మోదీకి వ్యతిరేకంగా మరోసారి దద్దరిల్లుతోన్న ట్విట్టర్

ABN , First Publish Date - 2021-04-20T01:18:44+05:30 IST

ఒకే ఒక్క రోజులో సుమారు 50 లక్షల ట్వీట్లతో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీని ప్రధానంగా..

మోదీకి వ్యతిరేకంగా మరోసారి దద్దరిల్లుతోన్న ట్విట్టర్

న్యూఢిల్లీ: 2014 నుంచి సోషల్ మీడియాలో రారాజుగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. కొంత కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికానికి తోడు కరోనా విలయ తాండవం చేస్తుండడం దీనికి ప్రధాన కారణాలని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను బట్టి అర్థం చేసుకోవచ్చు. కరోనాను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి పదవి నుంచి మోదీ తప్పుకోవాలని ట్విట్టర్ మారుమోగుతోంది.


గతేడాది ఆగస్టులో సోషల్ మీడియాలో మొదటిసారి మోదీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన నిర్వహించిన మన్‌ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోపై నెటిజెన్లు డిస్‌లైక్‌ల మోత మోగించారు. ఆనాటి కార్యక్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోదీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఈ వీడియోను (ఆగస్టు నాటికే) 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 74 వేల మంది లైక్ చేశారు, 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ దాడిని తట్టుకోలేక బీజేపీ సహా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు లైక్‌లు, కామెంట్లు కనిపించకుండా డిసే‌బుల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఇక సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ట్విట్టర్‌లో ఉద్యోగాల గురించి నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చించారు. ‘మోదీ.. ఉద్యోగమివ్వు’ (మోదీ రోజ్‌గార్ దో/మోదీ జాబ్ దో) అంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒకే ఒక్క రోజులో సుమారు 50 లక్షల ట్వీట్లతో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీని ప్రధానంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ హయాంలో నిరుద్యోగం గురించి మోదీ చేసిన ట్వీట్లను, వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేశారు.


తాజాగా.. దేశంలో పెరిగిన కోవిడ్ కేసుల విషయమై కేంద్ర ప్రభుత్వంపై నెటిజెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం సరిగా పని చేయలేదని, ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపైన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఉత్తరప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాల్లో కోవిడ్ మృతులను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని సైతం ప్రస్తావిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి.


ఇక రాజకీయ నేతలు కూడా కోవిడ్ పెరుగుదలకు మోదీని బాధ్యుడిని చేస్తూ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు మోదీనే కారణమని అన్న ఆమె.. మోదీని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ ‘‘కోవిడ్ కేసులు ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం మోదీనే. ఒక ప్లాన్ లేదు, పరిపాలనా సామర్థ్యం లేదు. పూర్తిగా అసమర్థత. కోవిడ్‌ను అరికట్టేందుకు ఆయన ఏం చేయలేదు, ఇతరుల్ని ఏం చేయనివ్వలేదు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సహా అనేక మంది రాజకీయ నాయకులు మోదీ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.









Updated Date - 2021-04-20T01:18:44+05:30 IST