కుప్ప‌కూలిన భ‌వ‌నం.. శిథిలాల కింద చిక్కుకున్న‌ 99 మంది!

ABN , First Publish Date - 2021-06-25T18:53:55+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో ప‌న్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది.

కుప్ప‌కూలిన భ‌వ‌నం.. శిథిలాల కింద చిక్కుకున్న‌ 99 మంది!

మియామీ, ఫ్లోరిడా: అగ్ర‌రాజ్యం అమెరికాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో ప‌న్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది. గురువారం తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఒకరు చనిపోగా, ఇప్ప‌టివ‌ర‌కు 102 మంది ఆచూకీ ల‌భ్య‌మైన‌ట్లు మియామీ డెడ్ కౌంటీ మేయ‌ర్ డానియెల్లా లెవైన్ కావా వెల్ల‌డించారు. మ‌రో 99 మంది వ‌ర‌కు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చ‌ని మియామీ డెడ్ పోలీస్ అధికార ప్ర‌తినిధి అల్వెరో జ‌బ‌లెటా తెలిపారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయ‌న్నారు. చాంప్లైన్ ట‌వ‌ర్స్‌ పేరిట పిలువ‌బ‌డే ఈ బ‌హుళా అంత‌స్తుల భ‌వ‌నంలోని మొత్తం 136 యూనిట్ల‌లో 55 యూనిట్లు కుప్ప‌కూలిన‌ట్లు స‌మాచారం. అయితే, భవనం కుప్పకూలిన సమయంలో ఎంతమంది లోపల ఉన్నారనే అంశంపై స్పష్టతలేదని ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ రే జ‌డ‌ల్హా వెల్లడించారు. మొద‌ట భ‌వ‌నం కొంత భాగం కుప్ప‌కూల‌గా, మ‌రో 9-10 సెక‌న్ల వ్య‌వ‌ధిలో మ‌రికొంత భాగం కుప్ప‌కూలిన‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు తెలిపారు. 

Updated Date - 2021-06-25T18:53:55+05:30 IST