చర్చలు విఫలం

ABN , First Publish Date - 2021-01-09T08:00:51+05:30 IST

‘‘కానూన్‌ వాపసీ హోతో.. కిసానోఁకా ఘర్‌ వాపసీ’’ అని ఢిల్లీ శివార్లలో 44 రోజులుగా ఆందోళన చేపడుతున్న 40 రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.

చర్చలు విఫలం

  • సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే.. కేంద్రానికి తేల్చి చెప్పిన రైతు సంఘాలు
  • ఏమీ తేల్చని 8వ విడత చర్చలు
  • చట్టాలను రద్దు చేసేది లేదని  తేల్చి చెప్పిన కేంద్రం
  • 15న 9వ విడత చర్చలకు చాన్స్‌


న్యూఢిల్లీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కానూన్‌ వాపసీ హోతో.. కిసానోఁకా ఘర్‌ వాపసీ’’ అని ఢిల్లీ శివార్లలో 44 రోజులుగా ఆందోళన చేపడుతున్న 40 రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేసేదాకా.. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శుక్రవారం విజ్ఞాన్‌ భవన్‌లో రైతు సంఘాల నాయకులతో.. కేంద్రం 8వ విడత చర్చలు జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పియూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌.. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో పాల్గొన్నారు. అంతకు ముందు వారు కేంద్ర మంత్రి అమిత్‌షాతో అరగంట పాటు భేటీ అయ్యారు. \\సాగు చట్టాల రద్దు మినహా.. మిగతా అంశాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రం.. ఆ చట్టాల రద్దే తమ డిమాండ్‌ అని రైతులు భీష్మించడంతో.. చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఈ నెల 11న రైతుల అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరగనున్న నేపథ్యంలో.. వేచిచూసే ధోరణిలో ప్రభుత్వం 15వ తేదీన 9వ విడత చర్చలు జరిపే అవకాశాలున్నాయి.


సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో.. రైతులు మధ్యాహ్న భోజనానికి కూడా వెళ్లకుండా.. సమావేశ మందిరంలోనే కూర్చున్నారు. చర్చలు సాంతం వాడివేడిగా సాగినట్లు తెలిసింది. ‘‘దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఈ చట్టాలను స్వాగతించారు. దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ చట్టాలను రద్దు చేసేది లేదు’’ అని కేంద్ర మంత్రి తోమర్‌ స్పష్టం చేశారు. రైతు సంఘాల నేతలు మాత్రం.. తమది చావోరేవో తేల్చుకునే పోరాటమని చెబుతూ.. ‘‘జీతేంగే యా మరేంగే’’ అంటూ నినాదాలు చేశారు.


‘‘కేంద్రం రైతుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఇంతకు ముందు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. వ్యవసాయం రాష్ట్రాలకు చెందిన అంశమని స్పష్టం చేసింది. మీ (ప్రభుత్వ) ధోరణి చూస్తుంటే.. ఈ విషయాన్ని ఎటూ తేల్చేలా లేనట్లు కనిపిస్తోంది. అలాంటప్పుడు చర్చల పేరుతో సమయం వృథా చేయడం ఎందుకు?’’ అని రైతు సంఘం నేతలు నిలదీసినట్లు తెలిసింది. పంజాబ్‌ బీజేపీ నేతలు తమ ఆందోళనను సిక్కు వేర్పాటు వాదంగా పోల్చడాన్ని రైతు సంఘం నేతలు ఖండించినట్లు సమాచారం. చట్టాల రద్దుకు ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోకపోవడంతో.. చర్చలు నిష్ఫలంగా ముగిశాయి.


దీంతో తమ ఆందోళన కొనసాగుతుందని, గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించ తలపెట్టిన ‘కిసాన్‌ పరేడ్‌’ను కొనసాగిస్తామని రైతు సంఘం నాయకులు వెల్లడించారు. ఇప్పటికే 5 వేలకు పైగా ట్రాక్టర్లు సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, పల్వల్‌ ప్రాంతాలకు చేరుకున్నాయని వివరించారు. ‘‘మేం మళ్లీ 15న చర్చలకు వస్తాం. ప్రభుత్వం మాతో కేవలం చట్టాలకు సవరణల గురించి మాట్లాడాలనుకుంటోంది. కానీ, మేం చట్టాలనే వద్దంటున్నాం. మా ఆందోళన కొనసాగిస్తాం.


అవసరమైతే ఈ నెల 13న లోహ్రీ, ఏప్రిల్‌ 13న బైసాకీ పండుగలను ఆందోళనతోపాటే జరుపుకొంటాం’’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ అన్నారు.  కేంద్రం ఇంతకు ముందు చెప్పినట్లు తాము కోర్టుకు వెళ్లే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. కాగా.. రైతు నిరసన ప్రదర్శనలు జరుగుతున్న చోట్ల భోజన పంపిణీ నిర్వహిస్తున్న సిక్కు గురువు లఖా సింగ్‌ను కేంద్ర మంత్రి తోమర్‌ గురువారం కలుసుకున్నారు. అయితే ఆయన తమ ప్రతినిధి కాడని రైతుసంఘాలు తోమర్‌కు స్పష్టం చేశాయి.




చట్టాల రద్దే పరిష్కారం: ప్రియాంక

రైతుల ఆందోళనకు సాగు చట్టాల రద్దే పరిష్కారమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రైతులకు మద్దతుగా 32 రోజులుగా జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె శుక్రవారం రాహుల్‌గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.



అన్నదాతకు వెన్నుపోటు: రాహుల్‌

మోదీ సర్కారు అన్నదాతను వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. రైతుల ఆందోళనకు అందరూ మద్దతివ్వాలని ఆయన ట్విటర్‌లో కోరారు.


Updated Date - 2021-01-09T08:00:51+05:30 IST