రైతు చట్టాలపై కెప్టెన్‌ అమరీందర్‌కు సిద్ధూ సవాల్

ABN , First Publish Date - 2021-08-13T19:27:17+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్..

రైతు చట్టాలపై కెప్టెన్‌ అమరీందర్‌కు సిద్ధూ సవాల్

ఛండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు బహిరంగ సవాలు విసిరారు. కేంద్ర తెచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలపై ఏదైనా చేయదలచుకున్నారా లేదా అని సూటిగా ప్రశ్నించారు. పంజాబ్‌లో జరిగిన ఒక ర్యాలీలో సిద్ధూ మాట్లాడుతూ, మూడు సాగు చట్టాలకు సంబంధించి ఏదో ఒకటి చేయడంలో కెప్టెన్ విఫలమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.


సిద్ధూకు పదోన్నతి కల్పించే విషయంలో కొద్దిపాటి వ్యతిరేకలు ఎదురైనా సోనియాగాంధీ వాటిని ఖాతరు చేయకుండా ఆయనను ఇటీవల పంజాబ్ యూనిట్ అధ్యక్షుడిగా నియమించారు. ఆయనతో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిపారు. సాగు చట్టాల విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి సమర్ధనగా సిద్ధూ కూడా ముందునుంచి బలమైన వాణి వినిపిస్తున్నారు. మూడు సాగుచట్టాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధమని, రాష్ట్రంలో ఈ చట్టాలను తాము అమలు చేసేది లేదని గత వారం సిద్ధూ ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని, కేంద్రం తెచ్చిన మూడు నల్ల చట్టాలు భారత సమాఖ్య వ్యవస్థపై జరిపిన దాడి అని సిద్ధూ అభివర్ణించారు.

Updated Date - 2021-08-13T19:27:17+05:30 IST