పాలకుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-06T08:18:54+05:30 IST

పెద్దేరు జలాశయం నిర్మించి దశాబ్దన్నర కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క ఏడాది కూడా పూర్తి ఆయకట్టుకు నీరు అందలేదు.

పాలకుల నిర్లక్ష్యం

పెద్దేరు రైతుకు శాపం

రిజర్వాయర్‌ నిర్మించి 15 ఏళ్లయినా పూర్తికాని కాలువల తవ్వకం

20 వేల ఎకరాలకుగాను సగం ఆయకట్టుకే నీరు

రావికతమం, బుచ్చెయ్యపేట మండలాల పరిస్థితి దయనీయం

8,500 ఎకరాల్లో నీరు అందున్నది 1,500 ఎకరాలే

బుచ్చెయ్యపేట మండలానికి చుక్క నీరు అందని దుస్థితి

కాలువల తవ్వకంలో సాంకేతిక లోపాలు

పలుచోట్ల గండ్లు, కాలువల్లో పేరుకుపోయిన పూడిక

ప్రతిపాదనలకే పరిమితమైన ఆధునికీకరణ పనులు


మాడుగుల రూరల్‌/ రావికమతం/ బుచ్చెయ్యపేట, జూన్‌ 5:

పెద్దేరు జలాశయం నిర్మించి దశాబ్దన్నర కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క ఏడాది కూడా పూర్తి ఆయకట్టుకు నీరు అందలేదు. మొత్తం ఆయకట్టు 20 వేల ఎకరాలుకాగా సగానికి విస్తీర్ణానికి మాత్రమే నీరు అందుతున్నది. ముఖ్యంగా కుడి కాలువ పరిధిలోని బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో సుమారు తొమ్మిది వేల ఎకరాలకుగాను రావికమతం మండలంలో సుమారు 1,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. బుచ్చెయ్యపేట మండలానికి దాదాపు పదేళ్ల నుంచి పెద్దేరు నీరు రావడం లేదని రైతులు చెబుతున్నారు. కాలువల తవ్వకంలో సాంకేతిక తప్పిదాల కారణంగా గట్లకు ఎక్కడికక్కడ గండ్లు పడడం, పిచ్చిమొక్కలు పెరిగిపోయి, పూడిక పేరుకుపోవడం, సిమెంట్‌ లైనింగ్‌ చేయకపోవడం, అక్విడక్టులు శిథిలావస్థకు చేరడం, ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు కాకపోవడం వంటివి ఆయకట్టు రైతులకు శాపంగా మారాయి.


మాడుగుల మండలం రావిపాలెం వద్ద పెద్దేరు నదిపై 2003లో జలాశయం నిర్మాణ పనులు చేపట్టారు. రూ.41.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఈ పనులు 2006నాటికి పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాలువల ద్వారా మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో 19,969 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రణాళిక. కుడికాలువ పొడవు 49 కి.మీ.కాగా 29 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. ఎడమ కాలువ కన్నా ఎక్కువ ఎత్తులో వుండడం, రెగ్యులేటర్‌ లేకపోవడంతో కుడి కాలువకు నీరు సరిగా పారడంలేదు. ఈ కాలువ ఆయకట్టు 12,433 ఎకరాలు. కానీ మాడుగుల, రావికమతం మండలాల్లో 3,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. అది కూడా ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రమే సరఫరా అవుతున్నది. 4,500 ఎకరాల ఆయకట్టు వుండగా, ఒక్క ఎకరాకు కూడా నీరు రావడంలేదు. 


పెద్దేరు కుడి కాలువ కింద రావికమతం మండలంలో 17 గ్రామాలకు చెందిన 4,013 ఎకరాల ఆయకట్టు వుంది. కాలువ నుంచి చెరువులకు, వాటి నుంచి ఆయకట్టుకు నీరు అందించాలి. కానీ గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో నీరు సరఫరా కాలేదు. కవ్వగుంట, బుడ్డిబంద, చినపాచిల, కేబీపీ అగ్రహారం గామాల పరిధిలో సుమారు 1,500 ఎకరాకు మాత్రమే నీరు అందుతున్నది. మిగిలిన ఆయకట్టు రైతులు ఎన్నోమార్లు ప్రజాప్రతినిధులను, మంత్రులను కలిసి విన్నవించారు. రెండు మూడు దఫాలు కాలువకు నామమాత్రంగా మరమ్మతులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 


పెద్దేరు కుడి కాలువ ద్వారా బుచ్చెయ్యపేట మండలంలో పది గ్రామాల పరిధిలో 4,500 ఎకరాల ఆయకట్టు వుంది. రిజ్వర్వాయర్‌ నిర్మాణం పూర్తయిన తొలి రెండేళ్లు మాత్రమే ఈ మండలానికి నీరు వచ్చింది. కానీ ఇంజనీరింగ్‌ అధికారుల నైపుణ్యత లోపం కారణంగా కుడి కాలువ నిర్మాణం లోపభూయిష్టంగా జరిగింది. నీటి ప్రవాహం సరిగా లేక కాలువ గట్లకు గండ్లు పడడం మొదలైంది. లోపాలను సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. పుష్కర కాలం నుంచి ఈ మండలానికి పెద్దేరు నీరు రావడంలేదు.


ఏ పనులు.... ఎంత నిధులు...

కుడి కాలువ పూర్తిస్థాయిలో తవ్వకం, ఇప్పటికే వున్న కాలువల్లో పూడికతీత, సిమెంట్‌ లైనింగ్‌ పనులు, మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. ఈ పనులకు సుమారు రూ.50 కోట్లు అవసరం అవుతాయని అంచనా. 


కుడి కాలువపై ఫోర్‌ఎల్‌ఏ మైనర్‌ కాలువ నిర్మాణం కూడా కలగానే మిగిలింది. మాడుగుల మండలంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో 648 ఎకరాల ఆయకట్టు వుంది. రూ5.62 కోట్ల వ్యయంతో 2009లో అప్పటి రాష్ట్ర మంత్రి కొణతాల రామకృష్ణ, ప్రస్తుత  చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శంకుస్థాపన చేశారు. రూ.18 లక్షలు మాత్రమే విడుదల కావడంతో ఐదు కిలోమీటర్లకుగాను 300 మీటర్లు మాత్రమే కాలువ తవ్వారు. రెండేళ్ల కిందట ఈ కాలువ నిర్మాణానికి రూ.6.6 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు చేపట్టలేదు.


ఎడమ కాలువలో తుప్పలు బాగా పెరిగిపోయాయి. సిమెంట్‌ లైనింగ్‌ చేయలేదు. దీంతో పూడికపేరుకుపోయింది. పలుచోట్ల గట్లు బలహీనంగా మారాయి. ఆయకట్టుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఆధునికీకణ పనులు చేపట్టాలని, దీనివల్ల నీరు వృథా కాదని రైతులు అంటున్నారు. ఈ పనుల కోసం రూ.30 లక్షలు అవసరమని గతంలో అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు విడుదల కాలేదు.


మా గ్రామంలో అన్నీ మెట్ట భూములే. పెద్దేరు జలాశయం కుడి కాలువ ద్వారా మా పొలాలకు నీరు అందుతుందని అప్పట్లో చెప్పారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించగమని భావించాం. ప్రాజెక్టు నిర్మాణం తరువాత తొలి ఏడాదే మాత్రమే నీరు పారింది. ఆ తరువాత ఒక్కసారి కూడా నీరు చూడలేదు. పాలకులు పట్టించుకోవడంలేదు.


కాలువల తవ్వకం లోపభూయిష్టం

కాలువల తవ్వకంలో ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తప్పిదాలు మాకు శాపంగా మారాయి. పల్లంగా ఉండవలసిన కాలువలను పలుచోట్ల ఎత్తుగా తవ్వడంతో నీరు ప్రహించడం లేదు. దీంతో కాలువ గట్లకు గండ్లు పడి, మా మండలానికి నీరు రావడంలేదు.  


నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించాం..కృష్ణారావు, డీఈఈ, పెద్దేరు జలాశయం 

పెద్దేరు జలాశయం పెండింగ్‌ పనులకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ప్రధాన కుడికాలువ పనులకు రూ.49 కోట్లు అవసరమవుతాయి. అలాగే ఫోర్‌ఎల్‌ఏ మైనర్‌ కాలువను పూర్తి చేసేందుకు రూ.8 కోట్లు కావాలి. నిఽధులు మంజూరైతే ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన తరువాత పనులు చేపడతాం. 

Updated Date - 2020-06-06T08:18:54+05:30 IST