ఆ ప్రయోగాలే ఫ్యాషన్‌ అవుతాయి

ABN , First Publish Date - 2022-01-09T05:30:00+05:30 IST

నీరజ కోన. తెర పైన హీరో హీరోయిన్లను అందంగా చూపించడంలో అందెవేసిన చేయి ఆమెది. తాజాగా ఆమె స్టైలింగ్‌ చేసిన ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమాకు విశేష స్పందన వచ్చింది.

ఆ ప్రయోగాలే ఫ్యాషన్‌ అవుతాయి

నీరజ కోన. తెర పైన హీరో హీరోయిన్లను అందంగా చూపించడంలో అందెవేసిన చేయి ఆమెది. తాజాగా ఆమె స్టైలింగ్‌ చేసిన ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమాకు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే దర్శకురాలు కాబోతున్న నీరజ- ‘నవ్య’తో తన సినీ ప్రస్థానాన్ని పంచుకున్నారు. 


ఒకప్పుడు టైలర్లే సినిమాలకు కాస్టూమ్‌ డిజైనర్లు... ఇప్పుడు పరిస్థితి మారింది కదా...

టైలరింగ్‌, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, స్టైలింగ్‌- ఇలా రకరకాల రూపాలతో సినిమా ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు మీరన్నట్లు టైలర్లే కొత్త డిజైన్లను కుట్టేవారు. వాటినే హీరో హీరోయిన్లు వేసుకొనేవారు. ఆ తర్వాత కాస్టూమ్‌ డిజైనర్లు వచ్చారు. ఆ తర్వాత స్టైలింగ్‌కు ఆదరణ పెరిగింది. స్టైలింగ్‌లో కేవలం దుస్తులు మాత్రమే కాదు. వారు వేసుకొనే మేకప్‌.. హెయిర్‌స్టైల్‌ అన్నీ వస్తాయి. వాస్తవానికి సినిమాలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పాత్ర చాలా కీలకం. సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసినప్పుడు - హీరో లేదా హీరోయిన్‌ లుక్‌... వారు వేసుకొనే కాస్ట్యూమ్స్‌ చాలా కథ చెబుతాయి. అవే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని కలగజేస్తాయి. తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’నే తీసుకుందాం. నానీ, సాయిపల్లవిల ఫస్ట్‌లుక్స్‌తో ఈ సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. ఒకప్పుడు కాస్ట్యూమ్స్‌ డిజైనర్లు సెట్స్‌లో కనిపించేవారు కాదు. ఇప్పుడు షూటింగ్‌ జరుగుతున్నన్నీ రోజులు వారు ఉంటున్నారు. 


కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసేటప్పుడు ఎలాంటి విషయాలను మీరు పరిగణనలోకి తీసుకుంటారు?

నటీనటుల పర్సనాలిటీ, బాడీ టైప్‌ల ఆధారంగా దుస్తులు డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. లుక్‌టెస్ట్‌ చేసినప్పుడు ఈ విషయం మనకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు కథ కొన్ని తరాలు సాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నాలుగైదు లుక్‌టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘శ్యామ్‌సింగరాయ్‌’లో సాయిపల్లవిని దేవదాసిగా.. నృత్యకళాకారిణిగా.. గృహిణిగా... వృద్ధురాలిగా చూపించాం. అప్పుడు ఆ పాత్రలకు తగ్గట్టుగా దుస్తులు కూడా డిజైన్‌ చేయాలి. చాలా సార్లు హీరో హీరోయిన్లకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దుస్తులు డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ వర్క్‌ అంతా రీ- ప్రొడక్షన్‌ సమయంలోనే జరిగిపోతుంది. కానీ కొన్ని సార్లుమార్పులు చేయాల్సి వస్తుంది. 


ఒకో సమయంలో ఒకో ఫ్యాషన్‌ వస్తుంది. అందరూ దానినే ఫాలో అవుతారు... ఇదెలా జరుగుతుంది?

కచ్చితంగా ఒక కారణమని చెప్పలేం. ప్రస్తుతం ఉన్న సంస్కృతి, సోషల్‌ మీడియా ఇలా రకరకాల కారణాలుంటాయి. ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్‌ వైరల్‌ కావటానికి సోషల్‌ మీడియా ప్రధాన కారణమవుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ అన్నీ క్షణాల్లో లోకల్‌ ప్రజలకు చేరిపోతున్నాయి. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. వాటిని వాడటం మొదలుపెడుతున్నారు. మీకో ఆసక్తికరమైన విషయం చెబుతా. గతంలో ఎక్కువ వర్క్‌ ఉన్న కంచీపురం పట్టుచీరల వంటి వాటికి బ్లౌజ్‌లు కూడా హెవీ డిజైన్‌ ఉన్నవే వాడేవారు. చీర మీద హెవీ వర్క్‌ ఉన్నప్పుడు బ్లౌజ్‌ సింపుల్‌గా ఉంటే బావుంటుందని... సాయి పల్లవికి స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో మ్యాచ్‌ చేసి వాడాను. ఆ లుక్‌కు విపరీతమైన ఆదరణ వచ్చింది. నా ఇన్‌స్టాలో పెడితే వారం లోపులో 35 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే- అలియాభట్‌, పూజాహెగ్డే, అనుపమ, ప్రజ్ఞ- ఇలా ఒకరేమిటి అనేకమంది హీరోయిన్లు ఆ తరహా దుస్తుల్లో కనిపిస్తున్నారు. వీరిని చూసి నగరాల్లో, పట్టణాల్లో కూడా మహిళలు ధరిస్తారు. ఇలాంటి ప్రయోగాలే తర్వాత ఫ్యాషన్‌ అవుతాయి!


నటీనటులు వేసుకొనే దుస్తుల ధర ఎక్కువ ఉంటుంది... అందుకే అందంగా కనిపిస్తాయని చాలామంది అనుకుంటారు.. ఇది నిజమేనా?

లేదండి. అలా ఉండదు. నేనైతే వంద రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా.. పాత్ర ఆధారంగా దుస్తులు కొంటూ ఉంటా. దుస్తులు అనేవి పాత్ర ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు ‘ఎంసీఏ’ సినిమాలో నానీ- లుంగీ, టీషర్ట్‌లో పాలప్యాకెట్‌ తెస్తూ కనిపిస్తాడు. అతను ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు. అందువల్ల అతని దుస్తులు మద్రాసులో ఒక చిన్న క్లాత్‌ స్టోర్‌లో కొన్నాం. ‘టక్‌ జగదీష్‌’లో నానీ పల్లెటూరులోనే ఉంటాడు. కానీ సంపన్నకుటుంబం నుంచి వస్తాడు. అందువల్ల అతనికి మంచి బ్రాండ్స్‌ వాడాం. బాద్‌షాలో ఎన్టీఆర్‌కు కూడా పాత్ర ఆధారంగానే కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాం. 


మీరిమధ్య కాలంలో తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా.. ఆ అనుభవం ఎలా ఉంది?

మనం పనిచేస్తున్న ఇండస్ట్రీ మూలాలను అర్ధం చేసుకుంటే పని చాలా సులువుగా అయిపోతుంది. ప్రతి ప్రాంతానికి ఒకో సంస్కృతి ఉంటుంది. ముందు దానిని అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు తమిళంలో ప్రతి సినిమాలోను హీరోలు తప్పనిసరిగా ఒక్కసారైనా పంచె కట్టుకుంటారు. దీనిని ‘వస్తీ’ అంటారు. ఇది మన తెలుగువారు కట్టుకొనేట్లు ఉండదు. అందువల్ల ఒక కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసేముందు అక్కడ పరిస్థితులు అర్ధం చేసుకుంటా. స్థానిక డిజైనర్ల సాయం తీసుకుంటా. తమిళంలో సూర్య, విజయ్‌, విక్రమ్‌- ఇలా అనేక మంది అగ్ర హీరోలతో పనిచేసే అవకాశం వచ్చింది. అందువల్ల తమిళంలో బిజీ అయ్యా!


దర్శకురాలిని అవుతా!

నేను టెక్సాస్‌లో బ్యాచిలర్‌ ఇన్‌ జనరల్‌ బిజినెస్‌ చేశా. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఎఫ్‌ఐడీలో మాస్టర్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ మార్కెటింగ్‌లో మాస్టర్స్‌ చేశా. ఇది పూర్తయిన తర్వాత లండన్‌లో విజువల్‌ మర్చంటైజింగ్‌ చేసి.. మైఖర్‌ కోర్స్‌ బ్రాండ్‌కు వర్కింగ్‌ మేనేజర్‌గా పనిచేసా. దాదాపు 15 ఏళ్లు విదేశాల్లో ఉన్న తర్వాత 2013లో తిరిగొచ్చా. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ మా అన్నయ్య. తను ‘బాద్‌షా’ సినిమా చేస్తున్నప్పుడు - ‘ఓ ప్రయత్నం చేయి’ అన్నాడు. అలా నా సినిమా ప్రయాణం మొదలయింది. ఇప్పటి దాకా నేను 78 సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశా. నాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ మాత్రమే కాదు.. పాటలు, కవిత్వం- ఇవన్నీ కూడా ఇష్టమే. నేను ఇప్పటి దాకా 15 పాటలు రాశా. నేను రాసిన  ‘వేవ్స్‌ శాండ్‌ అండ్‌ మేజిక్‌’ పుస్తకం గత ఏడాది విడుదలయింది. దర్శకత్వం చేయాలనే ఉద్దేశంతో కథలు రెడీ చేసుకున్నా. ఈ ఏడాది దర్శకత్వం చేస్తా.


‘శ్యామ్‌ సింగరాయ్‌’లో సాయి పల్లవి కాస్ట్యూమ్స్‌ చాలా భిన్నంగా ఉంటాయి. దేవదాసిగా అంతర్‌మహల్‌లో ఉన్నప్పుడు ఒక రకమైన వేషధారణ ఉంటుంది. నృత్యకళాకారిణిగా మరో రకమైన వేషధారణ ఉంటుంది. ఇలా తనకు తగినట్లు కాస్ట్యూమ్స్‌ రూపొందించాం. వాటికి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే కృతి ఆధునిక యువతి. స్వతంత్ర భావాలున్న యువతి. అందుకే ఫ్లోరల్‌ ప్రింట్స్‌ కాకుండా లెదర్‌ జాకెట్స్‌, రిప్డ్‌ జిన్స్‌ వాడాం. నానీకి రెండు రకాల పాత్రలు ఉన్నాయి. వీటికి కూడా వైవిధ్యం చూపించాం. 


                                                                                                               సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-01-09T05:30:00+05:30 IST