90 రోజుల తర్వాతే ‘నీట్‌ బిల్లు’లో కదలిక!

ABN , First Publish Date - 2022-05-07T13:42:14+05:30 IST

నీట్‌ పరీక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు రాష్ట్రపతికి చేరడానికి మరో మూడు నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజ్‌భవన్‌ నుంచి అది

90 రోజుల తర్వాతే ‘నీట్‌ బిల్లు’లో కదలిక!

చెన్నై: నీట్‌ పరీక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు రాష్ట్రపతికి చేరడానికి మరో మూడు నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజ్‌భవన్‌ నుంచి అది బయటపడినా, రాష్ట్రపతికి చేరేందుకు మరెంతో ప్రక్రియ జరగాల్సి వుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 13వ తేదీన జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ నివేదిక అంశాల ఆధారంగా చేసుకుని తొలిసారిగా శాసనసభలో ఆమోదించి పంపిన ఈ బిల్లును గవర్నర్‌ తిరస్కరించారు.. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన రెండోసారి శాసనసభలో మరిన్ని అంశాలను చేర్చి ఆమోదించిన బిల్లును గవర్నర్‌ పరిశీలనకు పంపారు. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లును గవర్నర్‌ తిప్పి పంపేందుకు అవకాశం లేకపోవడంతో ఆయన ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు తప్పనిసరిగా పంపాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ఆ బిల్లు రాజ్‌భవన్‌ నుంచి కదిలేందుకు 86 రోజులు పట్టింది. మూడు రోజుల ముందు నీట్‌ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్‌ పంపినట్లు రాజ్‌భవన్‌ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. నీట్‌ బిల్లును రాష్ట్రపతికి గవర్నర్‌ పంపినా, అంతకంటే ముందు కేంద్ర న్యాయశాఖ ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. న్యాయశాఖ పరిశీలించిన మీదటే నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ అధికారులు నీట్‌ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. న్యాయనిపుణుల సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తున్నారు. ఈ తతంగమంతా ముగియడానికి సుమారు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాతే బిల్లు రాష్ట్రపతికి చేరుతుంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఇదేరీతిలో పంపిన నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే గత ప్రభుత్వంలా తాము తేలికపాటి అంశాలతో నీట్‌ మినహాయింపు బిల్లును రూపొందించలేదని, జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ నివేదిక అంశాలను కూడా చేర్చి పంపటంతో రాష్ట్రపతి ఆమోదం తప్పక లభిస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల తర్వాత నీట్‌ మినహాయింపు బిల్లు రాష్ట్రపతికి చేరినా దానిని వెంటనే ఆమోదించటమో, తిరస్కరించటమో జరుగదని, కనీసం నెల రోజులపాటైనా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్న నీట్‌ మినహాయింపు బిల్లు 90  రోజుల తర్వాతే రాష్ట్రపతి భవన్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

Read more