మరో కొత్త కథకు రెడీ..!

ABN , First Publish Date - 2021-08-08T05:12:48+05:30 IST

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌..

మరో కొత్త కథకు రెడీ..!

ఓ మంత్రి.. ఓ ఎమ్మెల్యే... మధ్యలో మాగుంట

నేతల వర్గ పోరుతో అభాసుపాలైన అధికార పార్టీ 

మలుపులు తిరుగుతున్న ‘సర్వేపల్లి’ గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారం

కేసులో మాగుంట పేరు చేర్చడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌

ఫోన్‌లో జిల్లా నేతలకు అక్షింతలు

ఒత్తిళ్లతో ఎంపీ పేరు లేదని అధికారుల వివరణ

కేసు భారం మోసే వ్యక్తి కోసం వెతుకులాట


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిల మధ్య రాజకీయ పోరు ఏకంగా అధికార పార్టీని అభాసుపాలు చేసింది. ఒకరిని ఒకరు దెబ్బతీసుకోవడం కోసం ఆ ఇద్దరు నాయకులు అనుసరించిన తీరు సొంత పార్టీ నాయకుల్లో అవినీతిని బట్టబయలు చేసింది. గ్రావెల్‌, ఇసుక అక్రమ తవ్వకాల్లో అధికార పార్టీ నాయకులు రూ.కోట్లు కూడేసుకొంటున్నారన్న ఆరోపణలను అక్షర సత్యాలను చేసి ప్రజల దృష్టిలో పార్టీ పరువును దెబ్బతీసింది. ఈ వ్యవహారంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును బజారు కీడ్చింది. నెల రోజుల క్రితం కేసులు కట్టిన అధికారులే ఇప్పుడు కేసు భారం మోసేందుకు అమాయకుడి కోసం వెతుకులాడే పరిస్థితి తీసుకొచ్చింది. 


ఒకటో భంగపాటు..!

సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని రాత్రి సమయాల్లో సైతం గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయంటూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. సోమిరెడ్డి నేతృత్వంలో ఒక ఉద్యమంలా సాగిన ప్రచారానికి మంత్రి అనిల్‌ కుమార్‌ స్పందించారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఇరిగేషన్‌ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వారికి మెమోలు జారీ చేశారు. దీంతో ఇరిగేషన్‌ అధికారులతో పాటు ఆర్టీవో, డీఎస్పీలు సహా రెవెన్యూ సిబ్బంది రిజర్వాయర్‌లో తవ్వకాలను పరిశీలించారు. ఈ క్రమంలో అనుమతులకు మించి అదనంగా పదివేల క్యూబిక్‌మీటర్ల మట్టిని తవ్వి తరలించారని ఇరిగేషన్‌ అధికారులు లెక్క తేల్చారు. ఆ మేరకు అనుమతులు పొందిన ముగ్గురిపై పోలీసు కేసు నమోదు చేశారు.


రెండో భంగపాటు..

టీడీపీ ఆరోపణలపై స్పందించి వైసీపీ నాయకులపై కేసులు పెడతారని ఆశించడం అత్యాశే అవుతుందన్న విషయం అందరికి తెలిసిందే. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ తవ్వకాల కేసు బలం పుంజుకోవడం వెనుక మంత్రి అనిల్‌ హస్తం ఉందనే విషయాన్ని సామాన్య ప్రజలు సైతం విశ్వసిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణితో ఉన్న రాజకీయ వైరం దృష్టిలో ఉంచుకొని అనిల్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టించారని అంటున్నారు. రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్‌ తవ్వకాల్లో కాకాణి అనుచరులు ఉన్నారన్నది ఎంత నిజమో, ఈ వ్యవహారాన్ని పోలీసు కేసుల వరకు తీసుకొచ్చింది మంత్రి అనిల్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో పెన్నానదిలో మంత్రి అనిల్‌ అనుచరులు ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని కాకాణి ఫిర్యాదు చేయడం, సర్వేపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన రోజే పెన్నానదిలో అధికారులు పరిశీలించడం గమనార్హం. మొత్తంపై నెల రోజుల క్రితం ఒకేరోజు వరుసగా జరిగిన ఈ రెండు ఘటనల్లో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమయ్యింది. ఇలా పార్టీ పరువు ప్రజల దృష్టిలో పలుచనయ్యింది. 


మూడో భంగపాటు..

ఈ ఘటనను ప్రజలు మరచిపోకముందే ఇప్పుడు మరోసారి అధికార పార్టీ అభాసుపాలు కావడం విశేషం. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ మట్టి తవ్వకాలు చేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేసిన ముగ్గురి పేర్లలో ఎం. శ్రీనివాసులు రెడ్డి సన్నాఫ్‌ రాఘవరెడ్డి అనే పేరు ఉండటంతో ఈ వివాదం మరింత రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఎం. శ్రీనివాసులు రెడ్డి అంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగా ప్రచారం జరిగింది. ఎంపీ తండ్రి పేరు కూడా రాఘవరెడ్డి కావడం, ఇంటిపేరుకు సరిపోలేలా ఇన్సియల్‌ ఉండటంతో ఎంపీపై పోలీసు కేసు నమోదయినట్లు ప్రచారం జరిగిపోయింది. వాస్తవానికి ఈ వ్యవహారంతో ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల కారణంగా ఎంపీ పేరు బజారునపడింది. అధికారం  తమదే కదా అనే ధీమాతో ఇష్టమొచ్చిన వారి పేర్లతో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు పొందిన క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. తీరా పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత నిందితుల జాబితాలో ఎంపీ పేరు ఉందనే విషయం బయటకు రాలేదు. సహ చట్టం ఆధారంగా వివరాలు సేకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమార్జాన కోసం కొందరు వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా వ్యవహరించే క్రమంలో పరువు, ప్రతిష్ట కలిగిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లను కూడా తప్పుడు పనులకు వాడుకుంటున్నారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 


నాలుగో భంగపాటు..

అక్రమంగా కోట్లు కూడేసుకునే ప్రయత్నంలో జరిగిన వ్యవహారంలో ఇప్పటికి మూడు సార్లు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడిన అధికార పార్టీ ఇప్పుడు 4వసారి మరో తప్పు చేయడానికి సాహసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిష్కారణంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు అక్రమ గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారంలో ప్రచారంలోకి రావడంతో అధికార పార్టీ రాష్ట్ర నాయకులు సీరియస్‌ అయ్యారు. ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు మంత్రి అనిల్‌... ఎమ్మెల్యే కాకాణిలతో మాట్లాడినట్లు ప్రచారం. అక్రమ గ్రావెల్‌ తవ్వకాల్లో కీలకపాత్ర పోషించిన నాయకులు కాకాణి అనుచరులన్న ఉద్దేశంతో ఎందుకిలా చేశారని ఎమ్మెల్యేని గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎంపీ మాగుంటపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇరిగేషన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసిన పేర్లలో ఉన్న ఎం. శ్రీనివాసులు రెడ్డి పేరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిది కాదని, ఈ వ్యవహారంలో ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.


ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు మరో కొత్త కథ మొదలయ్యింది. మాగుంట పేరు లేదని ప్రకటించిన అధికారులకు ఇప్పుడు ఫిర్యాదులో ఉన్న ఎం.శ్రీనివాసులు రెడ్డి సన్నాఫ్‌ రాఘవరెడ్డిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నెత్తిమీద పడింది. ఈ క్రమంలో ఎం. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తిని వెతికిపట్టుకొని, కేసు ఆయనపై మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయత్నం వికటించి.. మరోసారి పార్టీ పరువు బజారున పడుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో అధికార వైసీపీ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-08-08T05:12:48+05:30 IST