Abn logo
Aug 1 2021 @ 00:32AM

స్విమ్స్‌ సూపర్‌ మహిళ... భూమా వెంగమ్మ

వివరాలు వెల్లడిస్తున్న స్విమ్స్‌ డైరెక్టర్‌ భూమా వెంగమ్మ

న్యూరో, కార్డియాక్‌ సైన్సెస్‌ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌


రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల ఆరోగ్యానికి భరోసా స్విమ్స్‌. లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే కార్పోరేట్‌ వైద్యం లభిస్తుందన్న నమ్మకం. విశాలమైన ప్రాంగణం.. వేలాది మంది సిబ్బంది.. నిపుణులైన వైద్యులు.. మహిళా మెడికల్‌ కళాశాల.. డీమ్డ్‌ యూనివర్శిటీగా వైద్యరంగంలో పేరున్న స్విమ్స్‌కి సారథ్యం అంటే ఒక సవాలే. ప్రతి క్షణం ఒక పరుగే. సవాలక్ష ఒత్తిళ్ల నడుమ సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలి. సుదీర్ఘకాలం స్విమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్న భూమా వెంగమ్మకు మరో మూడేళ్లపాటూ అవే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కరోనా విచ్చలవిడి విహారం చేస్తున్న కాలంలో  ఒక వైపు వైద్య సేవలు అందిస్తూనే, మరొక వైపు స్విమ్స్‌ విస్తరణకు కృషి చేయాలి. ఈ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్న భూమా వెంగమ్మ స్విమ్స్‌ డైరెక్టర్‌గా తన భవిష్యత్‌ ప్రణాళికలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. 


  తిరుపతి, ఆంధ్రజ్యోతి: రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోనే బెస్ట్‌ ఇనిస్టిట్యూట్‌గా స్విమ్స్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యం నాది.  కల ఉంది. స్విమ్స్‌తో మూడు దశాబ్ధాలకు పైగా ఉన్న అనుబంధం, న్యూరాలజీ విభాగాధిపతిగా, డీన్‌, రిజిస్ట్రార్‌ లుగా పనిచేసిన అనుభవం. సుదీర్ఘకాలం డైరెక్టర్‌గా ఎదుర్కొన్న సవాళ్లు.. ఇవన్నీ నా లక్ష్యసాధన నెరవేరడానికి నాకు ఉపయోగపడే అంశాలు. 


న్యూరో, కార్డియాక్‌ సైన్సెస్‌ స్థాపన దిశగా..

అందులో భాగంగానే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరో సైన్స్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాక్‌ సైన్స్‌ సంస్థలను స్థాపించాలని అనుకుంటున్నాం. ఇవి బడ్జెట్‌తో కూడుకున్నవి అయినా అందరి సహకారంతో ముందుకెళ్లాలి. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరో సైన్స్‌లోనే మెంటల్‌ రిటార్డేషన్‌ సెంటర్‌ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌ సంస్థ హైదరాబాద్‌లో ఉండేది. అలాంటి సంస్థ ఆంధ్రలో లేదు. ఇది మనకు బాగా ఆవసరం. బర్డ్‌లో ఇప్పటికే ఆర్థోపెడిక్‌ రీహాబిలిటేషన్‌ కేంద్రం ఉంది. దీనికి అనుబంధంగా కార్డియాక్‌, మెంటల్‌ రీహాబిలేటేషన్‌, హియరింగ్‌ సమస్యలు, విజువల్‌ హాండీక్యాప్డ్‌ సెంటర్లు న్యూరో, కార్డియాక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో ఉంటాయి. 


చేయాల్సినవి చాలానే ఉన్నాయి

స్విమ్స్‌ విస్తరణ పనులు చాలానే ఉన్నాయి. కేంద్ర నిధులుతో మంచి రీహాబిలిటేషన్‌, ఆక్యుపేషన్‌ థెరపీ పెట్టాలి. స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌, ఆక్యుపేషనల్‌ థెరపీకి సంబంధించిన స్కిల్‌ బేస్డ్‌ కోర్సులు కూడా మనదగ్గర లేవు. జనటిక్స్‌,  జీరియాట్రిక్స్‌ సెంటర్ల ఏర్పాటు ఆలోచన కూడా ఉంది. అలాంటివి తీసుకురావడం వలన ప్రజలకు మెరుగైన వైద్యసేవలతో పాటూ, సరికొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. కేంద్రం నిధులు వచ్చేలా ప్రయత్నాలు జరగాలి. అదేవిధంగా దాతలు కూడా ముందుకు వస్తే వీటిని స్థాపించడం త్వరగా వీలవుతుంది. బాలాజీ ఆరోగ్యవరస్రసాదిని ట్రస్టులో దాదాపు రూ200 కోట్లు నిధులు ఉన్నాయి. పరిశోధన ప్రాతిపదికన న్యూరో, కార్డియాక్‌ సైన్సెస్‌కు  ఈనిధులను కూడా వినియోగించుకునే ఆలోచ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. 


సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటాం

 గత పదేళ్లుగా ఆధునిక పరిజ్ఞానం పెరిగుతోంది. వైద్య రంగంలోకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి. ఇందు కోసం దేశదేశాల్లో జరుగుతున్న పరిశోధనలు పరిశీలించాలి. మనం మరింత చవకగా వాటిని తయారు చేసుకునే ఆలోచనలు చేయాలి. ప్రోత్సహించాలి. వైద్య వ్యవస్థకు రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెద్ద అండ కాబోతుంది. 


మూడో వేవ్‌కి సన్నద్ధం

 కరోనా మూడోవేవ్‌ గురించి ఖచ్చితంగా చెప్పలేం. పరిశోధకుల అభిప్రాయం మేరకు వస్తుందనే అనుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు వ్యాక్సినేట్‌ అయ్యారు కాబట్టి. ఈసారి చిన్నపిల్లలకు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే పెద్దలకు వచ్చినంత తీవ్రత చిన్నపిల్లలకు రాకపోవచ్చు. వైరస్‌ మైల్డ్‌గా మ్యూటేట్‌ అయితే ఇబ్బందిలేదు. తీవ్రంగా మ్యూటేట్‌ చెందితేనేఇబ్బంది. ప్రతి రెండు నెలలుకు ఓ సారి వైరస్‌ మారాలి లేకుంటే అది మనుగడ సాగించలేదు. మూడోవేవ్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగానే ఉన్నాం. స్విమ్స్‌లో ఇద్దరు పీడియాట్రిక్‌ వైద్యులు మాత్రమే ఉన్నారు. పడకలు పెంచుకుంటున్నాం. థర్డ్‌ వేవ్‌తో పోరాడేందుకు సిద్దంగానే ఉన్నాం.  కరోనా తొలివేవ్‌ కన్నా సెకెండ్‌ వేవ్‌లోనే బాగా హ్యాండిల్‌ చేయగలిగాం. వైరస్‌ మ్యూటేషన్‌ వలన మనకు సమయం దొరకలేదు. సెకండ్‌ వేవ్‌లో తీవ్రత 40 నుంచి 50 ఏళ్ల వయస్సులో ఎక్కువ కనిపించింది. అయితే వైద్యులకు అవగాహన పెరిగడంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. స్విమ్స్‌లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేశాం. వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో డాక్టర్లు కూడా వ్యాక్సిన్‌ కోసం పరుగులు తీశారు. ఇక ఇప్పుడు తగిన బలంతోనే ఉన్నాం గనుక మునుపటి కన్నా సమర్థంగా ఎదుర్కోగలం. 


1986లో స్విమ్స్‌కు శిలాఫలకం 

1986 ఏప్రిల్‌ 18న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్విమ్స్‌కు శిలాఫలకం వేశారు. 1993లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. 6 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు, 200 పడకలతో ప్రారంభమైన స్విమ్స్‌  వైద్య ప్రస్థానం దశలువారీగా పెరుగుతూ వస్తోంది. 1995లో డీమ్డ్‌ వర్సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. పారామెడికల్‌ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు విస్తరించింది. మహిళా మెడికల్‌ కళాశాల కలిగిన దేశంలోనే రెండో వైద్య సంస్థ కావడం స్విమ్స్‌ ప్రత్యేకత.