అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-01-10T04:45:57+05:30 IST

‘హరితహారం పథకంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందువరుసలో నిలిచింది..

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం

- రెండేళ్లు గడిచినా పూర్తికాని ఎస్‌డీఎఫ్‌ పనులు

- మంజూరైనవి 254 పనులు.. పూర్తయినవి 56..

- ప్రారంభమే కానివి 181..

- ఖజానాలో మూలుగుతున్న నిధులు

- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

‘హరితహారం పథకంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందువరుసలో నిలిచింది.. ఆ నియోజకవర్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసలు కురిపించి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరుచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం వల్ల రెండున్నరేళ్లు గడుస్తున్నా కూడా ఆ నిధులు సద్వినియోగం కావడం లేదు. ఖజానాలోనే మూలుగుతున్నాయి. ఆ నిధులతో 254 పనులు మంజూరుచేసినా ఇప్పటివరకు 56 పనులే పూర్తికాగా, 17పనులు ప్రగతిలో ఉన్నాయి. 181 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 

254 పనులు మంజూరు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 2015-16, 2016-17 సంవత్సరంలో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. అంతేగాకుండా ఇంటింటికి పండ్ల మొక్కలను అందించారు. ఖాళీస్థలాలు, గుట్టలపైన వనాలను పెంచారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017లో అసెంబ్లీ వేదికగా ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరుచేశారు. ఈ మేరకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేసింది. అప్పటివరకు మండలాల వారీగా గ్రామాల్లో 242 పనులు సిమెంట్‌ రోడ్లు, తదితర పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రతిపాదనలను అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వీటిలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. చివరగా 2018 సెప్టెంబర్‌ 5న అప్పటి కలెక్టర్‌ శ్రీదేవసేన 242 పనులకు పరిపాలనా మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత పనుల సంఖ్య 254కు పెరిగింది. జిల్లా పంచాయతీరాజ్‌ శాఖాధికారులు అందించిన ప్రకారం 9కోట్ల 67లక్షల 91వేల అంచనా వ్యయంతో 254 పనులు మంజూరు చేయగా, ఇప్పటివరకు 56 పనులు పూర్తికాగా, 17 పనులు ప్రగతిలో ఉన్నాయి. కోటి 30 లక్షల 66 వేల రూపాయలు వెచ్చించారు. 181 పనులు ఇప్పటికీ ప్రారంభంకాలేదు. 

మండలాల వారీగా మంజూరైన పనులు..

మంజూరైన పనుల్లో అత్యధికంగా పెద్దపల్లి మండలానికి 7 కోట్ల 21 వేల అంచనా వ్యయంతో 191 పనులు మంజూరుచేస్తే, ఇప్పటివరకు 48 పనులు మాత్రమే పూర్తిచేయగా, 4 పనులు ప్రగతిలో ఉండగా, 139 పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. ఎలిగేడులో 17లక్షల 10 వేలతో 4 పనులు, ఓదెల మండలంలో 39 లక్షల 90 వేలతో 14 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కాల్వశ్రీరాంపూర్‌ మండలానికి కోటి 58 లక్షల 10 వేల అంచనా వ్యయంతో 35 పనులు మంజూరు చేశారు. ఇందులో 5 పనులు పూర్తికాగా, 10 పనులు ప్రగతిలో ఉన్నాయి. 20 పనులు పూర్తి కాలేదు. సుల్తానాబాద్‌ మండలానికి 52లక్షల 60వేల రూపాయలతో 10 పనులు మంజూరుచేయగా, ఇప్పటివరకు 3 పనులు పూర్తికాగా, 3 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 4 పనులు ప్రారంభం కాలేదు. ఎస్‌డీఎఫ్‌ నిధులతో అత్యధికంగా సిమెంట్‌ రోడ్ల్లు మంజూరు చేశారు. ఈ పనులు ఆరు మాసాల్లో పూర్తి కావాల్సి ఉండగా రెండేళ్లుగా పూర్తికాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంజూరు చేసిన పనులన్నీ 5లక్షలలోపు ఉన్నవే. నామినేషన్‌ ప్రాతిపదికన టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు అప్పగించారని తెలిసింది. చాలా పనులకు ఇప్పటికీ ఒప్పందాలు కాలేదని తెలుస్తున్నది. పనుల గురించి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ పనులను చేపట్టకపోవడం వల్ల ఆయా గ్రామాల్లో ఇతర గ్రాంట్లతో సిమెంట్‌ రోడ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మట్టి రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఎస్‌డీఎఫ్‌ పనులను పూర్తిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-01-10T04:45:57+05:30 IST