మోదీ తిరుగు ప్రయాణంపై నెటిజెన్ల మిశ్రమ స్పందన..!

ABN , First Publish Date - 2022-01-06T02:54:29+05:30 IST

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభకు హాజరు కాకుండా భద్రతా కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరిగి న్యూఢిల్లీ ప్రయాణం కావడంపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల సభకు హాజరు కాకుండా తిరుగు ప్రయాణం అయ్యానని ప్రధాని మోదీ చెప్తుండగా..

మోదీ తిరుగు ప్రయాణంపై నెటిజెన్ల మిశ్రమ స్పందన..!

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభకు హాజరు కాకుండా భద్రతా కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరిగి న్యూఢిల్లీ ప్రయాణం కావడంపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల సభకు హాజరు కాకుండా తిరుగు ప్రయాణం అయ్యానని ప్రధాని మోదీ చెప్తుండగా, బీజేపీ సభకు జనాదరణ లేకపోవడం వల్లే సభకు హాజరు కాకుండా మోదీ వెనక్కి వెళ్లారని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. పంజాబ్‌లో ‘లా అండ్ ఆర్డర్’ సరిగా లేదని, ప్రధానమంత్రికే రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొందని కొంతమంది నెటిజెన్లు అంటుంటే.. కొంత మంది మాత్రం మోదీ తిరుగు ప్రయాణంపై ట్రోల్స్ వేస్తున్నారు. కొంత మంది కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తుంటే మరి కొందరు బీజేపీపై జోకులు వేసుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు అయితే ‘హౌ ఈజ్ ద జోస్?’ అంటూ ట్వీట్లు చేయడం గమనార్హం.




ఇక బీజేపీకి వ్యతిరేకంగా కొంత మంది నెటిజెన్లు స్పందిస్తున్నారు. ‘‘మోదీజీ.. హౌ ఈజ్ ది జోష్?’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు. రైతుల ఉద్యమం సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మోదీ ప్రభుత్వంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పటి వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ‘‘ఎన్నికల ప్రచారం కంటే దేశ ప్రధాని ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. ప్రధానికి ప్రాణహాని ఉన్న దృష్ట్యా, ఇక నుంచి మోదీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిది’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.



















ప్రధానంగా ‘భారత్ స్టాండ్స్ విత్ మోదీజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా నెటిజెన్ల నుంచి వస్తున్న స్పందనకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్. ప్రధాని కాన్వాయ్ ఆగిన ప్రదేశంలోని ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘నిరసనకారులు ప్రధాని మోదీ కాన్వాయ్‌ని సమీపించారు. ప్రధానికి సీఎం చన్నీ ఎలాంటి రక్షణ కల్పించలేకపోయారు. చన్నీ షేమ్ ఆన్ యూ’’ అంటూ బీజేపీ నేత గౌరవ్ గోయెల్ ట్వీట్ చేశారు. ‘‘42,750 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాలని అనుకున్నారు. కానీ బటిండాలో కాంగ్రెస్ దీన్ని అడ్డుకుంది’’ అని మరో బీజేపీ నేత ట్వీట్ చేశారు.




ఇదీ కాక.. కొంత మంది వివాదాస్పదంగా స్పందిస్తున్నారు. బీజేపీ నేత సీటీ రవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘దేశ ద్రోహులను కాల్చి పారేయాలి’’ అని చేసిన ట్వీట్‌పై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఎన్‌ఎస్‌యూఐ అధినేత శ్రీనివాస్ చేసిన ‘‘హౌజ్ ఈజ్‌ ద జోష్?’’ అనే ట్వీట్ సైతం విమర్శలకు దారి తీసింది.

Updated Date - 2022-01-06T02:54:29+05:30 IST