‘బిగ్‌బుల్‌’కు ఎదురుగాలి ?

ABN , First Publish Date - 2021-12-01T22:20:53+05:30 IST

మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పిలువబడే ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు ఎదురుగాలి వీస్తోందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.

‘బిగ్‌బుల్‌’కు ఎదురుగాలి ?

ముంబై : మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పిలువబడే ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు ఎదురుగాలి వీస్తోందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఆయనకు చెందిన తాజా స్టాక్ పిక్స్... మార్కెట్‌లో కొంతమేర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ స్టాక్‌లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 30 శాతం వరకు తగ్గాయని డేటా చెబుతోంది. ఏస్ ఇన్వెస్టర్ సెప్టెంబరు త్రైమాసికంలో నాల్కో, కెనరా బ్యాంక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ అనే మూడు కౌంటర్లలోకి ప్రవేశించారు. ఈ మూడూ ఆయనకు ఒకింత సమస్యాత్మకంగానే మారాయి.  రెండో త్రైమాసికంలో ఝున్‌ఝున్‌వాలా... నాల్కోలో 1.4 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ స్టాక్ అక్టోబరు 18 న గరిష్టంగా ఉన్న రూ. 124.75 నుంచి 29.5 శాతం పడిపోయింది.


కంపెనీలో ఝున్‌ఝున్‌వాలా వాటా విలువ రూ. 220 కోట్లు. ఇక కెనరా బ్యాంక్ విషయానికొస్తే... స్క్రిప్ నవంబరు 9 నాటి గరిష్ట స్థాయి రూ. 247.60 కంటే 20 శాతం తగ్గింది. కొన్ని బ్రోకరేజీలు స్టాక్‌ను మంచి టెక్నికల్ కొనుగోలుగా భావించినప్పటికీ, స్టాక్‌పై పన్నెండు నెలల ప్రాథమిక లక్ష్యం ఎటువంటి పెరుగుదలనూ సూచించలేదు. మరో స్టాక్ ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ విషయానికొస్తే... ఈ స్టాక్ నవంబరు 9 నాటి గరిష్ట స్థాయి రూ. 195.90 నుంచి 16 శాతం క్షీణించింది. చాలా బ్రోకరేజీలు ఈ స్టాక్‌ను ట్రాక్ చేయలేదు. ఈ రియల్టర్... ఎంబసీ గ్రూప్‌తో తన విలీనాన్ని పూర్తి చేసే ప్రక్రియలో ఉంది. పలు ల్యాండ్ బ్యాంక్‌లు, ఎంఎంఆర్ ముఖ్య మార్కెట్‌లలో గణనీయమైన అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్న అత్యంత విభిన్నమైన రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా నిలిచేందుకు ఇండియా బుల్స్‌కు ఈ విలీనం ఓ అవకాశంగా కలిసి రానుంది.

Updated Date - 2021-12-01T22:20:53+05:30 IST