నరుడు.. నారాయణుడు

ABN , First Publish Date - 2020-03-21T09:14:01+05:30 IST

సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక భావజాలానికి.. అనాదిగా ఈ పుణ్య భూమిపై దైవతత్వం గురించిన చింతనా స్రవంతికి ఆధారభూతమైనవి వేదోపనిషత్తులు, భగవద్గీత. ప్రధానంగా.. ‘నారాయణాత్‌ ప్రాణోజాయతే, వాయుర్జోతిరాపః’ అంటూ

నరుడు.. నారాయణుడు

సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక భావజాలానికి.. అనాదిగా ఈ పుణ్య భూమిపై దైవతత్వం గురించిన చింతనా స్రవంతికి ఆధారభూతమైనవి వేదోపనిషత్తులు, భగవద్గీత. ప్రధానంగా.. ‘నారాయణాత్‌ ప్రాణోజాయతే, వాయుర్జోతిరాపః’ అంటూ సాగే నారాయణోపనిషత్తులో ఈ తత్వం అందరికీ అర్థమయ్యేలా వివరించబడి ఉంది. నారాయణుడు విశ్వచైతన్య శక్తి. సకల జీవరాశులకు కావలసిన ప్రాణశక్తి, మనసు, ఇంద్రియాలు, పంచభూతాలు ఆయన నుండే  ఉద్భవించాయి. ఆయన నుండే ప్రకృతి రూపుదాల్చింది. ఆ పరమాత్మ నుండే విశ్వం ఆవిర్భవించింది. మనం చూస్తున్న సకల చరాచర జగత్తు నారాయణ శక్తి స్వరూపమే తప్ప అన్యం కాదు.


ఆయన ఉనికి లేని స్థల, కాలాదులు ఉండజాలవు. ఆయన ఎరుక లేకుండా ఏమీ చేయలేం. ఒక గురువుగారు శిష్యులందరికీ ఈ (నారాయణ) తత్వాన్ని బోధించి.. ఎవరు, ఏ మేరకు అర్థం చేసుకున్నారో తెలుసుకొనేందుకు చిన్న పరీక్ష పెట్టాడు. అందరికీ తలొక పండు ఇచ్చి ఎవరి కంటా పడకుండా తిని రమ్మన్నాడు. శిష్యులంతా తలోదిక్కు పరుగెత్తారు. కొంతసేపటి తర్వాత ఒక్కొక్కరే వచ్చి తాము ఎంత నిగూఢంగా పండు తిన్నదీ ఆయనకు చెప్పారు. ఒక శిష్యుడు మాత్రం పండును తినకుండా దిగులుగా ముఖం పెట్టుకొని గురువుగారి వద్దకు వచ్చాడు. అదేమని గురువుగారు ప్రశ్నిస్తే.. ‘గురువర్యా! ఎంత చాటుకు వెళ్లి తిందామనుకున్నా మీరు మాకు బోధించిన నారాయణ తత్వమే జ్ఞాపకమొచ్చింది. నారాయణుడు లేని చోటు ఏదో తెలియలేదు. అందుకే పండు తినకుండా మీ వద్దకు తిరిగి వచ్చాను’ అన్నాడు. తాను బోధించిన నారాయణ తత్వాన్ని కనీసం ఒక్క శిష్యుడైనా సరిగ్గా అర్థం చేసుకున్నాడని గురువు సంతోషించాడు.


బృహత్‌ నారాయణ స్వరూపమైన ఈ సృష్టిలో భాగమైన నరుడు పరమాణు సదృశమైనవాడే. ఆ దివ్యశక్తి కారణంగా జన్మించి, కొంత కాలం జీవించి, తిరిగి అందులో లయమైపోవలసినవాడే. అందుకే నర, నారాయణుల అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ


నీటియందు పుట్టి, నీటియందు నిలచి

నీటియందు నణుగు నీటి బుడగ

నరుడు బుద్బుదంబు, నారాయణుడు నీరు

వినుము భారతీయ వీరసుతుడ


..అని సత్య సాయిబాబా చెప్పారు. నీటి మీద పుట్టిన బుడగ అక్కడేకొన్ని క్షణాలపాటు ఉండి, తిరిగి ఆ నీటిలోనే కలిసిపోతుంది. పాంచభౌతికమైన ఈ దేహం కూడా బుడగలాంటిదే. బుడగ  జీవితకాలం కొద్ది క్షణాలైతే.. నరుని జీవితకాలం కొన్ని సంవత్సరాలు.  క్షణకాలం ఉండే బుద్బుదానికి, సంవత్సరాల తరబడి ఉండే నరదేహానికి పోలిక ఎట్లా కుదురుతుంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ.. అనంతమైన కాలంతో పోలిస్తే మనిషి వందేళ్ల ఆయుష్షు బుడగప్రాయమే. ఈ విషయం తెలుసుకుని ఉన్న కొద్దిపాటి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి పనులే చేస్తూ, చేసిన కర్మల ఫలితాన్ని పరమాత్మకే అర్పిస్తూ, చివరకు ఆ నారాయణుడిలో లయమైపోవాలి.

- మాదిరాజు రామచంద్రరావు, 93933 24940

Updated Date - 2020-03-21T09:14:01+05:30 IST