Abn logo
Sep 18 2021 @ 00:24AM

న్యాయాన్ని కాలరాస్తున్న ‘నీట్’

డాక్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు తమిళనాడులో ఎవరికైనా డాక్టర్ రంగాచారి, డాక్టర్ గురుస్వామి ముదలియార్ మొదలైన వారు తప్పక గుర్తుకువస్తారు. ఆ విఖ్యాత వైద్యులు, దేశవ్యాప్తంగా అలాంటి మరెందరో ప్రముఖ వైద్యులు జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ఆధారంగా వైద్యకళాశాలల్లో అడ్మిషన్లు పొందలేదు. వైద్యవిద్య, ఆరోగ్యభద్రతలపై రాష్ట్రప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను ఎవరూ ఏ విధంగా ఉల్లంఘించేందుకు వీలు లేదు.


భారత రాజ్యాంగం రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం వంటిది. మన రాజ్యాంగానికి మూడు జాబితాలు ప్రధాన ఆధారంగా ఉన్నాయి. అవి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని 11వ అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. విశ్వవిద్యాలయాలతో సహా విద్య, కేంద్ర జాబితాలోని 63, 64, 65 అంశాలకు, ఉమ్మడి జాబితాలోని 25వ అంశానికి లోబడి ఉంటుందని ఆ 11వ అంశం పేర్కొంది. ఉమ్మడి జాబితాలోని 25వ అంశంలో సాంకేతిక, విద్య, వైద్యవిద్యతో సహా విద్య, విశ్వవిద్యాలయాలు కార్మికులకు సాంకేతిక, వోకేషనల్ శిక్షణ ఉన్నాయి.


కేంద్రజాబితాలోని 63, 64, 65, 66 అంశాలతో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే అవి కేంద్రప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం స్వీకరిస్తున్న వైజ్ఞానిక సాంకేతిక విద్యాసంస్థలు, శిక్షణాసంస్థల వ్యవహారాలకు, వాటి ప్రమాణాల నిర్ధారణకు సంబంధించినవి. సృజనాత్మక భాష్యం ఆ అంశాలను సమన్వయపరిచింది. ‘విద్య’ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమేనని న్యాయస్థానాలు నిర్ధారించాయి. 42వ రాజ్యంగ సవరణ ఫలితంగా రాష్ట్ర జాబితాలోని 11వ అంశాన్ని పూర్తిగా తొలగించారు. ఉమ్మడి జాబితాలోని 25వ అంశాన్ని పునః లిఖించారు.


రాష్ట్ర జాబితాలోని 11వ అంశం తొలగింపు నిజానికి సమాఖ్య విధానానికి గొడ్డలిపెట్టు లాంటిదేని చెప్పక తప్పదు. రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయాన్ని కూడా అది దెబ్బతీసింది. అత్యవసర పరిస్థితి అనంతరం కేంద్రంలో అధికారానికి వచ్చినవారు విద్యకు సంబంధించి, రద్దయిన అంశాలను మళ్ళీ రాజ్యాంగంలో చేర్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు! 


చారిత్రకంగా, రాష్ట్రాలు వైద్యకళాశాలలను నెలకొల్పుతూ వస్తున్నాయి; అలాగే ప్రైవేట్ వ్యక్తులు వైద్య కళాశాలలను స్థాపించేందుకు అనుమతిస్తున్నాయి. ఆ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థుల అడ్మిషన్లను రాష్ట్రాలు క్రమబద్ధం చేస్తున్నాయి. వైద్య విద్య ప్రమాణాలు, నాణ్యత కాలక్రమేణా మెరుగుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఈ వైద్య కళాశాలల నుంచి ప్రపంచ ప్రఖ్యాతులైన డాక్టర్లు ప్రభవించారు. డాక్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు తమిళనాడులో ఎవరికైనా డాక్టర్ రంగాచారి, డాక్టర్ గురుస్వామి ముదలియార్ మొదలైనవారు తప్పక గుర్తుకువస్తారు. మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రవేశద్వారం వద్దే ఆ మహనీయులు ఇరువురి విగ్రహాలు ఉన్నాయి. భావి డాక్టర్లు వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వైద్య విద్యారంగం, ఆరోగ్యభద్రతా రంగంలో తమిళనాడు దేశంలోనే ప్రథమస్థానంలో ఉందనేది అందరూ అంగీకరిస్తున్న సత్యం. చెప్పవచ్చినదేమిటంటే ఆ విఖ్యాత వైద్యులు, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న అలాంటి ప్రముఖ వైద్యులు జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ఆధారంగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు పొందలేదు. 


వైద్యవిద్య, ఆరోగ్యభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు న్నాయి. ఆ హక్కులను ఎవరూ ఏ విధంగా ఉల్లంఘించేందుకు వీలు లేదు. ఎందుకని? ప్రజల నుంచి పన్నుల రూపేణా సమకూరుతున్న ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైద్య కళాశాలలను నెలకొల్పుతున్నాయి. సంబంధిత రాష్ట్రప్రజల పిల్లలకు వైద్య విద్యావకాశాలు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కళాశాలలను ఏర్పాటుచేస్తున్నాయి. ఆంగ్లంలోనే వైద్యవిద్యను బోధించేందుకు వాటిని ఉద్దేశించినప్పటికీ కాలక్రమంలో రాష్ట్ర అధికార భాషలోనే వైద్యవిద్యను బోధించాలన్న సంకల్పం ఆ ప్రభుత్వాలకు ఉన్నది. ఆ కళాశాలల్లో చదువుకునేవారు విద్యాశిక్షణల అనంతరం రాష్ట్రప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందించవలసి ఉంది. తాము చికిత్స చేస్తున్న రోగులతో వారి భాషలోనే డాక్టర్లు మాట్లాడవలసి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య భద్రతా సదుపాయాలను ఇతోధికంగా అభివృద్ధిపరచడంతో పాటు ప్రజలకు వైద్యసలహాలు వారి భాషలోనే ఇవ్వాలనేది ఆయా వైద్యకళాశాలల లక్ష్యంగా ఉంది. 


వైద్యవిద్యారంగానికి సంబంధించిన రాష్ట్రప్రభుత్వ నియమ నిబంధనలు సామాజికన్యాయం అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వ బడులలో చదివిన గ్రామీణ విద్యార్థులు, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, అణగారినవర్గాలకు చెందినవారు, తొలితరం విద్యావంతుల అడ్మిషన్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. 


ఉన్నతవిద్యలో, ముఖ్యంగా వృత్తివిద్యాసంస్థలలో ప్రవేశానికి ప్రతిభే ఏకైక ప్రమాణంగా ఉండాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో నిర్దేశించింది. ప్రతిభ ప్రాతిపదికన, పారదర్శకంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహిస్తున్నారు. నిజానికి భారతీయ వైద్యమండలి రూపొందించిన ఒక నియమం ద్వారా ‘నీట్’ నిర్వహణ అమల్లోకి వచ్చింది. 2016లో ఒక సవరణ ద్వారా భారతీయ వైద్యమండలి చట్టంలోని 10డి సెక్షన్‌లో ఆ నిర్ణయాన్ని చేర్చారు. ‘ప్రతిభ’ అనే గీటురాయిపై చర్చను ప్రస్తుతానికి పక్కన పెట్టి, తమిళనాడు వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై ‘నీట్’ ప్రభావం గురించి జస్టిస్ ఎ.కె.రాజన్ కమిటీ నివేదిక వెల్లడించిన వాస్తవాలను నిశితంగా పరిశీలిద్దాం. నీట్ నిర్వహణకు ముందు 2016–17 విద్యా సంవత్సరంలోనూ, నీట్ ప్రారంభమైన తరువాత 2020–21 విద్యా సంవత్సరంలో వైద్యకళాశాల్లో ప్రవేశాల తీరుతెన్నులు దిగువన ఇస్తున్నాను. ఆయా అంశాలకు సంబంధించిన మొదటి సంఖ్య 2016–17, విద్యా సంవత్సరానికి, రెండో సంఖ్య 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించింది. తమిళనాడు రాష్ట్ర బోర్డు పాఠశాలల్లో చదివి వైద్యవిద్యలో ప్రవేశించినవారు 98.23, 59.41 శాతం; సిబిఎస్ఇ విద్యార్థులు: 0.97, 38.84; ప్రభుత్వ వైద్యకళాశాల్లో గ్రామీణ విద్యార్థులు: 65.17, 49.91; ప్రైవేట్ వైద్యకళాశాలల్లో గ్రామీణ విద్యార్థులు: 68.49, 47.14; తమిళ మాధ్యమంలో చదివినవారు: 14.88, 1.89 శాతం. 


ఇప్పుడు మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి: రాష్ట్రప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ప్రభుత్వ వైద్యకళాశాలలను ఎందుకు నెలకొల్పాలి? పాఠశాల విద్యార్థులు మాతృభాషా మాధ్యమంలో ఎందుకు చదవాలి? స్టేట్‌బోర్డ్ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చదవాలి? ఆ బోర్డ్ నిర్వహించే పరీక్షలను ఎందుకు రాయాలి? అసలు స్టేట్‌బోర్డ్ ఎందుకు ఉండాలి? పట్టణ ప్రాంతాల విద్యార్థులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో, తాలూకాస్థాయి ఆసుపత్రులలో పనిచేస్తారా? ఉన్నతవిద్య, వృత్తివిద్యలో ప్రవేశాలకు ‘ప్రతిభ’ను గీటురాయిగా తీసుకోవాలనేది ఒక అవాస్తవిక వాదన. ‘నీట్’ న్యాయవిరుద్ధం. అది ఉన్నత విద్యారంగంలో ఒక అధర్మయుగానికి నాంది అవుతుంది సుమా!


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ప్రత్యేకంమరిన్ని...