సింగరేణిలో రక్షణపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-05T11:00:01+05:30 IST

రక్షణే ప్రథమం.. రక్షణే ధ్యేయం.. రక్షణతో కూడిన ఉత్పత్తి.. భద్రత ముందు ఉత్పత్తి తరువాత అని నినాదాలు వల్లించే సింగరేణిలో రక్షణ విభాగం నిర్లక్ష్యానికి గురైంది.

సింగరేణిలో రక్షణపై నిర్లక్ష్యం

‘సేఫ్టీ’కి అదనపు బాధ్యతలు

కొందరు అధికారులకే చాలా బాధ్యతలు

గాడి తప్పుతున్న నిర్వహణ

అశ్రద్ధ వల్లే ఓసీపీ ప్రమాదం


గోదావరిఖని, జూన్‌ 4: రక్షణే ప్రథమం.. రక్షణే ధ్యేయం.. రక్షణతో కూడిన ఉత్పత్తి.. భద్రత ముందు ఉత్పత్తి తరువాత అని నినాదాలు వల్లించే సింగరేణిలో రక్షణ విభాగం నిర్లక్ష్యానికి గురైంది. సంస్థలో అత్యంత ప్రధానమైన అనేక పోస్టులకు అదనపు బాధ్యతలు జత కావడంతో నిర్వహణ, పాలన గాడి తప్పింది. సింగరేణిలో ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ తరువాత అత్యంత కీలకమైన, ప్రాధాన్యం కలిగిన అంశం రక్షణ. ఈ విభాగానికి సేఫ్టీ జీఎం ఉంటారు. కానీ సింగరేణిలో ప్రస్తుతం గత కొద్దికాలంగా సేఫ్టీ జీఎం పదవికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బాధ్యులను నియమిస్తున్నారు. రెండు మాసాలుగా సింగరేణికి సేఫ్టీ జీఎంనే లేడు. సీజీఎం(బిజినెస్‌ డెవలప్‌మెంట్‌)కు జీఎం(సేఫ్టీ) అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏ అధికారి కూడా ఈ రెండు కీలక పోస్టులకు న్యాయం చేయలేని పరిస్థితులు ఉంటాయి. 


రక్షణ విషయాలపై చర్చ..

సింగరేణిలో సంస్థ నిర్వహిస్తున్న పనిస్థలాలతో పాటు ప్రైవేట్‌ కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్న పని స్థలాల్లో సేఫ్టీ విషయంలో కూడా సింగరేణి బాధ్యతయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి విధానపరమైన నిర్లక్ష్యాల కారణంగానే ఓసీపీ-1 బ్లాస్టింగ్‌ ప్రమాదం జరిగినట్టు చెప్పుకుంటున్నారు. పేలుడు జరిగి నలుగురు కార్మికులు చనిపోయిన సందర్భంలో సింగరేణి రక్షణ విషయాలపై చర్చ తెరమీదికి వచ్చింది. సింగరేణిలో జీఎం పోస్టుకే పూర్తిస్థాయి బాధ్యుడు లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తున్నది. పూర్తిస్థాయి జీఎంగా ఉన్న నాగభూషణ్‌రెడ్డి రెండు నెలల క్రితం జీఎం(క్వాలిటీ)గా బదిలీ అయ్యారు. అప్పటినుంచి జీఎం(సేఫ్టీ) పోస్టు అదనపు బాధ్యతలను సీజీఎం(బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) ఎం మల్లేశంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్లేశం కూడా మూడు మాసాల్లో పదవీ విరమణ చేయనున్నారు. అటు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ శాఖ విధులతో పాటు అతి ముఖ్యమైన జీఎం(సేఫ్టీ) విభాగం విధులు నిర్వహించడం ఎంత క్రియాశీల అధికారికి అయినా తలకు మించిన భారమే.


ఇదిలా ఉండగా ఇదే రక్షణ విభాగంలో బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎంగా ఉన్న వీరస్వామి ఏడాది క్రితం రిటైర్డ్‌ అయ్యారు. అప్పటి నుంచి జీఎం(సేఫ్టీ) రామగుండం రీజియన్‌ శ్రీనివాస్‌ బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీకి కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన సేఫ్టీ విభాగం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థమవుతున్నది. జీఎం సేఫ్టీ(కార్పొరేట్‌) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లేశం కూడా మణుగూరు జీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఫ్యాటల్‌ సంఘటనలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయనకు జీఎం(సేఫ్టీ) బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. ఉత్పత్తి, భద్రత రెండు రథచక్రాలులాంటివి. సమర్థత కలిగిన రెండుమూడు సంవత్సరాల సర్వీస్‌ కలిగిన అధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే సింగరేణి రక్షణ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సింగరేణి రక్షణపై ఒక ముందస్తు ప్రణాళికతో నిత్యం పరీక్షలు నిర్వహిస్తూ ప్రమాదరహిత సింగరేణిగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నది. 


నామమాత్రంగా రక్షణ సమావేశాలు

ఇదిలా ఉండగా సేఫ్టీ బైపార్టీయేట్‌, సేఫ్టీ త్రైపార్టియేట్‌, పిట్‌ సేఫ్టీ, ఏరియా సేఫ్టీ స్థాయిల్లో జరగాల్సిన రక్షణ సమావేశాలు నామమాత్రంగా మారిపోయాయి. సేఫ్టీ ఆడిట్‌పై అసలు సింగరేణిలో శ్రద్ధ లేకుండా పోయింది. ఇది ఒక్క సింగరేణి సేఫ్టీ విభాగానికి పట్టిన పరిస్థితి కాదు. సింగరేణిలో మైనింగ్‌ అనేది అతికీలకమైన అంశం. మైనింగ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌కు తలకు మించినన్ని అదనపు భారాలు అప్పగించారు. మణుగూరు, కొత్తగూడెం, ఆర్‌జీ-1, 2, 3, అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ, స్టోర్స్‌, సివిల్‌, ఐఈడీ, ఐటీ, ఈఆర్‌పీ, క్వాలిటీ అన్ని విభాగాలను డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చూడాల్సి ఉంటుంది. డైరెక్టర్‌(ప్లానింగ్‌)తో పోల్చుకుంటే డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎక్కువ విభాగాలు నిర్వహిస్తుంటారు. ఈ పోస్టు అత్యంత భారంతో కూడుకున్నది. దీనికి తోడు డైరెక్టర్‌(ఆపరేషన్స్‌)కు డైరెక్టర్‌(పా)గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.


ఇలా డైరెక్టర్‌‘(ఆపరేషన్స్‌), డైరెక్టర్‌(పా)గా రెండు సంవత్సరాల నుంచి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింగరేణిలాంటి అతిపెద్ద సంస్థలో డైరెక్టర్‌(పా) కూడా కీలక పీఠమే. పవిత్రణ్‌ కుమార్‌ ఆదాయ పన్ను శాఖకు వెళ్లిపోవడంతో డైరెక్టర్‌(ఆపరేషన్స్‌)కు డైరెక్టర్‌(పా)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్లకు మరో అత్యంత కీలకమైన డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించడం ఒక్క సింగరేణిలోనే కనిపిస్తున్నది. దీంతో కోర్‌ ఫంక్షన్‌గా ఉన్న మైనింగ్‌తో పాటు డైరెక్టర్‌(పా) బొగ్గు ఉత్పత్తి, రవాణా, భద్రత వ్యవహారాలు కూడా భారమయ్యాయి. డైరెక్టర్‌(పా) పోస్టు వల్ల పారిశ్రామిక సంబంధాలు, పర్సనెల్‌ మేనేజ్‌మెంట్‌, సీఎస్‌ఆర్‌, వెల్ఫేర్‌, విజిలెన్స్‌, హెచ్‌ఆర్‌ఓ, లా, ఈఈ సెల్‌ ఇలా అనేక విభాగాలు డైరెక్టర్‌(పా) పోస్టు కిందకే వస్తాయి.


కార్మిక సంఘాలతో చర్చలు, ప్రభుత్వ శాఖలు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, కోర్టు కేసులు, రక్షణ ఇలా అన్నీ ఒకే సమయంలో నిర్వర్తించడం ఎలా సాధ్యమవుతుంది. రెండు పోస్టులకు ఒక అధికారి పనిచేయడం ఎంత క్లిష్టమవుతుంది. డైరెక్టర్‌(పా) సింగరేణికి లేకుంటే సాధారణంగా డైరెక్టర్‌(ఫైనాన్స్‌)కు ఆ బాధ్యతలు అప్పగించడం సింగరేణిలో ఆనవాయితీ. కానీ రెండు సంవత్సరాలుగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్‌(ఆపరేషన్స్‌)కు డైరెక్టర్‌(పా) బాధ్యతలు అప్పగించడం కూడా సింగరేణిలో కొత్త చరిత్ర. ఇంత పెద్ద భారీ ప్రభుత్వరంగ సంస్థలో ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదనపు బాధ్యతలు తగ్గించి ప్రాధాన్యం కలిగిన విభాగాలకు పూర్తిస్థాయి అధికారిని నియమిస్తే సింగరేణి మరింత శక్తివంతంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సింగరేణిలో అనేక నిర్వహణ తప్పిదాలు, లోపాలు, ప్రమాదాలు అనివార్యం కానున్నాయి. 

Updated Date - 2020-06-05T11:00:01+05:30 IST