వ్యూహం మార్చిన నితీశ్‌!

ABN , First Publish Date - 2020-10-20T06:44:08+05:30 IST

అత్యంత వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాలు, దళితులే ఓటు బ్యాంకుగా సాగుతున్న బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత, రాష్ట్రంలో ఎన్డీయే సారథి నితీశ్‌ కుమార్‌ వ్యూహం మార్చారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిని నమ్ముకున్న ముస్లింలు, యాదవుల...

వ్యూహం మార్చిన నితీశ్‌!

ముస్లింలు, యాదవులకు పెద్దపీట.. 115 సీట్లలో 30 వారికే 

ఆర్జేడీ కూటమి ఓట్లలో చీలిక తెచ్చేందుకే!


పట్నా, అక్టోబరు 19: అత్యంత వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాలు, దళితులే ఓటు బ్యాంకుగా సాగుతున్న బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత, రాష్ట్రంలో ఎన్డీయే సారథి నితీశ్‌ కుమార్‌ వ్యూహం మార్చారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిని నమ్ముకున్న ముస్లింలు, యాదవుల ఓట్లపై కన్నేశారు. బీజేపీ, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో భాగంగా జేడీయూ పోటీ చేస్తున్న 115 స్థానాల్లో 19 స్థానాలు యాదవులకు, 11 మంది ముస్లింలకు టికెట్లు(మొత్తం 30) ఇచ్చారు. ఈ రెండు వర్గాలకు కలిపి 30ుఓటుబ్యాంకు ఉంది. 1990 నుంచి ఈ వర్గాలు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు మద్దతిస్తున్నాయి. ఈ దఫా కూడా 58 మంది యాదవులకు, 17 మంది ముస్లింలకు ఆర్జేడీ టికెట్లు కేటాయించింది. నితీశ్‌ టికెట్లు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు.


బలమైన అభ్యర్థులనే బరిలోకి దించారు. శరణ్‌ జిల్లాలో పరసా స్థానం నుంచి లాలూ పెద్దకుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మామ చంద్రికారాయ్‌కు టికెట్‌ ఇచ్చా రు. ఈయన బిహార్‌ మాజీ సీఎం దరోగా ప్రసాద్‌ రాయ్‌ కుమారుడు. పరసా నుంచి ఏడుసార్లు ఎన్నికయ్యా రు. చంద్రికారాయ్‌ కుమార్తెను వివాహమాడిన తేజ్‌ప్రతాప్‌ తర్వాత ఆమెకు విడాకులిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘షేర్‌-ఎ-బిహార్‌’, యాదవుల్లో పేరుప్రఖ్యాతులు ఉన్న రామ్‌లఖన్‌సింగ్‌ యాదవ్‌ మనవడు జైవర్ధన్‌ యాదవ్‌కు కూడా నితీశ్‌ టికెట్‌ ఇచ్చారు. 2015 ఎన్నికల్లో 243 స్థానాల అసెంబ్లీకి 61 మంది యాదవ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో 42 మంది ఆర్జేడీ నుంచి, 11 మంది జేడీయూ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. దీంతో ఆ రెండు వర్గాల ఓట్లు కూటమి విజయానికి కారణమయ్యాయని అంటారు. ముస్లింలను బుజ్జగించేందుకు నితీశ్‌ వారికి కూడా 11 సీట్లు ఇచ్చారు. 15 ఏళ్లలో ముస్లింల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను జేడీయూ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం శ్మశానాలకు కంచెలు వేయడం, బడు లు మానేసిన వారి కోసం బ్రిడ్జి కోర్సు లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, హజ్‌ భవన్‌లో, జిల్లాల్లో కోచింగ్‌ సెం టర్ల వంటివి తమకు కలిసి వస్తుందని జేడీయూ ఆశిస్తోంది. బీజేపీతో జత కట్టినా వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ ఇస్తోంది.


22 మంది మహిళలకు టికెట్లు

మహిళల ఓట్లపై సీఎం నితీశ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి సంక్షేమానికి తాను ప్రవేశపెట్టిన పథకాలు ఫలితాలిస్తాయని భావిస్తున్నారు. అందుకే 22 మంది మహిళలకు టికెట్లు కేటాయించారు. అంటే దరిదాపుగా తాను పోటీ చేస్తున్న స్థానాల్లో ఐదో వంతు అని చెప్పొచ్చు. మద్యపాన నిషేధాన్ని సమర్థంగా అమలు చేయడంతో మహిళల్లో ఆయన పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ‘పంచాయతీరాజ్‌ సంస్థల్లో మహిళలకు 50ు కోటా ఇచ్చింది కూడా ఆయనే. పోలీసు బలగాల్లో 35ు పోస్టులు వారికే కేటాయించారు. వారి సాధికారతకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు’ అని జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ తెలిపారు. మహిళల్లో ఈ సారి విద్యావంతులు, క్రీడాకారులు ఎన్నికల బరిలోకి దిగారు. కొందరు దాదాల భార్యలు, కుమార్తెలు సైతం జేడీయూ అభ్యర్థులుగా ఉన్నారు.

Updated Date - 2020-10-20T06:44:08+05:30 IST