Abn logo
Jul 24 2021 @ 21:30PM

నేతన్న నేస్తంలో అర్హులకు మొండి చెయ్యి

పొదలకూరులో మగ్గం కార్మికులు

లబోదిబోమంటున్న లబ్ధిదారులు


పొదలకూరు(రూరల్‌), జూలై 24 : చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో అర్హులకు అధికారులు మొండి చెయ్యి చూపిస్తుండడంతో పలువురు నేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల సవరించిన నిబంధనల కారణంగా ఒక్క రేషన్‌కార్డుకు ఒక్కరినే ఎంపిక చేస్తున్నారు. గతంలో ప్రతి మగ్గం దారునికి ఈ పథకం వర్తించేంది. 2019లో ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. తద్వారా మగ్గం నేస్తున్న కార్మికుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నేరుగా రూ.24వేలు జమ చేస్తుంది. నూతన నిబంధనల ప్రకారం ఈయేడు  మండలంలో వందమంది కార్మికులకు జాబితాలో చోటు లభించిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సూచించిన అర్హత పత్రాలతో లబ్ధిదారులు తిరిగి సచివాలయాల్లో సంప్రదించాలని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఆనందకుమార్‌ ఒక ప్రకటనలో సూచించారు. దీంతో అందిన పత్రాలను పరిశీలించి, నవశకం పోర్టులో నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తిరిగి జాబితాలో చేర్చనున్నట్లు వివరించారు. దీంతో మండలంలోని నేత కార్మిక కుటుంబాల వారు ఉసూరుమంటున్నారు. 2019లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత మండలంలో 216 మందికి లబ్ధిచేకూరింది. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 100కు మించడం లేదని బాధిత కుటుంబాల వారు పేర్కొంటున్నారు. తాజా నిబంధనల ప్రకారం స్థానిక సచివాలయ సిబ్బంది ప్రతి మగ్గాన్ని పరిశీలించి జియోట్యాగింగ్‌ చేసి, లబ్ధిదారుల దరఖాస్తులను జేడీ కార్యాలయానికి పంపాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో మండలంలో పలువురు అనర్హత జాబితాలోకి వెళ్లిపోయారు.