మూడో పక్షం జోక్యం అనవసరం : చైనా స్పందన

ABN , First Publish Date - 2020-06-03T22:32:13+05:30 IST

భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దుల వివాదంపై మంగళవారం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఫోన్లో చర్చించడంపై

మూడో పక్షం జోక్యం అనవసరం : చైనా స్పందన

న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దుల వివాదంపై మంగళవారం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఫోన్లో చర్చించడంపై చైనా బుధవారం ఘాటుగా స్పందించింది. భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలో మూడో పక్షం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అనవసరమని వ్యాఖ్యానించింది. ఇరు దేశాలకూ యంత్రాంగాలు ఉన్నాయని, ఇలాంటి సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చైనా ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించారు.


‘‘ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. చైనా, భారత్ సరిహద్దు విధానంపై ఓ స్పష్టమైన వైఖరితో ఉన్నాయి...... చర్చలు, దౌత్యం ద్వారా మా సమస్యను మేం పరిష్కరించుకునే సత్తా ఉంది.చైనా, భారత్ వద్ద పూర్తి స్థాయిలో సరిహద్దు వ్యవస్థలున్నాయి. సరిహద్దు వ్యవస్థలపై చర్చించే దారులు కూడా ఉన్నాయి. మూడో పక్షం జోక్యం అనవసరం’’ అని ఆయన స్పష్టం చేశారు. 


సరిహద్దుల విధానంపై మా వైఖరి సుస్పష్టంగానే ఉందని, ఇరు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని తాము నూటికి నూరు పాళ్లూ అమలు చేశామని ఆయన ప్రకటించారు. చైనా, భారత్ మధ్య జరిగిన ఒప్పందానికి తాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జవో లిజియన్ తెలిపారు. 


మరోవైపు భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇప్పటి వరకూ జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. తదుపరి చర్చలు ఈ నెల 6 న జరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే ఈ చర్చలు దశల వారీగా, స్థాయిల వారీగా మాత్రమే జరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 


చైనా దూకుడుపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు మంగళవారం ఫోన్లో సంభాషించుకున్నారు. వీరిద్దరి మధ్య 25 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఈ చర్చల్లో భారత్, చైనా ఉద్రిక్తతలు, కరోనా కట్టడి, జీ -7 శిఖరాగ్ర సమావేశం సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీనిపైనే చైనా పై విధంగా స్పందించింది. 

Updated Date - 2020-06-03T22:32:13+05:30 IST