నీలగిరిలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-05T06:29:45+05:30 IST

: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.

నీలగిరిలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి


నల్లగొండ క్రైం, డిసెంబరు 4 : జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో స్పెన్సర్‌ బ్రెడ్‌ కంపెనీకి చెందిన ఆటో నార్కట్‌పల్లి నుంచి నల్లగొండకు వస్తుండగా వెనకాల అతి వేగంగా అజాగ్రత్తగా వస్తున్న ఏపీ 28 డీఈ 5117 నెంబర్‌ గల కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఆటో నడుపుతున్న పున్న సదానందం(44) తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య మీనాక్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా మరో ఘటనలో నాగార్జున సాగర్‌ ఫైలాన్‌ కాలనీ గాంధీబజార్‌కు చెందిన చెరుపల్లి లత తన కుమారుడు వినయ్‌తో కలిసి బ్యాంకు పని నిమిత్తం నల్లగొండకు వచ్చి తిరగి స్కూటీపై సాగర్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో దేవరకొండ రోడ్డులో ముందు వెళ్తున్న ఆటో సడన్‌ బ్రేకు వేయడంతో వెనకాల వస్తున్న స్కూటీ నడుపుతున్న వినయ్‌ కూడా సడన్‌ బ్రేకు వేయడంతో స్కూటీపై కూర్చున్న చెరుపల్లి లత (38) స్కూటీ నుంచి కింద పడిపోయింది. అదే సమయంలో వెనకాల వస్తున్న లారీ ఆమహిళ మీదు నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ నిగిడాల సురేష్‌కుమార్‌ తెలిపారు.


పోలీసుల అదుపులో నిందితుడు?

మునుగోడు రూరల్‌, డిసెంబరు4: మునుగోడు మండలం  కిష్టాపురం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో  ఇటీవల ఈత, తాటి చెట్లని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  గత నెల 29వ తేదీ రాత్రి  పెద్ద మొత్తంలో చెట్లని ధ్వంసం చేయడంతో ఆ గ్రామపంచాయతీ కార్యదర్శితో పాటు గీత కార్మికులు సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన గుత్త ప్రభాకర్‌రెడ్దితో పాటు జేసీబీ డ్రైవర్‌పై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన  హైదరాబాద్‌లో ఉన్న నిందితుడు ప్రభాకర్‌రెడ్డితో పాటు  జేసీబీతో  డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 


తాగునీటి బోర్ల స్టార్టర్లు ధ్వంసం 

మండలంలోని ఆగని ఆగంతకులు ఆగడాలు

కేతేపల్లి, డిసెంబరు 4: మండల కేంద్రం కేతేపల్లిలో ఆగంతకుల ఆగ డాలు ఆగడం లేదు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రైతు పత్తి మొక్కలన పీకేసిన ఘటనలను మరువక ముందే  గ్రామ శివారులో  జాతీయ రహదారి వెంట గల నిమ్మలమ్మ చెరువు వద్ద గల గ్రామానికి చెందిన  రూ.50 వేల విలువైన ఐదు తాగునీటి సరఫరా బోర్ల విద్యుత్‌ స్టార్టర్లను ఆగంతకులు గురువారం రాత్రి  ధ్వంసం చేశారు. వీటిల్లో మూడు గ్రామ పంచాయితీవి,  రెండు స్థానిక జపమాల మాత చర్చివి ఉన్నాయి. ఈ ఘటనపై గ్రామ పంచాయితీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, చర్చి కమిటీ ప్రతినిధులు వేర్వేరుగా కేతేపల్లి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగంతకుల ఆగడాలపై మండలంలో ప్రజలు, రైతులు భయాందోళనతో ఉన్నారు. 


 యువతి అదృశ్యం

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 4: మండలంలోని  చిలకమర్రి గ్రామంలో యువతి అదృశ్యమైంది.  గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..  చిలకమర్రి గ్రామానికి చెందిన నూనె సోనీ(21) కొండ మల్లేపల్లిలో ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.  సర్టిఫికెట్స్‌, స్కాలర్‌షిప్‌ గురించి కళాశాలలో తెలుసుకుని వస్తానని గురువారం ఇంట్లో చెప్పి వెళ్లింది.  తల్లిదండ్రులు సాయంత్రం వరకు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చినా సోనీ తిరిగిరాలేదు. గ్రామంలో వెదికినా, బంధువులను వాకబు చేసినా ఆమె ఆచూకీ లభ్యం కానందున సోనీ తండ్రి శ్రీను  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 కిరాణం దుకాణంలో చోరీ 

కొండమల్లేపల్లి, డిసెంబరు 4: కొండ మల్లేపల్లి సాగర్‌రోడ్డులో కిరాణా దుకాణంలో చోరీ జరిగింది.  సెంట్రల్‌ బ్యాంకు ఎదురుగా సముద్రాల కోదండరాంకు చెందిన కిరాణం దుకాణంలోకి శుక్రవారం తెల్లవారుజామున  గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.45వేల నగదు, రూ.20వేల విలువజేసే వస్తువులు అప హరించారు. మండల కేంద్రంలో తరుచుగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భ యాందోళన చెందుతున్నారు. రాత్రివేళలో పోలీ సులు గస్తీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.


50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత  

డీసీఎం డ్రైవర్‌ సహా ఐదుగురి అరెస్టు

తిరుమలగిరి(సాగర్‌), డిసెంబరు 4: మండలంలోని నెల్లికల్లు గ్రామశివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికల్లు గ్రామశివారులో పోలీసులు శుక్రవారం ఓ డీసీఎం వాహనాన్ని తనిఖీ  చేసి అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈసందర్భంగా డీసీఎం డ్రైవర్‌ను, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-05T06:29:45+05:30 IST