Abn logo
Aug 2 2020 @ 00:04AM

ఆయనకు ఏకలవ్య శిష్యుడిని!

ఉద్యోగం చేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేసి పేటెంట్‌ పొందారు. కానీ తనకిష్టమైన సినిమా కోసం  ఉద్యోగం వదులుకున్నారు. ఇక్కడ ప్రయాణం అంత సులభంగా మొదలు కాలేదు... కొనసాగనూ లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు... సాధించారు. ప్రస్తుత యువ హీరోల్లో వర్సటైల్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనే సత్యదేవ్‌. సాప్ట్‌వేర్‌ టు సినిమా జర్నీ ఎలా సాగిందో ‘నవ్య’తో  పంచుకున్నారు. 


నేను వైజాగ్‌లో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాను. నాన్న ఓ మీడియా హౌస్‌లో పనిచేస్తారు. చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవిగారంటే ఇష్టం. ఆయన సినిమాలో సన్నివేశాలు, పాటలు చూపిస్తేనే అన్నం తినేవాడినని అమ్మ చెబుతుంటుంది. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే యాక్టర్‌ కావాలని ఫిక్సయ్యా. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశా. ఎన్ని చేసినా పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలిసినట్టుగా నా గోల్‌ మాత్రం సముద్రంలాంటి సినిమాల్లోకి వెళ్లాలనే!


అక్కడి నుంచి బయటపడాలనుకున్నా...

వైజాగ్‌లో సినిమాకు సంబంధించినవాళ్లు తక్కువ. అందుకే నాకు ఎంకరేజ్‌ తక్కువైంది. అందుకని 2005 సమయంలో నేనే చిన్నచిన్న కథలు రాసి అప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్‌లతో షార్ట్‌ఫిల్మ్స్‌ చేసేవాడిని. ఐశ్వర్యారాయ్‌ని చూడాలంటే ముంబై వెళ్లాలి కానీ అనకాపల్లిలో కూర్చుంటే పనవుతుందా? అన్న సామెత ప్రకారం.. మొదట వైజాగ్‌ నుంచి బయట పడాలనుకున్నా. హైదరాబాద్‌ వెళ్లడానికి నాకున్న ఏకైక కారణం ఉద్యోగం. చిన్నప్పటి నుంచీ కుటుంబ సభ్యులు చాలా స్వేచ్ఛనిచ్చి పెంచారు. దానిని పాడుచేయడం ఎందుకని మొదట హైదరాబాద్‌లో జాబ్‌ వెతుక్కున్నా. ఆ తర్వాత బెంగుళూరులో రెండేళ్లు పనిచేశా. వారాంతంలో హైదరాబాద్‌ వచ్చి సినిమా ప్రయత్నాలు చేసేవాణ్ణి. నేను సినిమా ప్రయత్నాల్లో ఉండగా ఇప్పుడు కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న రిషి ప్రసాద్‌ నన్ను ఓ ఆడిషన్‌కి పంపాడు. అలా ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో అవకాశం వచ్చింది. తర్వాత ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుందా’, ‘మైనే ప్యార్‌ కియా’, ‘అసుర’ వంటి చిత్రాల్లో అవకాశం అందుకొని గుర్తింపు తెచ్చుకున్నా. దీనంతటికి బీజం వేసింది రిషీ. అయితే, సినిమాలు చేస్తున్నా.. జాబ్‌ మాత్రం మానలేదు. ఎందుకంటే సినిమాల్లో సరిగ్గా డబ్బులు వచ్చేవి కాదు. ఇంట్లో అడగలేను. మాకు ఆస్తులు కూడా లేవు. అందుకే జాబ్‌ తప్పనిసరి అయ్యింది.


హీరోగా తొలి సినిమా...

కొంతకాలం తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లా. అక్కడున్న వెయ్యిమందిలో నేనూ ఒకడిని. కాస్త లావుగా ఉండడంతో బరువు తగ్గమని పూరీగారు చెప్పారు. వర్కవుట్స్‌ చేసి రెండు నెలల తర్వాత పూరీగారికి కనిపించా. ‘ఈ సినిమాలో నువ్వే హీరో’ అని ఆయన చెప్పారు. హీరోగా నేను కనిపించిన తొలి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. లీడ్‌ రోల్స్‌, నెగటివ్‌ రోల్స్‌. క్యారెక్టర్స్‌ ఏ పాత్ర వచ్చిన వదల్లేదు. వచ్చిన అవకాశాల్లో బెస్ట్‌ ఎంచుకున్నా. ‘క్షణం’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఘాజీ’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాగల 24 గంటల్లో’ ‘సరిలేరు నీకెవ్వరూ’ ఇలా ప్రతి సినిమా సక్సెస్‌ అయినదే! తాజాగా నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువవుతుంది. స్పందన చాలా బావుంది. దర్శకుడు వెంకటేశ్‌ మహా వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. దీనికన్నా ముందే తనతో ఓ సినిమా చేయాలి. అప్పుడు కుదరలేదు. తను ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రం చేసి తనని తాను నిరూపించుకుని ఈ సినిమా చేశాడు. ఇచ్చిన మాటకు కట్టబడి నాకు అవకాశం ఇచ్చాడు మహా.


బుర్ర వేడెక్కే పనులు చేయను...

చిరంజీవిగారి స్ఫూర్తితో నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయనకున్న ఎంతోమంది ఏకలవ్య శిష్యుల్లో నేనూ ఒకడిని. చిరంజీవిగారిలా వైవిధ్యమైన పాత్రలు చేయాలని నా కోరిక. దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నటించాలన్న దృఢ సంకల్పం ఉంది. ప్రస్తుతం ఆ ప్లానింగ్‌లోనే ఉన్నా.  కెరీర్‌ ఇప్పుడు నేను అనుకున్నట్లుగా సాఫీగా సాగుతోంది. ప్లానింగ్‌ లేకుండా ఏ పని చేయలేం. నేను వేసే ప్రతి అడుగుకి ప్లాన్‌ ఉంటుంది. టార్గెట్‌ పెట్టుకుని బుర్ర వేడెక్కే పనులు చేయను. సత్యదేవ్‌ సినిమా అంటే ఏదో విషయం ఉంటుంది అన్న నమ్మకం కలగజేసుకోవాలన్నదే నా తపన. దాని కోసమే కష్టపడుతున్నా. ఏదైనా పని చేయాలని ట్రై చేసి వెనక్కి వచ్చినవారే కష్టం గురించి మాట్లాడతారు. సక్సెస్‌ అయినవాడు ఏ రోజూ కష్టం గురించి మాట్లాడరు. మనం ఓ మార్గంలో వెళ్తున్నప్పుడు మొదట వెళ్లినవాడు ‘అక్కడ మట్టి రోడ్డు ఉంది అటు వెళ్లకు’ అంటాడు. ఆ మాటతో వెనక్కి వచ్చేస్తాం. కానీ ‘మట్టి రోడ్డు గుండా వెళ్తే హైవే ఎక్కుతాం’ అనే ఆలోచనలో మనం ఉండం. అలా ఆలోచించి హైవే ఎక్కినవాడే సక్సెస్‌ అయినట్లు. సినిమా, రాజకీయరంగానికి ఎలాంటి క్వాలిఫికేషన్‌తో పనిలేదు. కాబట్టి ఇక్కడ ప్రయత్నాలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే సక్సెస్‌ శాతం కూడా తగ్గుతుంది.


ఏ ప్లాట్‌ఫామ్‌ అయినా ఓకే..

ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నాకు నచ్చిన కథ కుదిరితే ఏ ప్లాట్‌ఫామ్‌ అని చూడను. ఇప్పటికే రెండు వెబ్‌ సిరీస్‌లు ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’, ‘లాక్డ్‌’ చేశా. ఓటీటీల్లో వాటికి స్పందన బావుంది. నా దృష్టిలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఐపీఎల్‌ అయితే మెయిన్‌ స్ర్టీమ్‌ సినిమా ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లాంటిది. రెండూ చూస్తాం. కానీ ఎవరైనా ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడాలనే అనుకుంటారు. నేనూ అంతే!


ఐదు సినిమాతో బిజీ...

ప్రస్తుతం తమన్నాతో ‘లవ్‌ మాక్‌టైల్‌’ రీమేక్‌, నితిన్‌తో ‘పవర్‌ పేట’, నిత్యామీనన్‌తో ఓ సినిమాతోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నా. నా వాయిస్‌ నాకు ప్లస్‌ అని చాలామంది చెబుతుంటారు. పాత్ర పాత్రకు  నా వాయిస్‌ మాడ్యులేట్‌ చేయగలను. నా ప్రతి సినిమాలో వాయిస్‌ ఒక్కోలా ఉంటుంది.


నమ్మిన సూత్రం ఇదే..

నాకు ఒక ఇల్లు క్లీన్‌ చేసే పని ఇస్తే.. మళ్లీ వాళ్లు నన్నే పిలిచి క్లీన్‌ చేయమనేంత శుభ్రంగా పనిచేస్తా. చేసే పనిలో అంత క్లీన్‌గా, క్లియర్‌గా ఉంటా. చేసే పని కరెక్ట్‌గా ఉండాలన్నది నా సూత్రం. దీనినే నమ్మాను.. ఆచరిస్తున్నాను. నేను ఐబీఎమ్‌లో వర్క్‌ చేసినప్పుడు ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేశా. దానివల్ల వారానికి 72 గంటల మ్యాన్‌ పవర్‌ సేవ్‌ అవుతుంది. ఇప్పటికీ ఆ పేటెంట్‌ నా పేరు మీదే ఉంది. ఏ పని చేసినా నిబద్ధతతో చేయడమే నా బలం. తెలిసీ, తెలియక నా వల్ల ఎవరికన్నా బాధ కలిగితే తట్టుకోలేదు. నా కుటుంబం నాకు అన్ని వేళలా అండగా ఉంటుంది. ఈ రెండూ నా బలహీనతలు.

-ఆలపాటి మధు

Advertisement
Advertisement
Advertisement