ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువు దూరం

ABN , First Publish Date - 2020-03-14T07:16:25+05:30 IST

పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి.. దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు. నలుగురూ సుగుణోపేతులే. తండ్రి ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు

ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువు దూరం

పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి.. దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు. నలుగురూ సుగుణోపేతులే. తండ్రి ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు.  ఆ ఊరి పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడున్నాడు. అతడి పేరు దూషణుడు. లోకంలో అందరినీ బాధపెడుతూ ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఉజ్జయినిలో ఈ నలుగురూ శివార్చన చేస్తున్న విషయం తెలుసుకున్న దూషణుడు వారి వద్దకు వచ్చి.. ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలు లేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? అటువంటివాళ్లను నేను ఎందరినో గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చెయ్యనా?’ అని అడిగాడు. దూషణుడి మాటలకు వాళ్లు కొంచెం కూడా బెదరలేదు. ‘తుచ్ఛుడు.. వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే సమయం వృథా అయిపోతుంది. హాయిగా మనం శంకరుడిని నమ్ముకుని ఉందాము. శంకరుని రక్షణయందు ఉండగా మనకు భయం ఏమిటి!’ అని శివపూజపై మనసు లగ్నం చేశారు. దూషణుడు ఆ నలుగురి మీదకు కత్తి ఎత్తాడు. అయినా వాళ్లు కదల్లేదు. కనీసం కత్తికి బెదిరి చెయ్యి కూడా అడ్డుపెట్టకుండా.. ‘హరఓం హర హర’ అంటూ అలాగే కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునయినా ఈశ్వరుడు తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు తప్పనిసరిగా రక్షింపబడతాడు. ఆ నలుగురు బ్రాహ్మణకుమారులూ దీన్నే నమ్మి మట్టితో చేసిన చిన్న పార్థివ లింగానికిఆరాధన చేస్తున్నారు. దూషణుడు వారిపైకి కత్తి ఎత్తగానే.. ఆ పార్థివలింగం నుంచి పరమేశ్వరుడు మహాకాళ స్వరూపంతో బయటకు వచ్చి కోపంతో ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడు, అతని సైనికులు బూడిదరాశులై పడిపోయారు. కానీ.. ఆ వేడి అక్కడే కూర్చున్న నలుగురు బ్రాహ్మణ కుమారులను మాత్రం ఏమీ చేయలేదు. వేడి ధర్మం కాల్చడమే. అగ్నిహోత్రం ఒకరిని కాల్చి వేరొకరిని వదలదు. కానీ, ఆ వచ్చిన వేడి పరమాత్మ స్వరూపం. అందుకే దూషణుని, అతని సైన్యాన్ని మాత్రమే కాల్చి స్వామి భక్తులైన ఆ నలుగురిని మాత్రం కాపాడింది. అప్పుడు బ్రాహ్మణ కుమారులు ఆ స్వామిని.. చనిపోయేవారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. అంతమందిని చంపి.. అక్కడే ఉన్న తన భక్తులైన నలుగురిని వదిలిన రూపం. కాబట్టి అది మహాకాళ స్వరూపం. ఆ రూపాన్ని చూసి దేవతలు పొంగిపోయి స్వామిని స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా మీరు ఇక్కడ లింగరూపంలో ఉద్భవించండి. ఇటువంటి సజ్జనులు, మీమీద పూనిక ఉన్నవాళ్లు, మీరు ఉన్నారని నమ్మినవాళ్లు ఎవరు ఇక్కడికి వస్తారో వారు అకాలంగా పడిపోకుండా అనుగ్రహించడానికి స్వయంభూలింగంగా ఉండాలి’ అని అడిగారు. వారి కోరిక మేరకు అక్కడ మహాకాళ లింగంగా ఆవిర్భవించాడు. మనకు భయం వేసినప్పుడు ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని పరమేశ్వరుని ధ్యానిస్తే తక్షణం మన భయం తొలగిపోతుంది. ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. వాయులింగమై వాయురూపంలో.. ఆకాశరూపంలో ఆకాశలింగమై ఆ స్వామి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవారికి అపమృత్యువు లేదు.

- చాగంటి కోటేశ్వరరావు శర్మ

Updated Date - 2020-03-14T07:16:25+05:30 IST