స్వానుభవంతోనే ఆత్మజ్ఞానం

ABN , First Publish Date - 2020-03-12T09:58:54+05:30 IST

కాగితాల మీద రాయబడిన విషయాలు కేవలం దస్తావేజులుగానే పిలువబడతాయి కానీ అవి వ్యక్తిగత అనుభవాలు కానేరవు. అనుభవాలు ఆచరణలతో వస్తాయి. ఆచరణలతో వచ్చే అనుభవాలే అనుభూతులు.

స్వానుభవంతోనే ఆత్మజ్ఞానం

కాగత్‌ లిఖై సో కాగదీ కో వ్యవహారీ జీవ్‌

ఆతమ్‌ ద్రిష్టి కహాఁ లిఖై జిత్‌ దేఖో తిత్‌ పీవ్‌

‘‘కాగితాల మీద రాయబడిన విషయాలు కేవలం దస్తావేజులుగానే పిలువబడతాయి కానీ అవి వ్యక్తిగత అనుభవాలు కానేరవు. అనుభవాలు ఆచరణలతో వస్తాయి. ఆచరణలతో వచ్చే అనుభవాలే అనుభూతులు. మనిషి పొందే అనుభూతులే ఆత్మానుభూతులు. ఆ ఆత్మానుభూతులనే ఆత్మజ్ఞానంగా పిలుస్తారు’’ అంటారు మహాత్మా కబీరు. అంటే మనిషి పొందే అనుభవాలు, అనుభూతుల సారమే ఆత్మజ్ఞానం అని కబీరుదాసు అభిప్రాయం. ఎందరెందరో మహానుభావులు ఎన్నెన్నో విధాలుగా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో నిర్వచించారు. ‘‘నేను ఎవరు అనే అంశాన్ని అవలోకించడమే ఆధ్యాత్మిక మార్గంలో మొదటి సోపానం. తాను ఎవరో ఏమిటో ప్రతి వ్యక్తీ తెలుసుకుంటే మిగిలినదంతా దానికదే అర్థం అవుతుంది. మనిషి లోచూపు కలిగి ఉంటూ తనను తాను ఉద్ధరించుకోవడానికి నిరంతరమూ ఆత్మ పరిశీలన సాగిస్తూ ఉంటే వచ్చేది ఆత్మజ్ఞానమే’’ అంటారు భగవాన్‌ రమణ మహర్షి. ‘‘నీలో నువ్వు చూసుకో... నీలో ఉన్న నిన్ను చూసుకో... నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే అదే ఆత్మజ్ఞానం’’ అని జిడ్డు కృష్ణమూర్తి అంటారు. 


అర్జునుని ద్వారా మానవాళి కల్యాణం కోసం భగవానుడు అందించిన గొప్ప జ్ఞానమే భగవద్గీత అని, అందులో చెప్పబడిన సానుకూల ఆచరణలు ఆచరించి ఆత్మజ్ఞానులు కావచ్చని ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన గురువులు చెబుతారు. కృష్ణ పరమాత్ముడు గీతలోని పదమూడవ అధ్యాయంలో ఎవరు ఆత్మ జ్ఞానియో వివరిస్తూ.. ‘‘‘నేను గొప్పవాడిని, ఇతరులతో నేను ఎందులోనూ తీసిపోను, నా విద్య, ఐశ్వర్యం చూడమ’న్నట్టు తన గురించి తాను గొప్పగా మాట్లాడేవాడు ఎన్నటికీ జ్ఞాని కాలేడు. ఆత్మజ్ఞానం గల వాడు ఎవరినీ శారీరకంగా, మానసికంగా, మాటలతో ఎప్పుడూ హింసించడు. సమాజం గర్హించే లౌకిక విషయాల పట్ల ఆసక్తి కనబరచడు. స్వానుభవం కలిగిన ఆత్మజ్ఞాని మనస్సును ఎప్పుడూ తన అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాడు. ఇష్టం నెరవేరినా, నెరవేరకపోయినా మనస్సును సమాన స్థితిలో ఉంచుకునే సామర్థ్యం కలిగి ఉండి, దైవం పట్ల అచంచల విశ్వాసంతో ఉంటాడు’’ అని చెబుతాడు. 

మహాత్ములు తాము అనుభవించి, ఆస్వాదించిన జ్ఞానాన్ని మాత్రమే ఇతరులకు బోధిస్తుంటారు. అందుకే వారి బోధనలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయనడానికి గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంసను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ సందర్భంలో తమ శిష్యులతో శ్రీరామకృష్ణులవారు ‘‘మనకు తెలియని విషయాలు ఎప్పుడూ ఇతరులతో చెప్పకూడదు. చెప్పే విషయాలు స్వయంగా అనుభవించి చెప్పినప్పుడే మనం కోరుకున్న ఫలితాలను పొందవచ్చు’’ అంటూ తన ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో జరిగిన సంఘటనను వివరించారు. ‘‘ఉదయంపూట ఒక రోజు ఓ మహిళ బక్కచిక్కి పేలవంగా ఉన్న పదిపన్నెండేళ్ల పిల్లవానితో వచ్చింది. ఏమిటి అని అడిగాను. అప్పుడామె ‘అయ్యా, వీడు నా కొడుకు. వద్దన్నా వినకుండా పిడికిళ్ల కొద్దీ చక్కెర తింటున్నాడు. ఎన్ని విధాలుగానో చెప్పి చూశాను. అయినా ఆ అలవాటు మానట్లేదు. మా వాడి అలవాటు మార్చడానికి దయతో ఏదైనా మార్గం చూపండి’ అని కోరింది. నిజంగా చక్కెర ఎక్కువ తింటే ఏమవుతుందో నాకు ఆ రోజుల్లో తెలియదు. అందుకే నేను ఆమెను మర్నాడు రావాల్సిందిగా చెప్పి పంపించాను. ఆ రోజంతా చక్కెర తింటూ గడిపాను. ఏదో తెలియని నిస్సత్తువ. నోరంతా ఎండిపోసాగింది. అన్నం తినలేకపోయాను. రాత్రి సరిగా నిద్ర పట్టినట్టు కూడా అనిపించలేదు. లేచి కూర్చోవడం కష్టమనిపించింది. కాళ్లు, చేతులు నొప్పిగా అనిపించాయి. మర్నాడు తన తల్లితో వచ్చిన ఆ అబ్బాయికి.. నేను అనుభవించిన బాధలన్నీ చెప్పి హెచ్చరించి పంపించాను. అది నాకు ఓ కొత్త జ్ఞానాన్ని నేర్పి జీవితాంతం గుర్తుండిపోయే ఆత్మజ్ఞానాన్ని అందించింది’’ అన్నారు. అదే.. స్వీయజ్ఞానమే.. ఆత్మజ్ఞానం. 

- పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-03-12T09:58:54+05:30 IST