Abn logo
Oct 26 2021 @ 23:50PM

చెల్లింపులకు.. చెక్‌?

దేవరాయబొట్లపాలెం దగ్గర కాల్వలో గుర్రపు డెక్కను తొలగించుకుంటున్న రైతులు

నీరు-చెట్టు బిల్లుల పెండింగ్‌

చెల్లింపులకు సాకులు.. సాగదీత

పనులకు చెక్‌ మెజర్‌మెంట్‌కు ఆదేశాలు 

రెండేళ్ల క్రితం తీసిన పూడికతీత ఇప్పుడు కనిపించేనా

బిల్‌ నంబర్లు అడిగినా కాంట్రాక్టర్లకు ఇవ్వని అధికారులు

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులపై హైకోర్టు ఆదేశించినా తాత్సారం 


నీరు-చెట్టు పథకం పనులు బిల్లుల చెల్లింపులు ఇప్పట్లో జరిగేలా లేవు. సాకులు వెతుకుతూ అధికారులు సాగదీస్తున్నారు. మూడేళ్ల క్రితం చేసిన ఆయా పనులకు ఇప్పుడు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడు చేసిన పనులకు ఇప్పుడెలా నిర్ధారిస్తారో తెలియడంలేదు. ఈ విషయం తెలిసి అప్పట్లో పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం చెరువులు, కాల్వల్లో పూడిక తీస్తే ఇప్పుడెలా లెక్కగట్టాలో అధికారులకు సైతం అర్థం కావడంలేదు. అప్పుడు నాటిన మొక్కలు కొన్నిచోట్ల మానులైపోగా కొన్ని ఎండిపోయాయి. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించాలంటే మళ్లీ ఆ పనులను పరిశీలించాలని, తాజాగా చెక్‌ మెజర్‌మెంట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనికితోడు ఒక్కో సబ్‌డివిజన్‌కు చెందిన ఈఈ తన పరిధిలో కనీసం 50 శాతం పనులను పరిశీలించాలని మెలిక పెట్టింది. ఈ పరిస్థితుల్లో నీరు-చెట్టు కాంట్రాక్టర్‌లకు తోడు సాగునీటి సంఘాలు కూడా కోర్టును ఆశ్రయిచేందుకు సిద్ధమవుతున్నారు. 


 రూ.కోట్లలో పెండింగ్‌

జిల్లాలో గత ప్రభుత్వంలో చేపట్టిన నీరు చెట్టు పథకం పనులకు సంబంధించి రూ.కోట్లలో బిల్లులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం రూ.163 కోట్ల వరకు పనులు చేస్తే, వాటిలో పథకం ప్రారంభంలో చేసిన పనులకు అప్పట్లోనే బిల్లులు మంజూరయ్యాయి. చివరి విడతలో చేసిన పనుల బిల్లులు ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. గుంటూరు సబ్‌ డివిజన్‌లో రూ.17.5 కోట్లు, తెనాలి సబ్‌ డివిజన్‌లో 7.2 కోట్లు, నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.4.9 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సాగునీటి సంఘాలు చేసిన పనులకు  రూ.138 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు సమాచారం. అన్నీ పరిశీలిస్తే పెండింగ్‌ బిల్లులు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటాయని తెలుస్తుంది. 


తెనాలి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాల పరిరక్షణ, వృద్ధి, వృక్షాలతో పచ్చదనం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం 2015లో నీరు-చెట్టు పఽఽథకాన్ని ప్రవేశపెట్టింది. చెరువుల పూడికతీసి నీటిని ఇంకేలా చేయడం, కట్టలు బలపరచడం, కాల్వల తవ్వకాలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి పనులు చేశారు. వీటిలో కొన్ని కాంట్రాక్టర్లు చేయగా మరికొన్ని సాగునీటి సంఘాలు పూర్తి చేశాయి. మొక్కలు నాటడం వంటి పనుల్లో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములయ్యాయి. అయితే ఈ పనులకు సంబంధించి చాలావరకు నిధుల భాగస్వామ్యం తగ్గించి, తప్పనిసరి అనుకున్నవాటికి నిధులు ఖర్చుపెట్టారు. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం నీరు చెట్టు పనుల్లో రూ.వేలకోట్లలో అవకతవకలు జరిగాయని బిల్లులు ఆపేశారు. రెండున్నరేళ్ల నుంచి వీటి బిల్లులను చెల్లించకుండా కాంట్రాక్టర్లను, సాగునీటి సంఘాల నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా చెల్లింపుల్లో జాప్యం చేసేందుకు  అధికారులు సవాలక్ష మెలికలు పెడుతూ జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నాటి పనులకు నేడు లెక్కలెలా?

ఈ పథకంలో ఎక్కువ శాతం భూగర్భ జలాలు వృద్ధి, మొక్కలు నాటటం వంటివాటికే ప్రాథాన్యం ఇచ్చారు. అయితే కాలువలు, చెరువుల్లో చేసిన పనులు ఇప్పుడు ఎలా కనిపిస్తాయనేది అంతుబట్టని ప్రశ్న. పనులు చేసిన వెంటనే చేస్తేనే లెక్కకు అందుతుంది. ఒకసారి చెరువులోకి కానీ, కాల్వలోకి కానీ నీరు వచ్చిందంటే ఆ ఆనవాళ్లన్నీ కరిగిపోతాయి. పనులు చేశాక మూడు సీజన్‌లు ముగిసిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కాల్వలుకూడా నీటితో నిండటంతో ఆ మాత్రం కూడా ఆధారాలు లేని పరిస్థితి. అటు కట్టలు బలపరిచిన పనులు కూడా ఇదే తీరులో ఉన్నాయి. ఈ తరుణంలో ఆయా పనులు చేశారా లేదా.. ఎంత స్థాయిలో పనులు చేశారనే ఆధారాలు ఇప్పుడు చూపడం అసాధ్యం. తూటు కాడ తొలగింపు పనులు ప్రతీఏటా చేయాలి.  మూడేళ్ల తర్వాత వీటిని ఎట్లా లెక్కకడతారేది ప్రశ్న. సాకులు చెప్పి, బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేసేందుకు చేస్తున్న పనులు మినహా ఇవేమీ సాధ్యంకాదనేది విశ్రాంత ఇంజనీర్లు చెబుతున్నారు. పనుల్లో కేవలం కాంక్రీట్‌ పనుల వంటివి మాత్రమే కంటికి కనిపిస్తాయి. చెక్‌డ్యామ్‌లు, షట్టర్ల మరమ్మతుల వరకు చెక్‌మెజర్‌మెంట్లు చేయవచ్చు. మట్టి పనులను అంచనా వేయటం సాధ్యంకాని పరిస్థితే. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏంచేస్తారనేది అంతుపట్టని విషయం. ఇంజనీరింగ్‌ విభాగంలో జరిగిన పనులను సంబంధిత శాఖల అధికారులతోపాటు అనేక దశల్లో నాణ్యతా ప్రమాణాల పరిశీలన ఉంటుంది. పనులు చేయకుండా కానీ, నాణ్యత లేకుండా బిల్లులు మంజూరు చేస్తే క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో దొరికిపోతారు. అప్పటికీ లోపాలుంటే ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఏజన్సీకి పరిశీలిస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం నీరు-చెట్టు పనుల విషయంలో వీరంతా చేసిన తనిఖీలను పక్కనపెట్టి, తాజాగా మళ్లీ పరిశీలించాలని ఆదేశాలిచ్చారంటే, వారు చేసిన తనిఖీల విషయంలో లోపాలున్నట్లే కదా. అదే నిజమైతే ఈపాటికే ఆ శాఖలోని అధికారులపై చర్యలకు సిద్ధమవ్వాలి. కానీ ఇంతవరకు ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చాలాచోట్ల కొందరు బదిలీ అయినా, దగ్గర సబ్‌డివిజన్‌ల పరిధిలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీ చేసినా ఈ అధికారులే చేయాలి. గత ప్రభుత్వ కాలంలో ఉన్న అధికారులపై అనుమానాలుంటే, కొత్తగా తనిఖీ బృందాలను నియమించాలి. కానీ ప్రభుత్వం అదేమీ చేయలేదు. వీటిని చూస్తుంటే పనుల్లో లోపాల మాట అటుంచితే, బిల్లుల చెల్లింపు విషయంలో కావాలనే తాత్సారం చేస్తున్నారనేది అర్ధమవుతున్నది.


టీడీపీ ఆధ్వర్యంలో పోరాటం

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమై మూడు జిల్లాలకు ఒక నాయకుడిని సహాయకుడిగా పెట్టి, బిల్లుల మంజూరుకోసం న్యాయస్థానం ద్వారా పోరాడాలని సూచించారు. జిల్లాలో రూ.138 కోట్ల పనులు జరిగ్గా వాటికి సంబంధించిన బిల్లులు ఒక రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. వీరుకూడా కాంట్రాక్టర్ల తరహాలోనే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తాము చేసిన పనులకు సంబంధించిన బిల్‌ నంబర్లు చెప్పాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు  నిరాకరిస్తున్నారు. అదేమని నిలదీస్తే కంప్యూటర్‌ పనిచేయటంలేదు.. రేపు రండంటూ రోజూ తిప్పుతున్నారని నాయకులు చెబుతున్నారు. రెండున్నరేళ్లుగా జేబులో డబ్బు పెట్టి పనులు చేయించిన వారికి బిల్లులు చెల్లించకున్నా కనీసం కనికరంకూడా లేకుండాపోయిందని వారు వాపోతున్నారు. దగ్గరుండి పనులు చేయించిన అధికారులు కూడా సహకరించటంలేదంటున్నారు. 


ఒక్కో ఈఈ 50 శాతం పనుల పరిశీలన

సాధారణంగా ఇంజనీరింగ్‌ శాఖల్లో ఏఈ స్థాయి అధికారి ఆయా పనుల ప్రారంభం నుంచి చివరి వరకు పరిశీలిస్తుంటారు. వాటిలో కొన్నిటిని డీఈ స్థాయి అధికారి, అంతకంటే తక్కువ పనులను ర్యాండమ్‌గా ఈఈ స్థాయి అధికారి పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే బిల్లులు చెల్లిస్తారు. అయితే తాజాగా సాగునీటి శాఖలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. గతంలోనే చేసినా, అప్పట్లో అధికారులు పర్యవేక్షించినా, మళ్లీ ఆ పనులను కింది స్థాయి అధికారులతోపాటు, ఈఈ తన పరిధిలో ఉన్న పనుల్లో కనీసం 50 శాతం పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి చెక్‌ మెజర్‌మెంట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఒక ఈఈ పరిధిలో కనీసం 1000 నుంచి 1500 పనుల వరకు ఉన్నాయి. అంటే ఒక్క అధికారి ఆయా పనులను పరిశీలించి చెక్‌ మెజర్‌మెంట్లు సమర్పించాలంటే ఎంతలేదన్నా ఏడాదిపైనే పడుతుంది. ఈ ప్రకారం చూస్తే అప్పటి వరకు బిల్లులు చెల్లించటం సాధ్యంకాదు.