క్రికెట్‌లో బంధుప్రీతి రగడ!

ABN , First Publish Date - 2020-06-28T08:51:52+05:30 IST

బంధుప్రీతి (నెపోటిజం).. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్మ తర్వాత దేశవ్యాప్తంగా ఈ టాపిక్‌పై విపరీతంగా చర్చ ...

క్రికెట్‌లో బంధుప్రీతి రగడ!

న్యూఢిల్లీ: బంధుప్రీతి (నెపోటిజం).. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్మ తర్వాత దేశవ్యాప్తంగా ఈ టాపిక్‌పై విపరీతంగా చర్చ సాగుతోంది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం కలిగిన వారికి అన్యాయం జరుగుతోందనే వాదన ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఇది సినీ పరిశ్రమకే కాకుండా క్రికెట్‌లోనూ కనిపిస్తోందని ఇప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇందుకు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ పేరును ఉదహరిస్తున్నారు. గతంలో జరిగిన ఉదంతాన్ని బయటకి తీసి తాజాగా మళ్లీ ట్రోలింగ్‌ చేస్తున్నారు. 2016లో అండర్‌-16 వెస్ట్‌ జోన్‌ జట్టు ఎంపికను గుర్తు చేస్తూ.. అద్భుత ప్రతిభ కలిగిన ప్రణవ్‌ ధనవాడేను కాదని అర్జున్‌ టెండూల్కర్‌కు ఎలా చోటిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా అప్పట్లో పత్రికలో వచ్చిన కథనాన్ని స్ర్కీన్‌ షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. ‘దిస్‌ ఈజ్‌ ఇండియా’ పేరిట వచ్చిన నాటి పత్రికా కథనంలో.. ‘ఆటో డ్రైవర్‌ కొడుకు ప్రణవ్‌ ధనవాడే 327 బంతుల్లో 1009 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పినా జట్టులోకి తీసుకోలేదు. ఎలాంటి రికార్డు లేకున్నా, కేవలం సచిన్‌ కొడుకన్న కారణంతో అర్జున్‌కు చోటు దక్కింది’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-28T08:51:52+05:30 IST