Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొరుగు మద్యం జోరు...!

ఇతర రాషా్ట్రల నుంచి యథేచ్ఛగా రవాణా

తరచూ పట్టుబడుతున్నా.. మారని తీరు..

కొందరు ప్రవృత్తిగా మార్చుకున్న వైనం

అక్రమార్కులతో జతకట్టిన కొందరు సిబ్బంది

దృష్టి సారించని ఉన్నతాధికారులు

అనంతపురం క్రైం, నవంబరు 30: జిల్లాలో అక్రమ మ ద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పొరుగు రాషా్ట్రల మద్యం జిల్లాలోకి విచ్చలవిడిగా రవాణా అవుతోంది. స్థానికంగా మద్యం ధరలు ఘాటెక్కడంతోపాటు డిమాండ్‌ కలిగిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో అక్రమార్కులు పొరుగు రాషా్ట్రలపై కన్నేశారు. దానిపై రూపాయి పెట్టుబడి పెడితే రెండింతలు లాభం పొందుతున్నారు. పైగా జిల్లాకు సరిహద్దులో కర్ణాటక ఉండటంతో అక్కడి నుంచి యథేచ్ఛగా మద్యం తెచ్చేస్తున్నారు. మొదట్లో చిన్న వ్యాపారులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో సరుకు తీసుకొస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు ఎత్తేశారు. కొందరు బడా వ్యాపారులు ఇదే అదునుగా భావించి, కార్లు, ట్రక్కుల్లో రూ.లక్షలు విలువ చేసే మద్యాన్ని పెద్దఎత్తున రవాణా చేసి, క్యాష్‌ చేసుకుంటున్నారు. మరికొందరు అక్రమార్కులకు రాజకీయనాయకుల అండదండలతోపా టు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో జిల్లాలోకి అక్రమ మద్యం రవాణా రోజురోజుకీ జోరందుకుంటోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటుండగా.. మరోవైపు పొరుగు రాషా్ట్రల మద్యం జిల్లాలో ఏరులై పారుతుండటం శోచనీయం. ఇందుకు జిల్లాలో పట్టుబడిన అక్రమ మద్యం కేసులే నిదర్శనం. కొందరైతే ఏకంగా అక్రమ మద్యం రవాణా, విక్రయాలను ప్రవృత్తిగా మార్చేసుకోవడం గమనార్హం.


అంతా అక్కడి నుంచే...

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పనులు లేక ఎక్కువ శాతం అక్రమ మద్యం విక్రయాలకు తెరలేపారు. ఈ క్రమంలో ఒక్క ఫుల్‌ బాటిల్‌ అమ్మితే రూ.600 నుంచి 1000 వరకు లాభం వస్తుండటంతో మరింత రెచ్చిపోతున్నారు. పల్లె పట్టణం అనే తేడాలేకుండా అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తూ.. సొమ్ముచేసుకున్నారు. దీంతో పొరుగు రాషా్ట్రలైన కర్ణాటక, తెలంగాణ నుంచి భారీగా అడ్డదారిలో కొందరు, రాజమార్గంలో (సిబ్బంది చేతివాటంతో) మరికొందరు జిల్లాలోకి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారు. ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు తరలించి, విచ్చలవిడిగా విక్రయాలు చేసి, జేబులు నింపుకుంటున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులలో కొందరుపోలీసులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో యథేచ్ఛగా అక్రమ మద్యం రవాణా అవుతోందని సమాచారం.


పథకం ప్రకారం...

పొరుగ రాషా్ట్రల నుంచి ద్విచక్రవాహనాలు, కార్లు, సరుకులు తరలించే వివిధ లగేజీ వాహనాల ద్వారా పథకం ప్రకారం జిల్లాలోకి అక్రమ మద్యం జోరుగా తరలించేస్తున్నారు. అక్కడక్కడా పట్టుబడినాఅశించిన స్థాయిలో జిల్లాలో అక్రమ మద్యంపై సెబ్‌, ఆయా ప్రాంతాల పోలీసులు దృష్టి సారించకపోవడం వారికి మరింత కలిసివస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు పట్టుబడిన మద్యం కంటే.. అడ్డదారిలో తరలించే మద్యమే ఎక్కువగా ఉందని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. పొరుగు రాషా్ట్రలైన కర్ణాటక , తెలంగాణలో ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1000 ఉంటే.. ఇక్కడ రూ.2000 ఉందని మద్యం ప్రియులు చెబుతున్నారు. పైగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిమాండ్‌ కలిగిన బ్రాండ్లు కూడా లేకపోవడం అక్రమార్కులకు మరింత కలిసివస్తోంది. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు పొరుగా రాషా్ట్రల నుంచి తెచ్చిన మద్యం ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ.. మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు చిక్కినా ఎంతోకొంత ముట్టచెప్పితే చాలు.. అడపా.. దడపా కేసులు నమోదు చేసి మిన్నుకుండిపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ తంతు జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌ పోస్టులతోపాటు అనంతపురం నగరం, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, కదిరి, పెనుకొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతోందని సమాచారం. 


జిల్లాలో పట్టుబడిన కొన్ని...

- నగరానికి చెందిన పాండు అనే మద్యం విక్రేత కారులో పోలీసు బోర్టు పెట్టుకుని కర్ణాటక నుంచి ధర్మవరం మీదుగా జిల్లా కేంద్రానికి వస్తుండగా.. ధర్మవరం పరిధిలోని ఇందిరమ్మకాలనీ వద్ద సెబ్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఏడాది జూన 27న దాడులు చేసి, గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, రూ.3లక్షల విలువ చేసి కర్ణాటక మద్యంతో పాటు కారును సీజ్‌ చేశారు. 

- హైదరాబాద్‌ నుంచి ఐదుగురు వ్యక్తులు ఈ ఏడాది జూన 23న రూ.4.20లక్షలు విలువ చేసే మద్యాన్ని తాడిపత్రి మీదుగా జిల్లాలోకి తరలిస్తుండగా... డీఎస్పీ చైతన్య.. సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఐదుగురిని అరెస్ట్‌ చేసి, మద్యంతోపాటు వాహనాన్ని సీజ్‌ చేశారు.

- ఈఏడాది 25న జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులు కలిసి కర్ణాటక నుంచి రూ. 4లక్షల విలువ చేసే అక్రమ మద్యంతో స్కార్పియో, బొలెరో వాహానాల్లో వస్తుండగా.. నాలుగో పట్టణ పోలీసులు కళ్యాణదుర్గం రోడ్డు బైపా్‌సలో దాడులు చేసి, గుట్టు రట్టు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి, వాహనాలతోపాటు మద్యాన్ని సీజ్‌ చేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే.


యువకులు కూడా...

విడతల వారీగా మద్య నిషేధం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దుకాణాలను తన ఆధీనంలోకి తీసుకుంది. మద్యం ధరలు అమాంతం పెంచింది. పొరుగు రాషా్ట్రల్లో మద్యం ధరలు ఇక్కడి కన్నా చాలా తక్కువగా ఉండటంతో అక్రమార్కులు అక్రమ మద్యం విక్రయాలకు తెరలేపారు. పొరుగు రాషా్ట్రల నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలించేసి, తక్కువ సమయంలోనే అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది యువకులు అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారని సమాచారం. జిల్లాలో ప్రభుత్వ మద్యం కన్నా.. అక్రమ మద్యం విక్రయాలే అధికంగా సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇదివరకు పట్టుబడిన కేసులే నిదర్శనం. మరికొందరైతే ఏకంగా ఆర్మీ మందును కూడా అక్రమమార్గంలో విక్రయాలు చేసి, క్యాష్‌ చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది.


దృష్టి సారించని ఉన్నతాధికారులు

జిల్లాలో ఎక్కడికక్కడ అక్రమ మద్యం విక్రయా లు, రవాణా సాగుతున్నా ఆశించిన స్థాయిలో సివిల్‌, సెబ్‌ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. కొందరు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుంటే.. మరికొందరు చేతివాటం ప్రదర్శించి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని కేసులలో చేతివాటం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అక్రమార్కు లు, వారికి సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. సెబ్‌, సివిల్‌కు సంబంధించిన ఉన్నతాధికారులు.. అవినీతి ఉద్యోగులతోపాటు అక్రమార్కులపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. కొందరు సిబ్బంది నెలవారీ మామూళ్లలో మునిగితేలుతున్నారనే చర్చ ఆ శాఖలో సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Advertisement
Advertisement