అమెరికాలో ఎంట్రీకి నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-01-13T20:08:10+05:30 IST

కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా.. అంతర్జాతీయ ప్రయాణికుల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో ఎంట్రీకి నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి

వాషింగ్టన్: కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా.. అంతర్జాతీయ ప్రయాణికుల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలోకి ప్రవేశించాలంటే ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. అది కూడా ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. జనవరి 26 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అయితే, రెండేళ్లలోపు వయసు గల చిన్నారులు, విదేశాలకు కాకుండా దేశంలోనే ఒకచోటు నుంచి మరో చోటికి ప్రయాణించేవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ, ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చే అమెరికన్లకు కూడా ఈ ఆంక్షలను వర్తింపజేయనున్నట్లు సీడీసీ డైరెక్టర్ మార్క్ రెడ్‌ఫీల్డ్ వెల్లడించారు. కెనడా కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ నెల 7వ తేదీ నుంచి ఇలాంటి ఆంక్షలను విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదిలాఉంటే.. అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి ఇప్పటికే 2కోట్ల 33 లక్షల మందికి ప్రబలింది. ఇందులో 3.80 లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. 

Updated Date - 2021-01-13T20:08:10+05:30 IST