గాదేవిని ఆరాధనకు సంబంధించిన కథలు కనిపిస్తాయి. ఆమెను శ్రీరాముడు పూజించి... విజయదశమి రోజున రావణుడిపై విజయం సాధించినట్టు చెబుతారు. అలాగే ‘మహా భారతం’లోని విరాటపర్వంలోనూ ఈ ప్రస్తావన ఉంది. విరాటరాజు కొలువులో... బృహన్నల రూపంలో ఉన్న పాండవ మధ్యముడు అర్జునుడు... విజయదశమి నాడు అజ్ఞాతవాసాన్ని ముగించి, గాండీవం ధరించి, అమ్మవారిని ప్రార్థించి... ఉత్తర గోగ్రహణ యుద్ధంలో కౌరవులను ఓడిస్తాడు. దుర్గమ్మను సేవించి శ్రీకృష్ణుణ్ణి భర్తగా రుక్మిణి పొందిన ‘రుక్మీణీ కళ్యాణ’ ఘట్టం సుప్రసిద్ధం. ఇలా పురాణ కాలం నుంచి ఆ జగన్మాత తనను ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తోంది. తన దయామృతాన్ని వారిపై కురిపిస్తోంది.

అవతార పరమార్థం

చెడును తుంచడానికీ, మంచిని పెంచడానికీ దైవ శక్తులు అవతారాలు ధరించిన ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి. శ్రీ మహా విష్ణువు పది అవతారాలు ఎత్తాడు. అదే విధంగా, శ్రీ దుర్గాదేవి ఆవిర్భావ పరమార్థం కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే. ఇంద్రాది దేవతల ప్రార్థనపై భండాసురుణ్ణి వధించడానికి... సకలదేవతా శక్తిస్వరూపిణిగా... మహాగ్నికుండం నుంచి ఆమె ఆవిర్భవించింది. దుష్టులైన రాక్షసులను వధించి, లోకకల్యాణం గావించింది. ఆదిశక్తి అయిన ఆమె వివిధ అవతారాలు ధరించి... శుంభ, నిశుంభ, రక్తబీజ, చండ ముండాసుర, అరుణాసుర, మహిషాసురాదులను సంహరించి, సకల లోకాలకూ రాక్షస పీడ నుంచి విముక్తి కలిగించింది. సర్వ శక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది.


శ్రీ వేదవ్యాస మహర్షి కృతమైన ‘శ్రీ దేవీ భాగవత పురాణం’ దుర్గాదేవి భక్తులకు కల్పతరువు. ఆర్తితో పిలిస్తే ఆదరించే కరుణామయి అయిన దుర్గాదేవి ఆవిర్భావం గురించీ, అవతార లీలా విశేషాల గురించీ, ఆమె అర్చనా వివరాలు, ఇంద్రాది దేవతా స్తోత్ర వైభవాలతో సహా ‘దేవీ భాగవతం’ వర్ణిస్తుంది. దాన్ని పారాయణ చేస్తే... సకల శుభాలు, విజయాలు, సౌభాగ్యం, మోక్షం లభిస్తాయన్నది పెద్దల మాటజ అలాగే దేవీ నవరాత్రులతో పాటు విజయదశమి రోజున అమ్మవారిని స్తుతిస్తూ ‘దేవీ భాగవతం’, ‘శ్రీదుర్గా సప్తశతి’, ‘శ్రీ లలితా సహస్రం’, ‘శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం’, ‘శ్రీ దుర్గా స్తోత్రం’, ‘అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం’, ‘నవదుర్గా స్తోత్రా’లను పఠించి... ‘శ్రీ దుర్గాదేవ్యై నమః’ అని మనసారా స్మరిస్తే ఆ అమ్మవారి కరుణకు పాత్రులవుతారు.

అపరాజితా పూజ...

సాక్షాత్తూ ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవికి అనేక నామాలున్నాయయి. వాటిలో ‘అపరాజిత’ ఒకటి. అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది. జీవుల కర్మలను గమనిస్తూ, ఆ కర్మలను అనుసరించి ఫలాన్ని ప్రసాదిస్తుంది. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’- అని అపరాజితా స్తోత్రం చెబుతోంది ‘అపరాజిత’ అంటే పరాజయం లేనిది అని అర్థం. విజయానికి ఆమె అధిదేవత. రాక్షసత్వం మీద దైవత్వం, చెడు మీద మంచి విజయం సాధించిన రోజు విజయదశమి. ఈ రోజున ఏది ప్రారంభించినా విజయం తథ్యం అని అనాది విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన విజయదశమి నాడు అపరాజితా దేవిని ఆరాధిస్తే... మనలో ఉన్న అరిషడ్వర్గాలపై విజయం చేకూరుతుంది. ‘సర్వ కామార్థ సాధనం అపరాజితా పూజనం’ అన్నారు. సత్కర్మలు ఆచరించేవారిని అపరాజితా దేవి కటాక్షిస్తుంది. ఆమెను ఆరాధిస్తే కోరినవన్నీ సిద్ధిస్తాయి. ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) రోజున అపరాజితా దేవిని పూజించి, శమీ పూజ చేయాలన్నది శాస్త్ర నిర్దేశం. ఆవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుంది. ఈ రోజున శమీ వృక్షం (జమ్మి చెట్టు) వద్ద అపరాజితా దేవిని పూజించి...

‘అమంగళానాం శమనీం

శమనీం దుష్కృతస్వచ

దుస్స్వప్న నాశనీం ధన్యాం

ప్రపద్యేహం శమీం శుభాం’ 

అనే శ్లోకాన్ని చదవాలి. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు లభించి, శుభ ఫలితాలు ఒనగూరుతాయి. శని దోషాలు తొలగిపోతాయి.


‘కళ్యాణశ్రీ’ 

జంథ్యాల వేంకట రామశాస్త్రి