రాహుల్ చేసిన పనికి ట్విటర్‌కు నోటీసు

ABN , First Publish Date - 2021-08-05T19:00:22+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫొటోను

రాహుల్ చేసిన పనికి ట్విటర్‌కు నోటీసు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫొటోను తొలగించాలని కోరుతూ ట్విటర్‌కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) నోటీసు ఇచ్చింది. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ, అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడిస్తూ ఈ ఫొటోను షేర్ చేశారని తెలిపింది. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరింది. 


ఢిల్లీలోని పాత నంగల్ ప్రాంతంలో ఓ దళిత మైనర్ బాలికపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. బాధిత బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్న ఫొటోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. 


దీనిపై ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో ట్విటర్ వేదికగా స్పందించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫొటోను ట్వీట్ చేయడం ద్వారా బాధితురాలి వివరాలను బయటపెట్టడం లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. దీనిని విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేయాలని, ఆయన ట్విటర్ హ్యాండిల్‌పై చర్య తీసుకోవాలని, ఆ పోస్ట్‌ను తొలగించాలని ట్విటర్ ఇండియాను కోరినట్లు పేర్కొన్నారు. ట్విటర్ ఇండియా రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌కు ఈ నోటీసును ఇచ్చారు. 


అంతకుముందు బీజేపీ నేత సంబిత్ పాత్రా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ట్వీట్‌పై చర్య తీసుకోవాలని ఎన్‌సీపీసీఆర్‌ను తమ పార్టీ కోరుతుందన్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 23, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 74లను ఉల్లంఘిస్తూ రాహుల్ ఈ ఫొటోను ట్వీట్ చేశారన్నారు. ఈ సంఘటనపై రాహుల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 


ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ కూడా రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-08-05T19:00:22+05:30 IST