లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలి: అమిత్ షా

ABN , First Publish Date - 2020-04-02T23:19:41+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ..

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలి: అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొన్ని రాష్ట్రాల్లో మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు..’’ అని పీఎంవో పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇవాళ ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.


‘‘దేశంలో పెరిగిన కేసుల గురించి, నిజాముద్దీన్ మర్కజ్ నుంచి విస్తరించిన కేసుల వివరాలు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలతో పాటు, అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందే గొలుసును ఛేదించాల్సిన అవసరాన్ని వివరించారు..’’ అని పీఎంవో తన ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రధాని నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌లో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-02T23:19:41+05:30 IST