నెల్లూరు జిల్లా: కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధికారుల నిర్వాకం

ABN , First Publish Date - 2022-04-28T16:39:29+05:30 IST

కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో రూ. 25 లక్షలు గోల్‌మాల్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా: కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధికారుల నిర్వాకం

నెల్లూరు జిల్లా: కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో రూ. 25 లక్షలు గోల్‌మాల్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల గోల్‌మాల్‌పై నివేదిక సమర్పించిన మహిళా ఆడిట్ అధికారిణికి తీవ్ర వేధింపులు ఎదురైనట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు చలపతి ఈ సొసైటీకి  ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.


రిటైర్డ్ ఉద్యోగి కొట్టు వెంకటస్వామికి బిజినెస్ మేనేజర్ పదవి ఇవ్వడమేకాకుండా సొసైటీ అతనికి ఏటా లక్షల్లో జీతాల రూపంలో చెల్లింపులు చేస్తోంది. వెంకటస్వామిపై నిధుల గోల్ మాల్ ఆరోపణలు ఉన్నాయి. 2021లోనూ నిధుల గోల్ మాల్ జరిగినట్లు తీవ్ర ఆరోపణలు రాగా  విచారణ కోరకు అప్పట్లో ముగ్గురు అధికారులను నియమించారు. కానీ అధికారపార్టీ నేతల ఒత్తిడితో ఆ విచారణ అటకెక్కింది. అయితే ఈ ఏడాది ఆడిట్ సమర్పించే బాధ్యతను ఓ దళిత అధికారిణికి అప్పగించారు. ఆ అధికారిణి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆడిట్ నివేదిక సమర్పించారు. నిధులు గోల్ మాల్ చేసిన వెంకటస్వామిపై చర్యలకు సిఫార్స్ చేశారు. దీంతో అధికారిణికి వేధింపులు మొదలయ్యాయి. నివేదిక వెనక్కి తీసుకుని మార్చి పంపాలంటూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో అధికారిణిని ఇలా వేధింపులకు గురిచేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-04-28T16:39:29+05:30 IST