Abn logo
Sep 27 2021 @ 13:32PM

పీఎంను పొగిడిన సుశీల్ మోదీకి నెటిజన్ల క్లాస్..!

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటు సభ్యుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీకి నెటిజన్లు క్లాస్ తీసుకున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17వ తేదీని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పిలుపునిస్తూ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వాగ్దాటి ప్రదర్శించారు. ఈ విషయాన్నే నెటిజన్లు తప్పుపట్టారు. వాస్తవాలు తెలుసుకోడంటూ ట్వీట్లు పెట్టారు. ''సీఎం పదవి సైతం నిర్వహించిన ఏకైక ప్రధాని మోదీ కాదు..ఆయన ఆరో వ్యక్తి'' అంటూ ఆ జాబితా ఏకరువు పెట్టారు.

''ఇక్కడున్న చాలామందికి నరేంద్ర మోదీ 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలుసుండక పోవచ్చు. ఆ తర్వాతే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఏడేళ్లుగా ప్రధానిగా సేవలందిస్తూ వస్తున్నారు. ఆ ప్రకారం సీఎంగా, పీఎంగా ఆయన 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధానమంత్రులుగా పనిచేసిన ఒక్కరు కూడా ఇటు సీఎంగా, అటు పీఎంగా రెండూ చేసిన వారెవ్వరూ లేరు. ఆ క్రెడిట్ ఒక్క మోదీకే దక్కుతుంది. సీఎంగా గుజరాత్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఆయన ప్రధాని అవడంతో యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది'' అని సుశీల్ మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ ప్రసంగం వీడియోను ట్విటర్‌లో కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ వెంటనే పలువురు నెటిజన్లు ఆయన చెప్పిన లెక్క తప్పంటూ ట్వీట్లు గుప్పించారు. పోస్టింగ్‌లు చేసే ముందు వాస్తవాలు నిర్దారించుకోవడం మంచిదంటూ హితవు పలికారు.  

భారత ప్రధాన మంత్రిగా సేవలందించిన వారికి సంబంధించి ప్రభుత్వ వెబ్‌సైట్‌ సమాచారాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. ఆ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన తొలి వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఆయన 1977లో ప్రధానమంత్రి అయ్యారు. 1952లో ముంబై ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఇక రెండో వ్యక్తి చరణ్ సింగ్. ఆయన 1979లో ప్రధాని అయ్యారు. 1967లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1970లో రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీపీ సింగ్ మూడో వ్యక్తి. ఆయన 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1989లో ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు నాలుగో వ్యక్తి. 1971 నుంచి 1973 వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1991 నుంచి 1996 వరకూ ప్రధానిగా సేవలందించారు. ఐదో వ్యక్తి హెచ్‌డీ దేవెగౌడ. 1996లో ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. దీనికి ముందు 1994లో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ జాబితాలో మోదీ ఆరో వ్యక్తి అంటూ నెటిజన్లు ఏకరువు పెట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption