నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-06-22T23:52:34+05:30 IST

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట

నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం నిలిపేసింది. ఆమె కల్పిత పత్రాలను సమర్పించి షెడ్యూల్డు కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు బోంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆమె అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. 


నవనీత్ కౌర్ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేశారు. ఆమెకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. పోటీ చేయడం కోసం ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు కేసు దాఖలైంది. 


బోంబే హైకోర్టు జూన్ 8న ఇచ్చిన తీర్పులో నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ, రూ.2 లక్షలు జరిమానా విధించింది. రెండు వారాల్లోగా ఈ సొమ్మును మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. 


హైకోర్టు రాష్ట్రంలోని స్క్రూటినీ కమిటీ అధికారులను కూడా తప్పుబట్టింది. కులానికి సంబంధించి మోసపూరితమైన అభ్యర్థనను ఆమోదించడం ద్వారా అన్యాయానికి పాల్పడినట్లు పేర్కొంది. ఓ కులానికి చెందని వ్యక్తిని ఆ కులానికి చెందిన వ్యక్తిగా ధ్రువీకరించడం వల్ల నిజంగా ఆ కులానికి చెందినవారు తమకు రాజ్యాంగబద్ధంగా లభించే ప్రయోజనాలను కోల్పోతారని పేర్కొంది.


Updated Date - 2021-06-22T23:52:34+05:30 IST