సంద్రంలో తిరుగులేని శక్తిగా నేవీ

ABN , First Publish Date - 2020-12-04T05:35:03+05:30 IST

సముద్రంలో తిరుగులేని శక్తిగా నేవీ ఎదిగింది. తన కనుసన్నలు దాటి ఏదీ ముందుకు పోకుండా గుర్తించే స్థాయికి చేరింది. శత్రుదేశాలు కవ్విస్తే... క్షణంలో కదన రంగంలో దిగడానికి సదా సన్నద్ధంగా ఉంటోంది.

సంద్రంలో తిరుగులేని శక్తిగా నేవీ
నేవీ విన్యాసాలు (ఫైల్‌ ఫొటో)

నేడు నేవీ డే

కరోనాలోను ఎనలేని సేవలు

సముద్రసేతు ద్వారా వేలాది మంది తరలింపు


                             (ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

సముద్రంలో తిరుగులేని శక్తిగా నేవీ ఎదిగింది. తన కనుసన్నలు దాటి ఏదీ ముందుకు పోకుండా గుర్తించే స్థాయికి చేరింది. శత్రుదేశాలు కవ్విస్తే... క్షణంలో కదన రంగంలో దిగడానికి సదా సన్నద్ధంగా ఉంటోంది. విదేశీ పర్యటనకు వెళ్లే నౌకల్లో సైతం మిస్సైళ్లు, టార్పెడోలను ప్రయోగానికి సిద్ధంగా పెట్టి... యుద్ధసన్నద్ధతను చాటుతోంది. శత్రుదేశమైన పాకిస్థాన్‌ను 1971లో మట్టి కరిపించి భారతదేశం గర్వించదగిన విజయం సాధించిన విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం అత్యంత కీలకంగా మారింది. దాదాపుగా 2,500 కిలో మీటర్ల తీరప్రాంతాన్ని రక్షించే బాధ్యత భుజాన వేసుకుంది. తాజాగా రెండు రోజుల క్రితం బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను ఐఎన్‌ఎస్‌ రణ్‌విజయ్‌ నుంచి ప్రయోగించి 300 కిలో మీటర్ల దూరానున్న లక్ష్యాన్ని సాధించి శభాష్‌ అనిపించుకుంది. న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను తూర్పుతీరంలోనే తయారు చేస్తోంది. పశ్చిమ తీరంలో రూపొందుతున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ త్వరలోనే మరో అస్త్రంగా అమ్ములపొదలో చేరనుంది. నింగిలో సంచరిస్తూ నిఘా వేసే పీ8ఐ విమానాలు మరో నాలుగు రాబోతున్నాయి. ఇవన్నీ తూర్పు నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.  


ఏటా డిసెంబరు 4న 

భారత నౌకాదళం ప్రతి ఏటా డిసెంబరు 4వ తేదీన నౌకాదినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1971 డిసెంబరు 4న భారత నౌకాదళానికి చెందిన మిస్సైల్‌ బోట్లు పాకిస్తాన్‌లోకి కరాచీ హార్బర్‌పై దాడి చేసి విజయం సాధించాయి. పాక్‌ మెడలు వంచి విజయ గర్వంతో తిరిగివచ్చాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ విజయానికి గుర్తుగా ఏటా నేవీ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే ఏడాదికి ఈ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతాయి. యుద్ధంలో అమరవీరులైన జవాన్లకు ఆర్‌కే బీచ్‌లో యుద్ధ స్మారక చిహ్నం వద్ద డిసెంబరు 4వ తేదీ ఉదయం తూర్పు నౌకాదళం ఉన్నతాధికారులు నివాళులర్పిస్తారు. ఏ శత్రుదేశాన్ని అయినా చీల్చి చెండాడ గల శక్తిసామర్థ్యాలు ఉన్నాయని చాటడానికి ఆ రోజు సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో సాహస విన్యాసాలు ప్రదర్శిస్తాయి. ఈసారి కరోనా కారణంగా ఈ విన్యాసాలకు స్వస్తి చెప్పారు. 


ఆపరేషన్‌ సముద్రసేతు

వివిధ దేశాలకు వెళ్లి కరోనా కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వస్థలాలకు చేర్చడానికి ఆపరేషన్‌ సముద్ర సేతు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐరావత్‌ల ద్వారా శ్రీలంక, మాల్దీవులు, ఇరాన్‌ల నుంచి 3,900 మందిని ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో 16 మంది గర్భిణులు కూడా ఉండడం గమనార్హం. జలాశ్వ బోర్డులో కేవలం 300 మందే పడతారు. కానీ 750 మందిని తీసుకురావలసి వచ్చింది. పది రోజుల ప్రయాణంలో వారికి మూడుపూటల అవసరమైన ఆహారాన్ని వండి అందించడానికి నౌకలోని సిబ్బంది 24/7 పనిచేసి సేవానిరతిని చాటుకున్నారు. సాగర్‌ ఆపరేషన్‌ ద్వారా మిత్రదేశాలకు అవసరమైన సాయాన్ని అందించారు. ఐరావత్‌ నౌక ద్వారా 270 టన్నుల సరకులను చేరవేశారు.


మిత్రదేశాలతో విన్యాసాలు

పొరుగుదేశాలతో కలిసిమెలసి పనిచేయాలనే లక్ష్యంతో 2020లో తూర్పు నౌకాదళం అనేక దేశాల నేవీలతో కలిసి విన్యాసాలు నిర్వహించింది. ఇటీవల మలబార్‌, శ్రీలంకతో స్లైనెక్స్‌, సింగపూర్‌తో సిట్‌మెక్స్‌, రష్యాతో ఇంద్ర 20 విన్యాసాలు నిర్వహించింది. 


కొవిడ్‌ సాయం

కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తూ, యథాప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం నేవీకి కత్తి మీద సాములా మారింది. సామాజిక సేవలో భాగంగా నేవల్‌ డాక్‌యార్డ్‌ విశాఖ ప్రజల కోసం మల్టీవే ఆక్సిజన్‌ సరఫరా పరికరాలను తయారు చేసి అందించింది. ఒకే సిలెండర్‌ ద్వారా ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అందించేందుకు ఇవి ఉపకరించాయి. కేజీహెచ్‌, విమ్స్‌కు ఇలాంటి పరికరాలు 40 వరకు అందించింది. 

 



Updated Date - 2020-12-04T05:35:03+05:30 IST