నమస్కారం.. మన సంస్కారం

ABN , First Publish Date - 2020-03-23T10:43:43+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కరోనా.. మరోసారి మన నమస్కారానికి మరింత విలువ పెంచింది. నిజానికి నమస్కారాన్ని మనం పలకరింపుగానే చూస్తూ ఉంటాం. దానికి పద్మపాదుడు

నమస్కారం.. మన సంస్కారం

ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కరోనా.. మరోసారి మన నమస్కారానికి మరింత విలువ పెంచింది. నిజానికి నమస్కారాన్ని మనం పలకరింపుగానే చూస్తూ ఉంటాం. దానికి పద్మపాదుడు ‘నమః’ అనగా ‘త్యాగం’ అనే అర్థం చెప్పాడు. నమస్కారం చేస్తూ తలవంచడం అంటే.. తన అహంకారం వదలిపెట్టి తనకు తానే తగ్గిపోయి వినమ్రతను ప్రకటించడం. నమస్కారాల్లో చాలా రకాలున్నాయి. సాష్టాంగ నమస్కారం.. అంటే శరీరంలోని ఎనిమిది భాగాలు నేలను తాకుతూ చేసేది. గురువులు, దేవతల ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి. త్య్రంగ నమస్కారం.. అంటే మూడు అంగాలతో చేసేది. ఇది కేవలం పలకరింపు కోసం చేసేది. దైవాన్ని చూసినప్పుడు.. రెండు చేతులనూ జోడించి తలపై నుంచి చేసేది కూడా త్య్రంగ నమస్కారమే. దేవుడి ఊరేగింపు వెళ్తున్నప్పుడు.. దూరంగా ఉన్న స్వామిని తలచుకుని మనసారా చేసే నమస్కారమిది. ‘‘ఏకాంగం తు నమస్కారం శిరసైవ కృతాభవేత్‌’’ శిరస్సును మాత్రం వంచి చేసేది ఏకాంగ నమస్కారం. ఇది గౌరవంతో చేసేది. చేతులు హృదయంపై జోడించి తలను వంచి చేసే నమస్కారం ఇపుడు బాగా ప్రసిద్ధం. అన్ని రకాల పలకరింపులకూ ఈ నమస్కారమే చేస్తూ ఉంటాం. మనస్సుతో చేస్తే ఉత్తమ నమస్కారంగా, వాక్కుతో చేస్తే మధ్యమ నమస్కారంగా, శరీరంతో చేస్తే అధమ నమస్కారంగా కూడా శాస్త్రాలు పేర్కొన్నాయి. వీటిని వరుసగా బీజ, అంకుర, వృక్షాలుగా కూడా చెప్పడం జరిగింది. ఎంతటి శత్రువునైనా.. ఒక్క నమస్కారం ద్వారా ఆయుధం లేకుండా జయించే అవకాశం ఉంది. గుళ్లోకి వెళ్లినపుడు ఆ మూర్తిని దర్శించి హృదయంపై చేతులుంచి చేయడం అంతరాత్మకు నమస్కరించడమే. ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచిస్తుంది.


త్రీణి పంచ చ సప్తాని నవమ ద్వాదశ సంఖ్యయా

భక్త్యా కుర్యాన్నమస్కార మశ్వమేధ ఫలం లభేత్‌

మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పన్నెండు సంఖ్యల్లో భక్తితో నమస్కరించేవారికి అశ్వమేధ ఫలం లభిస్తుందని దీని అర్థం. మన నమస్కారంలో శాస్త్రీయత, వైజ్ఞానికత రెండూ ఉన్నాయి. రెండు చేతులూ కలపడం ఏకత్వ భావనను సూచిస్తుంది. ఒకే చేయి కలపడమంటే సగం ప్రేమను ప్రకటించడమే. అలాగే పరమాత్మను స్మరించే యోగవిద్యలో కూడా ఒక కాలి తొడపై మరొక కాలు వేసి, రెండు చేతులూ అనుసంధానించి ‘ధ్యానచక్రాన్ని’ నిర్మిస్తాం. అప్పుడు శరీరం ఒక్కటైపోతుంది. నమస్కార ముద్రలో కూడా శరీరంలోని విద్యుత్తును ఏకోన్ముఖం చేసే విధంగా రెండు చేతులూ కలుపుతాం. మెదడులోని కుడి, ఎడమల ద్వంద్వ భావాన్ని కూడా నమస్కార ముద్ర ఏకత్వం వైపు తీసుకెళ్తుంది. శరీరం, ఆత్మ ఒక్కటే అనే ప్రతీక కూడా ఇందులో ఉంది. చేతుల్లోని నరాల ద్వారా ప్రవహించే ఆకాశ శక్తి మస్తిష్కం మొదలుకొని మనోవృత్తులతో కలిసి స్నాయువుల ద్వారా శరీరంలోకి చేరుతుండడం వల్ల ఒకరి నుండి మరొకరు రోగ, క్రిమిగ్రస్తులవుతారని మన మహర్షులు ఏనాడో దర్శించి నమస్కారం అనే సంస్కారాన్ని మనకు అందించారు.

- డా.పి.భాస్కర యోగి





















Updated Date - 2020-03-23T10:43:43+05:30 IST