నెక్లెస్‌ బండ్‌ పునరుద్ధరణకు చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-05T06:12:41+05:30 IST

ప్రజలకు అసౌకర్యం కలగకుండా నెక్లెస్‌బండ్‌ పునరుద్ధరణకు చర్యలు చేపడతా మని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు.

నెక్లెస్‌ బండ్‌ పునరుద్ధరణకు చర్యలు : కలెక్టర్‌
నెక్లెస్‌బండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పోలవరం, మే 4: ప్రజలకు  అసౌకర్యం కలగకుండా నెక్లెస్‌బండ్‌ పునరుద్ధరణకు చర్యలు చేపడతా మని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. మంగళవారం పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్‌బండ్‌ ప్రాంతాలను యడ్లగూ డెం, పాత పోలవరం గ్రామాల వద్ద జిల్లా ఎస్పీ నారాయణ్‌ నాయక్‌తో కలిసి పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ నరసింహారావు, అఖండ గోదావరి రివర్‌ బండ్‌ ఎస్‌ఈ రామకృష్ణ  కలెక్టర్‌కి మ్యాప్‌ ద్వారా పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఏటిగట్టు, నెక్లెస్‌బండ్‌ బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ కోసం తీసుకోవల్సిన చర్యల పై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాత పోలవరం, యడ్లగూడెం ప్రాంతాల్లో గట్లు బలహీనంగా మారిన ప్రాంతాల్లో రక్షణగా వేసిన ఇసుక బస్తాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మికి సూచించారు. పోలవరం డీఎస్పీ లతాకుమారి, సీఐ నరసింహమూర్తి, తహసీల్దార్‌ సుమతి తదితరులు పాల్గొన్నారు.

=========

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు : ఒకరి మృతి

పెనుగొండ, మే 4:  ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావె ల్స్‌ బస్సు ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి పెనుగొండ మండలం సిద్దాంతం జాతీయ రహదారిపై ఉన్న వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు  వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టినట్టు తెలిపారు.  బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన వేములపల్లి నాగ మల్లేశ్వరరావు (67) అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అతను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం  మృతి చెందినట్టు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

=========

జిల్లా లయన్స్‌ గవర్నర్ల ఎంపిక 

ఏలూరు కల్చరల్‌, మే 4: జిల్లా లయన్స్‌ 316జి 2021–22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోవిడ్‌ కారణంగా మంగళవారం వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించినట్టు లయన్స్‌ క్లబ్‌ చీఫ్‌ ఎడిటర్‌ వి. వెంకట స్వామి తెలిపారు. తణుకు లయన్స్‌ క్లబ్‌ నుంచి టి. రంగారావు, ఏలూరు దుర్గా తేజ లయన్స్‌ క్లబ్‌ నుంచి డాక్టర్‌ పంకజాక్షన్‌ను ఫస్టు డిస్ర్టిక్ట్‌ గవర్నర్లుగా, తాడేపల్లిగూడెం స్పిరిట్‌ లయన్స్‌ క్లబ్‌ నుంచి గట్టెం మాణిక్యాలరావును సెకండ్‌ వెస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌గా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు.  వెంకటస్వామి  తదితరులు క్లబ్‌ వ్యవస్థాపకుడు మెల్విన్‌ జోన్స్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

========

 

  సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు

ముగిసిన వ్యవసాయ మండలి సమావేశం

పెనుమంట్ర, మే 4: మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ త్రిమూర్తులు అధ్యక్షతన జరుగుతున్న మండలి ఆన్‌లైన్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతుల సమస్యలపైన విత్తనాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. యాంత్రీకరణ అవసరంపై చర్చించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నైపుణ్యతను పెంచాలని సూచించారు. చీడపీడలపై చర్చిం చి నివారణకు తీసుకోవాలని అంశాలపై వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రూ పొందించే దిశగా శాస్త్రీయ పరిశోధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళికలను తయారుచేశారు.  సమావేశంలో డాక్టర్‌ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

===========

 సమ్మర్‌ మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

ఏలూరు సిటీ, మే 4: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించటానికి గాను జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో సమ్మర్‌ మోనిటరింగ్‌  సెల్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ ఏఎస్‌ఏ రామస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోనిటరింగ్‌  సెల్‌కు 08812–222891 ఫోన్‌  నంబర్‌ను  ఏర్పాటు చేశారు. 

==========

రవిశేఖర్‌ తీసిన ఫోటో 

ఫొటోగ్రఫీలో రవిశేఖర్‌బాబుకు అంతర్జాతీయ పురస్కారాలు 

ఏలూరు కల్చరల్‌, మే 4 : ఫొటోగ్రఫీలో భీమడోలుకు చెందిన రవిశేఖర్‌ బాబుకు 2 అంతర్జాతీయ పురస్కా రాలు లభించాయి. ఈ ఏడాది బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌ విభాగాల్లో గ్రామీణ జీవన సౌందర్యం, గిరిజనుల జీవన శైలి అనే రెండు అంశాల్లో ఫొటోలు తీసి అమెరికాలోని ఇమేజ్‌ కొలీగ్‌ సొసైటీ, యునైటెడ్‌ స్టేట్స్‌ ఫొటోగ్రాఫిక్‌ అలయెన్స్‌ సంస్థలు నిర్వహించే పోటీలకు పంపగా ఈ సంస్థల్లోని న్యాయనిర్ణేతలు రవిశేఖర్‌ బాబు ఫొటోలను మెచ్చి రెండు అత్యున్నతమైన అంతర్జాతీయ పురస్కా రాలను ప్రకటించారు. ఆ సంస్థల చైౖర్మన్‌ టోనీ లికెంతాన్‌  ఈ– మెయిల్‌ ద్వారా సందేశం పంపారు. పురస్కారాలను ఆగస్టు 19న ప్రపంచ  ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సంబరాల్లో రవిశేఖర్‌ బాబు అందుకోనున్నారు. ఆయనను మంగళవారం నగరంలోని ది ఫోటో ట్రేడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు సత్కరించారు.  

Updated Date - 2021-05-05T06:12:41+05:30 IST