ప్రాజెక్టుకు.. ‘అణు’గుణంగా!

ABN , First Publish Date - 2020-02-23T07:23:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణంపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో

ప్రాజెక్టుకు.. ‘అణు’గుణంగా!

 కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రంపై మళ్లీ కదలిక!

 భారత్‌, అమెరికా దేశాల మధ్య చర్చలు


 (రణస్థలం)

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణంపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించనున్న అణువిద్యుత్‌ కేంద్రంపై చర్చ జరగనుంది. అమెరికా సహకారంతో ఆరు అణు రియాక్టర్ల నిర్మాణానికి న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐఎల్‌)తో అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌజ్‌ సంస్థ కొత్తగా మళ్లీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసే గడువు... రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి స్థానిక  నిర్మాణదారు వంటి వివరాలు ఈ ఒప్పందంలో ఉంటాయని సమాచారం.


భూ సేకరణ పూర్తి 

కొవ్వాడలో రూ.లక్ష కోట్ల వ్యయంతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు రియాక్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. 2008లో అమెరికాతో భారత్‌ కుదుర్చుకున్న అణు ఒప్పందం తర్వాత అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి వెస్టింగ్‌హౌజ్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో అణువిద్యుత్‌ కేంద్రానికి అవసరమైన భూమి కోసం జిల్లా అధికారులు గతంలో సర్వే చేశారు. జిరాయితీ, డీపట్టా, ప్రభుత్వ భూమిని న్యూక్లియర్‌ వపర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఎల్‌)కు అప్పగించారు. రామచంద్రపురం రెవెన్యూ పరిధిలో 399.68 ఎకరాలు, టెక్కలి రెవెన్యూ పరిధిలో 317.53 ఎకరాలు, గూడెం పరిధిలో 395.90 ఎకరాలు, కోటపాలేం పరిధిలో 276.09 ఎకరాలు, జీరుకొవ్వాడ పరిధిలో 84. 63 ఎకరాల డీపట్టా భూములను ఎన్‌పీసీఎల్‌కు అప్పగించారు.


రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించారు. అలాగే 587.27 ఎకరాల జిరాయితీ భూములకు కూడా నష్టపరిహారం అందజేశారు.  వీటిని రెవెన్యూ అధికారులు రెండేళ్ల కిందటే ఎన్‌పీసీఎల్‌కు అప్పగించారు. తర్వాత కాలంలో వెస్టింగ్‌హౌజ్‌ సంస్థ దివాళా తీసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశార్థకంగా మారింది. రెండేళ్లుగా అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణ విషయమై స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వస్తోంది. వెస్టింగ్‌హౌజ్‌ సంస్థ దివాళా తీసిన అంశం తెరమీదికి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు చేపట్టే బాధ్యతలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. నిర్మాణ బాధ్యతలను ఏ విధంగా పంచుకోవాలనే దానిపై రెండు సంస్థలు సంప్రదింపులు చేస్తున్నాయి. వెస్టింగ్‌హౌస్‌ అనుసరిస్తున్న నిర్మాణ విధానాన్ని తెలుసుకోవడానికి ఎన్‌సీపీఐఎల్‌ ప్రతినిధులు ఆ సంస్థ ప్లాంటును సందర్శించారు. 


రెండున్నర దశాబ్దాలకుపైగా..

1992లో కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారు. 28 ఏళ్లుగా దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. 2007లో అప్పటి అణు ఇంధన సంస్థ చైర్మన్‌ అనిల్‌ కకోద్కర్‌ కొవ్వాడ వద్ద వెయ్యి మెగావాట్ల  అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ధ్రువీకరించారు. అమెరికా- భారత్‌ల మధ్య జరిగిన అణు ఒప్పందంలో భాగంగా కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా మత్స్యకారులు, రణస్థలం మండల ప్రాంతవాసులు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. అణువిద్యుత్‌ కేంద్రం వలన అన్నీ అనర్థాలేనని నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2020-02-23T07:23:58+05:30 IST