అక్రమ రిజిస్ట్రేషన్లపై నజర్‌

ABN , First Publish Date - 2021-10-18T06:35:25+05:30 IST

భువనగిరి సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయంపై ఉన్నతాధికారుల దృష్టిపడింది. అక్రమ రిజిస్ర్టేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశం ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు.

అక్రమ రిజిస్ట్రేషన్లపై నజర్‌
భువనగిరి సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

భువనగిరి సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై ఉన్నతాధికారుల దృష్టి

సెప్టెంబరు 21, 22 తేదీల్లో 472 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ

అప్పటి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌  వెంకటేశంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ వేటు

భువనగిరి టౌన్‌, అక్టోబరు 17: భువనగిరి సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయంపై ఉన్నతాధికారుల దృష్టిపడింది. అక్రమ రిజిస్ర్టేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశం ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. సెప్టెంబరు 21, 22 తేదీల్లో రెగ్యులర్‌ సబ్‌రిజిస్ర్టార్‌ శ్రీనివాసులు కార్యాలయ పనుల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టాంప్స్‌, రిజిస్ర్టేషన్‌ ప్రధాన కార్యాలయానికి వెళుతూ ఆ రెండు రోజులు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా వెంకటేశంకు బాఽధ్యతలు అప్పగించారు. దీంతో ఆ రెండు రోజులపాటు నిబంధనలకు విరుద్దంగా యథేచ్ఛగా అక్ర మ రిజిస్ర్టేషన్లు జరిగినట్లు, పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీం తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్‌ రిజిస్ర్టార్‌ శ్రీనివాసులు మరుసటి రోజు దర్యాప్తు చేయడంతో 472 అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా వ్యవహరించిన వెంకటేశంను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ గత నెల 30నే ఉమ్మడి జిల్లా రిజిస్ర్టార్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పటి నుంచి అతని సస్పెన్షన్‌పై కార్యాలయ సిబ్బంది గోప్యత పాటించడం గమనార్హం. 


472 అక్రమ రిజిస్ర్టేషన్లు

ఆ రెండు రోజుల్లో 472 అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్లు, ఇందుకోసం పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతంలో సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశం ప్రత్యక్ష పాత్రదారి కాగా, తెరవెనుక మరికొందరు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ సిబ్బందితోపాటు మరెందరో ప్రముఖులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చేతులు మారిన పెద్ద మొత్తంలో అందరికి వాటాలు వెళ్లినట్లు కూడా చర్చ సాగుతోంది. కానీ  నిబం ధనల ప్రకారం అక్రమ రిజిస్ర్టేషన్లకు అతడే బాధ్యత వహించాల్సి వస్తుండడంతో అతనిపైనే ఉన్నతాధికారులు మొట్టమొదటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. 


అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ 

ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌కు కారణమైన 472 అక్రమ రిజిస్ర్టేషన్లపై విచారణ జరిపేందుకు ఆశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ దస్తావేజులను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. అనుమతిలేని వెంచర్లు, కోర్టు వివాదాల్లో ఉన్నప్లాట్లు, నాలా అనుమతిలేని ప్లాట్లు, సరైన డాక్యుమెంట్లు లేకుండానే భవనాల రిజిస్ర్టేషన్లు జరిగినట్లు, అతని సస్పెన్షన్‌కు ముందు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వివాదాస్పద రిజిస్ర్టేషన్లకు కారణమైన ఆ దస్తావేజులను త్వరలో ఉన్నతాధికారులు మరింత క్షుణ్నంగా పరిశీలించనున్నట్లు సమాచారం. దీంతో ఆ 472 రిజిస్ర్టేషన్ల క్రయ విక్రయదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ తరహా రిజిస్ర్టేషన్లు జిల్లాలోని గుట్ట, మోత్కూరు, రామన్నపేట,చౌటుప్పల్‌, బీబీనగర్‌ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో ఇప్పటికీ జరుగుతున్నట్లు పలువురు స్థిరాస్థి వ్యాపారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఆ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మున్ముందు ఇలాంటి అక్రమ రిజిస్ర్టేషన్లు జరగకుండా చట్టాలను కఠినంగా అమలు చేసి కొనుగోలుదారులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2021-10-18T06:35:25+05:30 IST