వ్యాధులపై నజర్‌

ABN , First Publish Date - 2022-06-12T06:49:38+05:30 IST

జిల్లాలో వర్షాకాలం మొదలవుతుండడంతో సీజనల్‌ వ్యాధులపైన వైద్య ఆరోగ్యశాఖ నజర్‌ పెట్టింది. కరోనా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌తో పాటు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం తో ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.

వ్యాధులపై నజర్‌
నవీపేటలో అవగాహన కల్పిస్తున్న వైద్య అధికారి

సీజనల్‌ రోగాలపై దృష్టి సారించిన వైద్య ఆరోగ్య శాఖ 

గ్రామాల్లో వ్యాధులపైన అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన వసతులను కల్పిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాకాలం మొదలవుతుండడంతో సీజనల్‌ వ్యాధులపైన వైద్య ఆరోగ్యశాఖ నజర్‌ పెట్టింది. కరోనా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌తో పాటు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం తో ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వ డంతో పరీక్షలను పెంచడంతో పాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. సీజన్‌ వ్యాధులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంతో పాటు పీహెచ్‌సీల పరిధిలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

వర్షాకాలంలోనే వ్యాధులు ఎక్కువ

జిల్లాలో ప్రతీ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నా యి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గత సంవత్సరం జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. నగరంతో పాటు జిల్లాలోని పలు మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ కేసులు ఎక్కువగా వచ్చాయి. వర్షాలు మొదలుకాగానే దోమలు పెరిగి ఈ వ్యాధు లు ఎక్కువగా వస్తున్నాయి. డెంగ్యూ తీవ్రత పెరగడంతో గత సంవత్సరం ఎక్కువమంది ఆసుపత్రుల బారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తుగానే కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కూడా సీజనల్‌ వ్యాధులపైన అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో హైరిక్స్‌, ఎక్కువగా వ్యాధులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ప్రతీ వర్షాకాలంలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఈ వ్యాధులు వస్తున్నాయి. వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కువమంది చికిత్సకు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్‌సీలలో మరిన్ని వసతులను కల్పించేందుకు సిద్దమవుతున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్‌ పద్దతిలో భర్తీచేస్తున్నారు. ఇప్పటికే 15 మందిని నియమించగా మరికొంతమందిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీహెచ్‌సీల వారిగా సీజనల్‌ వ్యాధులు అంచనా వేస్తూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల పరిధిలో కూడా స్టాఫ్‌ నర్సు పోస్టులను కూడా భర్తీచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సీజనల్‌ వ్యాధులపైన ముందస్తుగానే అవగాహన కల్పించడంతో పాటు ఎక్కు వగా వాటిబారిన పడకుండ ఉండేందుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక జియో యాప్‌ ద్వారా వారి అటెండెన్స్‌ తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఈ అటెండెన్స్‌ నమోదు చేస్తున్నారు. పలు దఫాలు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సమీక్షించి వైద్యులతో పాటు సిబ్బంది, పీహెచ్‌సీల పరిధిలో అందుబాటులో ఉండి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఉండనివారిని సస్పెండ్‌ చేస్తుండడంతో ఎక్కువమంది విదులకు హాజరవుతున్నారు. జీయో యాప్‌ ద్వారా ఫోటో తప్పనిసరి చేయడంతో పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. వర్షాకాలం సీజన్‌ మొదలవుతుండడం వల్ల వైద్య ఆరోగ్యశాఖ తరపున ఈ చర్యలను చేపట్టారు.

అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు

జాతీయస్థాయితో పాటు రాష్ట్రస్థాయిలో అక్కడక్కడ కరోనా కేసు లు మల్లి మొదలవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభు త్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాల్లో కూడా చర్యలు చేపడుతున్నారు. అవసరం మేరకు ప్రతిరోజు వంద నుంచి 150 వరకు టెస్టులను నిర్వహిస్తున్నారు. అన్ని పీహెచ్‌సీల పరిదిలో అవసరం మేరకు కిట్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేయడంతో పల్లె,పట్టణ ప్రగతిలో కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తంగా ఉండాల ని కోరుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 6లక్షల 13 వేల 205 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో 66,122 కేసులు గడిచిన మూడేళ్లలో నమోదయ్యాయి. జిల్లాలో గత నాలుగు నెలలుగా కరోనా కేసు లు నమోదుకాలేదు. జిల్లాలో సీజన్‌ వ్యాదులు వర్షాలు మొదలుకాగానే ప్రబలే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅదికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. అన్ని గ్రామాల పరిధిలో సీజనల్‌ వ్యాధులపైన అవగాహన కల్పిస్తున్నామని, అవసరం మేరకు పీహెచ్‌సీల పరిధిలో వైద్యుల నియామకం చేయడంతో పాటు ఆసుపత్రుల కు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-12T06:49:38+05:30 IST