వేప చెట్టుకు వైరస్‌

ABN , First Publish Date - 2021-11-14T06:08:48+05:30 IST

వ్యవసాయంలో చీడపీడల నియంత్రణతోపాటు ఆయుర్వేదంలోనూ కీలకపాత్ర పోషించే ఔషధ వృక్షం వేపకు పెద్ద ఆపద వచ్చింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో సంజీవనిలా.. పంటలను ఆశించే చీడపురుగుల నివారణలో క్రిమిసంహారిణిగా.. గృహనిర్మాణ రంగానికి కల్పవృక్షంగా వేపచెట్టు పేరొందింది.

వేప చెట్టుకు వైరస్‌
బీబీనగర్‌, పోచంపల్లి మండలాల్లో తెగులుతో ఎండిన వేపచెట్లు

చిగుర్ల నుంచి ప్రారంభమై నిలువునా ఎండుతున్న వృక్షాలు

కారణాలను తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు

వేపపుల్ల వాడేందుకు జంకుతున్న జనం


భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌:  వ్యవసాయంలో చీడపీడల నియంత్రణతోపాటు ఆయుర్వేదంలోనూ కీలకపాత్ర పోషించే ఔషధ వృక్షం వేపకు పెద్ద ఆపద వచ్చింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో సంజీవనిలా.. పంటలను ఆశించే చీడపురుగుల నివారణలో క్రిమిసంహారిణిగా.. గృహనిర్మాణ రంగానికి కల్పవృక్షంగా వేపచెట్టు పేరొందింది. అలాగే మనం ఉదయం మేల్కోగానే వేపపుల్లతో పళ్లను తోమడంతోపాటు, చర్మవ్యాధుల నివారణ కోసం వేపాకులను మరిగించిన నీటితో స్నానం చేస్తాం. అలాగే సబ్బుల తయారీలోనూ వేపనూనెను వినిగియోగిస్తున్నారు. ఇన్ని గుణాలున్న వేపచెట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెగుళ్ల బారినపడి ఎండిపోతున్నాయి.


ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేపచెట్లకు చిగురుకు తెగులు మొదలై క్రమంగా వేరుకు వ్యాప్తి చెందుతోం ది. దీంతో చెట్టుమొత్తం ఎండుతోంది. ముందుగా చెట్టుకు తూర్పువైపున ఉన్న కొమ్మల చిగుళ్లకు తెగులు ఆశిస్తోంది. రెండు వారాల్లో చెట్టు మొత్తానికి వ్యాప్తి చెందుతోంది. ప్రతీ ఆకు ఎండి, చెట్టు మాడిపోయి కనిపిస్తోంది. చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలుతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎంతటి ముదురు చెట్టయినా కొద్దిరోజుల్లోనే చనిపోతున్నాయి. ఇప్పటికే దక్షిణ తెలంగాణలోని హై దరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేపచెట్ల కొమ్మలు ఎండాయి. తాజాగా, నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదొడ్ల గ్రామంలో సైతం వేపచెట్ల కొమ్మలు మాడి కన్పించాయి. గతంలో వరంగల్‌  జిల్లాతోపాటు, ఏపీ రాష్ట్రంలో సైతం వేపచెట్ల కొమ్మలు ఎండాయి.


కారణం ఏంటో?

వేపచెట్లు ఎండిపోవడానికి ‘డై బ్యాక్‌ డిసీజ్‌’ అని కొంద రు, ‘ట్రీ మస్కిటో బగ్‌’ వల్ల అని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా, స్పష్టత కరువైంది. మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, పంటలను నష్టపరిచే పురుగులను వికర్షింపజేయడంలో వేపపిండి, వేపనూనె కీలకపాత్ర నిర్వహిస్తాయి. అయితే తెగులుతో వేపచెట్లు ఉన్నట్టుండి చనిపోవడంపై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగులు, పురుగుల బారిన పడిన వేపచెట్ల భాగాలను తొలగించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. శిలీంద్ర నాశనులైన పురుగు మందులను చెట్లపై పిచికారి చేయాలని మరికొందరు చెబుతున్నారు. 


డై బ్యాక్‌ డిసీజ్‌

డై బ్యాక్‌ డిసీజ్‌ కారణంగా వేప చెట్లు ఎండుతున్నట్టు కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తొలుత మన రాష్ట్రంలోని వనపర్తి జిల్లా ఖంబల్లాపురం గ్రామంలో ఒకేసా రి వేపచెట్లు ఎండుతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో చెట్లనుంచి శాంపిల్స్‌ సేకరించి డై బ్యాక్‌ డిసీజ్‌గా చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ట్రీ మస్కిటో బగ్‌ కారణమంటున్నారు. ఏది ఏమైనా, హరితహారం పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటి సంరక్షిస్తున్న నేపథ్యంలో వేపచెట్లపై దృష్టి సారించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.


ట్రీ మస్కిటో బగ్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది వేపచెట్లు ఎండుముఖం పడుతున్నాయి. సుమారు 12లక్షల చెట్లలో ఇప్పటికే 20శాతం ఎండినట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ట్రీ మస్కిటో బగ్‌’ అనే పురుగు ఆశించడం వల్ల వేపచెట్లు ఎండుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పురుగు ఆశించడం వల్ల క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండుతుంది. సాయంత్రం వేళ వేప చెట్లను ఆశించి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండుతాయి. ఈ పురుగు నల్లటి తల, ఎర్రటి గోధుమ రంగులో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


వేప చెట్టు ఉనికికే ప్రమాదం : మధు శేఖర్‌, ఏరువాక శాస్త్రవేత్త

డై బ్యాక్‌ డిసీజ్‌ వ్యాప్తిని నివారించకపో తే వేపచెట్టు ఉనికికే ప్రమాదం. వర్షాలు ఎక్కువగా కురువడం, తేమతో కూడిన వా తావరణం వల్ల ఈ వైరస్‌ వేపచెట్లకు సోకింది. ఇది గాలిద్వారా వేగంగా ఇతర చెట్లకు వ్యాపిస్తోంది. ముం దు చెట్టు పైభాగం కొమ్మలు ఎండి క్రమంగా వ్యాపించి పూర్తిగా ఎండిపోతుంది. ఎండిన చెట్టులోని వ్యాధి కారకాలు గాలిద్వారా మరోచెట్టుకు వ్యాపిస్తా యి. ఇప్పటి కే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెగులు విస్తరించింది. నివార ణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో వేపచెట్టు ఉనికికే ప్రమాదం. తెగులు సోకిన ప్రతీ చెట్టుకు కార్బండీ జం, కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ ద్రావణంతో ట్రే యిటర్‌ మౌంటెడ్‌ స్పుయర్‌ ద్వారా పిచికారి చేస్తే ప్రయోజనం ఉంటుంది.


 పరిశోధనలు చేస్తున్నాం : డాక్టర్‌ భరత్‌, కేవీకే శాస్త్రవేత్త, నల్లగొండ 

నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు ఏపీలోని కర్నూల్‌, అనంతపురం జిల్లాలో ఇదే విధంగా వేపచెట్లు ఎండిపోతున్నాయి. దానికి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అందుకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటైంది. శిలీంద్రం ఆశించడం మూలంగా వేపచెట్లు ఈ విధంగా ఎండుతున్నాయని ప్రాథమికంగా గుర్తించాం. ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దు.


Updated Date - 2021-11-14T06:08:48+05:30 IST