Kuwait లో అమానవీయ ఘటన.. ప్రవాస దంపతులు చేసిన దారుణమిదీ!

ABN , First Publish Date - 2021-10-02T15:29:25+05:30 IST

కువైత్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన ప్రవాస దంపతులు అప్పుడే పుట్టిన పసిగుడ్డును తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశారు.

Kuwait లో అమానవీయ ఘటన.. ప్రవాస దంపతులు చేసిన దారుణమిదీ!

కువైత్ సిటీ: కువైత్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన ప్రవాస దంపతులు అప్పుడే పుట్టిన పసిగుడ్డును తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశారు. అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని అల్ ఫర్వానియా నగరంలో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నిలిపి ఉంచిన చెత్త కంటైనర్‌ వద్ద నేపాలీ దంపతులు అనుమానాస్పదంగా తిరగడం ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ వ్యక్తి గమనించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ జంట అక్కడి నుంచి వెళ్లిపోయింది.


దాంతో అనుమానం వచ్చిన ఫిలిప్పీయన్ కంటైనర్ వద్దకు వెళ్లి చూశాడు. అందులో ఆయనకు ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేసిన నవజాతశిశువు కనిపించింది. దాంతో వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తమకు ఇంకా వివాహం కాలేదని, కొన్నాళ్లుగా సహాజీవనం చేస్తున్నట్లు వారు చెప్పారు. 


ఈ క్రమంలో మహిళ గర్భందాల్చడం.. మృతశిశువు పుట్టడంతో తీసుకొచ్చి చెత్త కుప్పలో పడేసినట్లు ఆ జంట వెల్లడించింది. దీంతో పోలీసులు నేపాలీ జంటపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించారు. కాగా, కువైత్‌లో శిశువును చెత్తలో పడవేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ముబారక్ అల్ కబీర్ పోలీసులు ఒక నవజాత శిశువును చెత్త డబ్బా దగ్గర పడవేసిన కేసులో గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. పసిగుడ్డును ఓ పేపర్ కార్టన్‌లో ఉంచి చెత్త డబ్బాలో పడేశాడా వ్యక్తి. దాంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అనుమానితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేసింది.

Updated Date - 2021-10-02T15:29:25+05:30 IST