Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్లక్ష్యపు మొలకలు

 ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు 

వర్షాలకు తడిసి, ముద్దవుతున్న ధాన్యం బస్తాలు 

మొలకెత్తుతున్న ధాన్యం

ఓవైపు కొనుగోళ్లలో అలసత్వం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఆగమవుతున్నారు. పంట వేసింది మొదలు విక్రయించేవరకూ నానా తంటాలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ధాన్యం విక్రయంకోసం రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులుకాస్తున్నారు. ఈలోపే వర్షాలు కురిసి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోతోంది. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండడంతో ఆరబెట్టే పరిస్థితి లేకుండాపోయి, అనేక కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తుతోంది. 


తుర్కపల్లి, భువనగిరి రూరల్‌, చౌటుప్పల్‌ రూరల్‌, నవంబరు 23: తుర్కపల్లి మండలంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. చేతికొచ్చిన పంట విక్రయిద్దామంటే పరిస్థితులు అనుకూలించగా, నష్టాలపాలవుతున్నారు. మండలంలోని వెంకటాపూర్‌, దత్తాయపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని రైతులు 20 రోజుల క్రితమే వరి కోతలు కోసి ధాన్యాన్ని తుర్కపల్లి-యాదగిరిగుట్ట ప్రధాన రహదారి వెంట ఆరబెట్టారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం కురుస్తుండడంతో ధాన్యం రాశుల కిందికి నీరు చేరి తడిసి మొలకెత్తాయి.  దీంతో ఒక్కో రైతుకు సుమారు ఎనిమిది క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లినట్లు వేలుపల్లి గ్రామానికి చెందిన రైతు మార్క మల్లేశం తెలిపారు. కొంతమంది రైతులు అప్పుడే తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించారని తెలిపారు. 


కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం  

భువనగిరి మండలంలోని నందనం ఐకేపీ కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తింది. 20 రోజులక్రితం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు క్యాసాని వెంకటేశ్‌ 200 బస్తాలు, మందాడి నర్సింహారెడ్డి 200బస్తాలు, రావి కిరణ్‌రెడ్డి 700 బస్తాల ధాన్యాన్ని సమీప గ్రామమైన నందనం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి విక్రయించుకునేందుకు తీసుకొచ్చారు. నిర్వాహకులు తేమ, తాలు, సాకుతో ధాన్యాన్ని నిరాకరించారు. దీంతో రైతులు ఆ ధాన్యాన్ని 20 రోజుల నుంచి కేంద్రంలో ఆరబెట్టుకున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షానికి ఎండిన ధాన్యం మళ్లీ తడిసింది. దీంతో ముగ్గురు రైతులకు చెందిన దాదాపు 600 బస్తాల ధాన్యం తడిసిపోయింది. తాము ఆరబెట్టుకున్న ధాన్యాన్ని అప్పుడే కొనుగోలు చేస్తే, ఈ నష్టం జరగకుండా ఉండేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు తరలించే విధంగా జిల్లా పౌరసరఫరాల అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. 


కాంటా వేయని నిర్వాహకులు 

కల్లాల్లో ధాన్యాన్ని అరబెట్టినా తేమశాతం ఎక్కువగా ఉంటుందనే కారణంతో నిర్వాహకులు కాంటా వేయడంలేదు. కాంటావేసినా లారీలు సక్రమంగా రావడంలేదు. తమకు పాత రేట్లతో గిట్టుబాటు కావడంలేదని లారీ యజమానులు సతాయిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలను కేంద్రాలకు తరలించడం కూడా నిర్వాహకులకు సమస్యగా మారింది. ఇదిలా ఉంటే ఒకవేళ కాంటా వేసినా రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉండటంతో మళ్లీ తేమశాతంలో తేడా వస్తుంది. మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని తరలించగా మిల్లర్లు తేమశాతం ఎక్కువగా ఉందని, నూక అవుతాన్నాయని నాణ్యత పేరిట కొర్రీలుపెడుతూ లారీలను వెనక్కి పంపుతున్నారు. బస్తాకు రెండు కిలోలు తగ్గిస్తేనే కొనుగోలు చేస్తామని సతాయిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు అలస్యం కావడానికి గోనెసంచులు కూడా కారణంగా తెలుస్తోంది. సకాలంలో మార్కెటింగ్‌ అధికారులు గోనె సంచులు సక్రమంగా సరఫరా చేయకపోవడం, చేసినా నాణ్యతలేని సంచులు సరఫరా చేస్తున్నారని ధాన్యం కేంద్రాల నిర్వహకులు అరోపిస్తున్నారు. కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించడానికి రైతులు పడుతున్న కష్టాలు చూసిన మిగతా రైతులు పొలాలవద్దే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు రైతులను నిలువుదొపిడీ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో చౌటుప్పల్‌ మండలంలో 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా 4లక్షల 50వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 90శాతం కోతలు పూర్తిఅయ్యాయి. 3లక్షల 50వేల  క్వింటాళ్లకుపైగా ధాన్యం కేంద్రాల్లో ఉంది. 10 శాతం కూడా మిల్లర్లకు విక్రయంకాలేదు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కొరుతున్నారు.  

Advertisement
Advertisement