లైంగిక వేదింపుల ఫిర్యాదులపై సన్నీ వర్మకు నోటీసులిచ్చిన జాతీయ మహిళా కమిషన్

ABN , First Publish Date - 2020-08-02T19:22:54+05:30 IST

మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ యువతులపై కొందరు సెలబ్రిటీలు

లైంగిక వేదింపుల ఫిర్యాదులపై సన్నీ వర్మకు నోటీసులిచ్చిన జాతీయ మహిళా కమిషన్

న్యూఢిల్లీ : మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ యువతులపై కొందరు సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. పీపుల్ ఎగెనెస్ట్ రేప్ ఇన్ ఇండియా (పీఏఆర్ఐ)కి చెందిన సామాజిక ఉద్యమకారిణి యోగిత భయన ఫిర్యాదుపై తదుపరి విచారణ ఆగస్టు 6న జరుగుతుందని తెలిపింది. 


చండీగఢ్‌లోని ఐఎంజీ వెంచర్స్ ప్రమోటర్ సన్నీ వర్మ యువతులను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని యోగిత తన ఫిర్యాదులో ఆరోపించారు. మోడలింగ్ కెరీర్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, ఈ దారుణాలకు ఒడిగడుతున్నాడని పేర్కొన్నారు. 


‘మిస్ ఆసియా’ పోటీలు నిర్వహిస్తామని, దీనిలో పాల్గొన్నవారు మోడల్స్‌గా కెరీర్ ప్రారంభించవచ్చునని చెప్తూ, యువతులను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తు చేసిన యువతుల నగ్న చిత్రాలను ఈ కంపెనీ కోరుతోందని తెలిపారు. సన్నీ వర్మ స్వయంగా కొందరు యువతులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసి, మోడలింగ్‌లో అవకాశాలు రావాలన్నా, ‘మిస్ ఆసియా’ పోటీలో గెలవాలన్నా, తన సెక్స్ కోరికలు తీర్చాలని నిర్బంధిస్తున్నాడని ఆరోపించారు. 


సన్నీ వర్మకు చాలా మంది యువతులు బలైపోయారని, ఒకసారి శారీరక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత ప్రతి నిత్యం సెక్స్ కోరికలు తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన బారిన పడినవారు దేశవ్యాప్తంగా అనేకమంది యువతులు ఉన్నట్లు తెలిపారు. 


సన్నీ వర్మ ఆగడాలను నిరూపించేందుకు కొన్ని ఆడియో క్లిప్పులు, లేఖలు, మెసేజ్‌లను తన ఫిర్యాదుతో యోగిత జత చేశారు. 


ఈ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ నెల 6న వర్చువల్ హియరింగ్ నిర్వహిస్తారు. 


Updated Date - 2020-08-02T19:22:54+05:30 IST