శుద్దిపేట కావాలి

ABN , First Publish Date - 2021-01-27T05:50:24+05:30 IST

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, జనవరి 26: అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట పట్టణాన్ని శుద్దిపేటగా, స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

శుద్దిపేట కావాలి
మియావాకీ మొక్కల తోటలో సెల్ఫీ దిగుతున్న మంత్రి హరీశ్‌రావు

స్వచ్ఛసర్వేక్షణ్‌లో సిద్దిపేట ఫస్టుండాలి

వందేళ్ల ఆరోగ్యానికి పునాది యూజీడీ

ఇక మురికికాలువలు, దోమలు ఉండవు

వీధివీధినా కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, జనవరి 26: అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట పట్టణాన్ని శుద్దిపేటగా, స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 17, 18, 24, 25 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 28వ వార్డులో పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. 22వ వార్డులో మోడల్‌ టాయిలెట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో క్లీన్‌సిటీగా సిద్దిపేటకు గుర్తింపు ఉందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానమే లక్ష్యంగా ప్రజలస్వామ్యం ఉండాలన్నారు. ఇప్పటికే పట్టణంలో పందులను పూర్తిగా నివారించామని చెప్పారు. దోమలు, ఈగలను కూడా నియంత్రించడానికి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. 70శాతం పనులు కూడా పూర్తయ్యాయని, ఇది వందేళ్ల ఆరోగ్యానికి పునాదిగా మారుతుందని వివరించారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తికాగానే వీధివీధినా కొత్త సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో నాటిన మియావాకీ మొక్కలను మంత్రి సందర్శించారు. యాదాద్రి తరహాలో మొక్కలు అద్భుతంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో మొక్కలతో  సెల్ఫీ దిగారు. 


ప్రతీ కాలనీలో ప్రకృతి వనాలు

సిద్దిపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదంతోపాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే రంగనాయకసాగర్‌, కోమటిచెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారాయని అన్నారు. నాగులబండ వద్ద 560 ఎకరాల్లో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణంలోని పలు కాలనీల్లో మంచి పార్కులు ఉన్నాయని, ఇకపై అన్ని కాలనీల్లోనూ పట్టణ ప్రకృతి వనాలు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 28వ వార్డులో ప్రకృతివనాన్ని బాగా నిర్మించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ రాజనర్సు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-01-27T05:50:24+05:30 IST