రామనామాత్‌ పరోమంత్రః నభూతో నభవిష్యతి

ABN , First Publish Date - 2020-04-02T09:36:45+05:30 IST

వేదవేద్యుడైన ఆ పరమాత్మ దశరథ నందనుడైన రాముడిగా జన్మించడంతో వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించిందని ఆర్షవాక్యం. రామనామంలో త్రిమూర్తులున్నారు. ‘ర’కారం అగ్ని బీజాక్షరం. రంగు ఎరుపు.

రామనామాత్‌ పరోమంత్రః నభూతో నభవిష్యతి

వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే 

వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షద్రామాయణాత్మనా


..వేదవేద్యుడైన ఆ పరమాత్మ దశరథ నందనుడైన రాముడిగా జన్మించడంతో వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించిందని ఆర్షవాక్యం. రామనామంలో త్రిమూర్తులున్నారు. ‘ర’కారం అగ్ని బీజాక్షరం. రంగు ఎరుపు. రజోగుణం. దానికధిపతి బ్రహ్మ. ‘అ’కారం సూర్యబీజం. రంగు తెలుపు. సత్వగుణం. దానికధిపతి విష్ణువు. ‘మ’కారం చంద్రబీజం. రంగు నలుపు. తమో గుణం. దానికధిపతి శివుడు.  కనుక‘రామ’నామం.. హరిహరమయం. అందుకే.. ‘రామనామాత్‌ పరోమంత్రః నభూతో నభవిష్యతి’ అన్నారు. రామనామానికి సమమైన మంత్రం ఇంతకుముందు లేదు. ఇకపై ఉండబోదని దీని అర్థం. అష్టాక్షరీ మంత్రంలోని ఐదో అక్షరమైన ‘రా’.. పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం చేరితే ‘రామ’ అవుతుంది. విష్ణువు రామావతారమెత్తిన చైత్ర శుద్ధ నవమి తిథి సర్వకామద (అన్ని కోర్కెలూ తీర్చేది).


ముముక్షూణాం విరక్తానాం తథా చాశ్రమవాసినామ్‌

ప్రణవత్వాత్సదా ధ్యేయో యతీనాంచ విశేషతః


మోక్షాన్ని పొందగోరు గృహస్థులు, విరక్తులైన వానప్రస్థులు, ఆశ్రమవాసులైన బ్రహ్మచారులు.. ముఖ్యంగా యతులు.. ప్రణవం వంటిదైన రామ నామమనే మంత్రాన్ని సదా జపిస్తే జీవన్ముక్తి లభిస్తుందని ‘రామ రహస్యోపనిషత్‌’ తెలుపుతోంది. రామతత్వాన్ని బాగా తెలుసుకొంటే పరతత్వం తెలుస్తుంది. రామతత్వమే పరతత్వం. పరతత్వమే రామతత్వం. ‘శ్రీరామ రామ రామ అని నేను రామునియందు సదా రమించుచుందును. అది సహస్రనామములతో సమానమైనద’ని సాక్షాత్తూ ఆ శివుడు పార్వతికి చెప్పాడు. బ్రహ్మతత్వంతోనూటికి నూరుపాళ్లూ సమన్వయమయ్యేది రామ తత్వమే. రామనామం జపించడం వలన, స్మరించడం వల్ల, రాయడం వల్ల, సంకీర్తనం చేయడం వల్ల ముక్తి లభిస్తుందని భక్త కబీరు తెలిపాడు. నారద మహర్షి ప్రేరణచే శ్రీరామచరిత్రను ఏడు కాండలుగా అనుష్టుప్‌ ఛందస్సులో రచించి ‘వాల్మీకి’..  మహర్షియైు జన్మ సాఫల్యం చేసుకున్నాడు. ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ ‘సాధుఃసత్య పరాక్రమః’ అని ప్రపంచానికి తెలిపి చరితార్థుడైనాడు. రామునికి ప్రియమైన వాటిలో సత్యమొకటి. రామస్వరూపమే సత్యం. అగ్ని కణాన్ని పొరపాటున తాకినా ఎలా దహిస్తుందో.. అలాగే, పెదవుల వెంట ఎలా వెలువడినా రామనామం పాపాలను దహించివస్తుంది. ‘రా’ అనగానే తెరచిన పెదవుల గుండా శరీర గతి దోషాలు వెలుపలికి పోతాయి. ‘మ’ అనగానే పెదవులు కలిసిపోయి తిరిగి పాపాలను లోనికి రానీయవు. నాలుక అనే గడప దగ్గర శ్రీరామ నామమను మణిదీపాన్ని వేలాడగడితే లోపలి చీకటి, బయటి తమస్సు ఒక్కసారిగా మాయమవుతాయంటూ శ్రీరామమహిమను గురించి తులసీదాసు తన దోహాలలో చెప్పాడు. రామాయణాన్ని శరణాగత శాస్త్రమన్నారు. అట్టి శ్రీమద్రామాయణ పారాయణ, శ్రవణం సర్వ పాపాలనూ తొలగిస్తుంది. కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా, పరిపూర్ణ మానవునిగా శ్రీరాముడు మనకు ఆదర్శం.

- మేఘశ్యామ (ఈమని) 83329 31376

Updated Date - 2020-04-02T09:36:45+05:30 IST