Abn logo
Jun 7 2020 @ 05:31AM

నేనెప్పుడూ... స్వీట్‌ సిక్స్‌టీన్‌!

ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజుఈ పుట్టినరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. బాలకృష్ణ 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. షష్టిపూర్తి సందర్భంగా ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు...


మీ నాన్నగారికి తెలంగాణ సీయం కేసీఆర్‌ వీరాభిమాని!

అవును. నాన్నగారికి ఇష్టమైన శిష్యుడు కేసీఆర్‌గారు. ‘రాజకీయాల్లో ఇతను (కేసీఆర్‌) బాగా రాణిస్తారు. మంచి భవిష్యత్తు ఉంది’ అని అప్పట్లో నాన్న అన్నారు. నాకు తెలిసి జన్మభూమి కార్యక్రమానికి ఆ పేరు సూచించింది కేసీఆర్‌గారే.  


వారి గురించి బాలకృష్ణ ఏమన్నారంటే...

చంద్రబాబు: వెరీ ఫోకస్డ్‌. నాన్నగారి తర్వాత అంత క్రమశిక్షణ చంద్రబాబు నాయుడుగారిలో చూశా.

నారా లోకేశ్‌: బాగా చదువుకున్న వ్యక్తి. పార్టీ పట్ల, కుటుంబం పట్ల అంకితభావంతో ఉంటారు.

బ్రహ్మణి: తనది పూర్వాషాడ నక్షత్రం. తమిళంలో ‘పూర్వాషాడ పోర్వాట్టమ్‌’ అని సామెత ఉంది. అంటే... జీవితమంతా పోరాటమే. తనకి బాలకృష్ణ కుమార్తె అని గానీ, చంద్రబాబు కోడలు అని గానీ ఎప్పుడూ ఉండదు. ‘నాకు నేనుగా నిరూపించుకోవాలి. నా లక్ష్యం చేరుకోవడానికి నేను కష్టపడాలి’ అనుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి.

దేవాన్ష్‌: వాడు కొంచెం క్రమశిక్షణతో ఉంటాడు. (నవ్వుతూ) నాతో ఉన్నప్పుడే చెడిపోతాడు. పిల్లలకు నేను ఆంక్షలు విధించను. అప్పుడప్పుడూ నా సినిమాలు, ముత్తాత సినిమాలు తప్ప... వాళ్ల అమ్మ ఇంట్లో సినిమా చూపించదు. నాతో ఉన్నప్పుడు అల్లరి చేస్తాడు కాబట్టి వాడి రక్తంలోనూ నటన ఉందని అనిపిస్తుంది. బ్రహ్మణి ఉన్నంతవరకూ ఇద్దరం బుద్దిమంతుల్లా ఉంటాం. కనుచూపు మేరల్లో లేదని తెలిస్తే అల్లరే అల్లరి.


అప్పుడే అరవై ఏళ్లు నిండాయంటే నమ్మశక్యంగా లేదు. మీకు?

ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది. మళ్లీ 16 ఏళ్ల వయసుకు వెళ్లినట్లు అనిపిస్తుంది. అందుకే ఎవరైనా  సిక్స్‌టీ అంటే కాదు.. స్వీట్‌ సిక్స్‌టీన్‌ అని చెబుతుంటా. నటుడిగా 46 ఏళ్ల  కెరీర్‌ కొనసాగిందీ అంటే అన్నీ అలా  కలిసొచ్చాయి. తల్లి నుంచి శారీరక మానసిక శుచీ, శుభ్రత, భావుకత  అబ్బుతాయంటారు. ధర్మాధర్మ విచక్షణ వంటివి తండ్రి సంస్కారం వల్ల వస్తాయి. బంధువుల నుండి పరిపాలన దక్షత, పూర్వజన్మ కర్మల  వల్ల కీర్తి ప్రతిష్టలు అబ్బుతాయి. అందరి అనుగ్రహంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. 


ఓ నటుడి వారసుడిగా వచ్చిన వ్యక్తి  వంద సినిమాలు పూర్తి చేయడం ప్రపంచ చరిత్రలో లేదట? 

చిన్నప్పటి నుంచి నాన్నగారే నాకు స్ఫూర్తి. ఆయన సినిమాలు చూసే పెరిగాను. ఆయనలా గొప్ప నటుణ్ణి కావాలనుకున్నా. ‘వీడే నా వారసుడు’ అని నాన్న అంటుండేవారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? అనడిగారు. తల గోక్కుంటూ నేనేమీ సమాధానం చెప్పలేదు. మెడిసిన్‌ ఎంట్రన్స్‌ రాశావా అనడిగారు. లేదన్నా.   చివరి క్షణంలో దరఖాస్తు చేయించి ఆ పరీక్ష రాయించారు. మొదటి నుంచి చదువు మీద అంత దృష్టి ఉండేది కాదు కాబట్టి ర్యాంక్‌ రాదని నాకు తెలుసు. మధ్యలో డిగ్రీ అంటూ మూడు సంవత్సరాలు బయటకు  వెళ్లకపోతే.. ఇప్పటికి 250 సినిమాలు పూర్తయ్యేవి. ఇంత కెరీర్‌లో మంచి సినిమాలూ ఉన్నాయి. ఆడని సినిమాలూ ఉన్నాయి. సక్సెస్‌ అనేది దైవ నిర్ణయం మీద ఉంటుంది. 


కరోనా విషయంలో హిందూపురంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మీరే అన్నీ  ఆరా తీస్తున్నారు? 

హిందూపురం ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం వెంటిలేటర్లు, పీపీయి కిట్లు ఏర్పాటు చేశాం. ఆ పనులన్నీ నేనే చూసుకుంటున్నా. ఒకప్పుడు అక్కడి ప్రజలకు  ఆరోగ్య సమస్య వస్తే అనంతపురం, బెంగుళూరు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మంచి స్టాఫ్‌తో హిందూపురం ఆసుపత్రిని కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశాం. అలాగే పారిశ్రామికంగా కూడా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు మంచి ఉద్యోగాలు కల్పించాలని తపన. 


రెండు నెలల లాక్‌డౌన్‌లో  ఏం చేశారు?

నాకు ఎప్పుడూ చేతి నిండా పనుంటుంది. ఖాళీగా ఉండటం నాకు నచ్చదు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను కాబట్టి హిందూపూరం పనులన్నీ ఫోన్‌లోనే చక్కబెట్టేవాణ్ణి. ఇక రోజువారీ నా పనులు పొద్దున్నే లేవడం, వ్యాయామం చేసుకోవడం, పూజాది కార్యక్రమాలు, సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం, మీటింగుల్లో పాల్గొవడంతో  పాటు కేన్సర్‌ ఆసుపత్రి బాధ్యతలు అన్ని చూసుకుంటున్నా. 


సినిమాల్లో రాకముందు మీరెలా  ఉండేవారు. టీనేజ్‌లో క్రష్‌ ఏమైనా ఉండేదా? 

అలాంటివేమీ  లేదండీ. బాగా అల్లరి చేసేవాణ్ణి. నా ఆరో ఏట నుంచి హైదరాబాద్‌లోనే పెరిగా. నాన్నగారు చెన్నై నుంచి గెస్ట్‌లా వస్తుండేవారు. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ. ఎప్పుడన్నా మద్రాస్‌ వెళ్తే ఇంటి నిండా జనం ఉండేవారు. తిరుపతి యాత్రకు వచ్చినవారంతా నాన్నగారి దగ్గరకు వచ్చేవారు. ఆయనతో గడపడానికి సమయం ఉండేది కాదు. నిజం జీవితంలో కంటే  ఆయన్ని సినిమాల్లో చూడడమే ఎక్కువ. 


తండ్రి అంటే ఎవరికైనా గౌరవమే! మీకు  మాత్రం తండ్రి అంటే దైవంతో సమానం. ఆయన్ని మీరు పూజిస్తున్నట్లే అనిపిస్తుంటుంది? 

నాన్నగారి  జీవితం అంత స్ఫూర్తిదాయకమైంది. ఆయన గ్రాఫ్‌ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, చేసిన పాత్రలు చూస్తే కచ్చితంగా అలాంటి వ్యక్తి ప్రపంచంలోనే లేరని చెప్పగలను. సూపర్‌మ్యాన్‌ను మించిన గొప్ప వ్యక్తి ఆయన. ప్రతి రోజూ  ఆయన సినిమా చూడకుండా నిద్రపోను. ఇక అమ్మ ఎప్పుడూ  నాన్న బాగోగులకే అంకితం అయ్యేది. షూటింగ్‌ నుంచి బయలుదేరుతూ  ‘తారకం..  నాకు ఫలానాది తినాలనుంది’ అనగానే అమ్మ ఆయన ఇంటికొచ్చేలోపు సిద్ధం చేసేది. అమ్మ స్వయంగా  చేస్తేనే ఆయన తినేవారు. నాన్న సక్సెస్‌ వెనక ఆమె ఉంది. 


నాలుగున్నర దశాబ్ధాలుగా మేకప్‌ వేసుకోవడం బోర్‌ అనిపించలేదా? 

నాకు మోనాటనీ లేదు. ఎందుకంటే నాన్నగారిలా నేను సినిమా సినిమాకు భిన్నమైన పాత్రలు పోషించా. అందుకే అలసట,బోర్‌ అనేది నాకు రాదు.  మా జనరేషన్‌లో అన్ని జోనర్ల సినిమాలు చేసింది నేనే! ఓ కథ నేను అంగీకరించాలంటే.. అది  కొత్తగా ఉండాలి, నటనకు స్కోపు ఉండాలి. గెటప్‌ నచ్చాలి. అభిమానులను దృష్టి పెట్టుకోవాలి... ఇన్ని  రకాలుగా  ఆలోచించి ముందుకెళ్తా. 


పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఇచ్చే కానుక ఏంటి? 

నా రిజల్యూషన్‌ మళ్లీ స్వీట్‌ సిక్స్‌టీనే. నాకేమీ పెద్దగా ఆశలు ఉండవు. ఏదీ ప్లాన్‌ చేసుకోను. మెయిన్‌ ఇంట్రెస్ట్‌ యాక్టింగ్‌, సోషల్‌ యాక్టివిటీ. కేన్సర్‌ హాస్పటల్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గుర్తింపు పొందాలని ఆ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నా. ఇక అభిమానుల సంగతంటారా.. వాళ్లకు ఓ కానుక ఇవ్వబోతున్నా. 


మీ పుట్టినరోజున అభిమానులు  తమ ఇళ్లలో  కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేయనున్నారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారట! మీకు ఎలా అనిపిస్తోంది?

గత జన్మను నమ్మితే... ఆ జన్మలో పరిచయమున్న ఎంతోమందిలో ఒకరిద్దర్ని ఈ జన్మలో మనం పొందొచ్చు. ఇవాళ కోట్లాదిమంది అభిమానుల్ని పొందడమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. అభిమానం డబ్బుతో కొంటే వచ్చేది కాదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదు. ఈ జీవితంలో నేను సంపాదించిన విలువైనదీ, ఇక ముందూ నాతో ఉండేదీ నా అభిమానులే. వాళ్ల అభిమానం వెల కట్టలేనిది. నేను ఎలాగైతే బసవతారకం క్యాన్సర్‌ హాస్పటల్‌, ఎన్‌బికే సేవా సమితి ద్వారా, ప్రజాప్రతినిధిగా సేవలు చేస్తున్నానో... అలాగే వాళ్లూ ఎప్పుడూ సమాజ సేవ చేస్తున్నారు. సినీ నటుల అభిమానులు ఎలా ఉండాలన్నదానికి మా అభిమానులు ఆదర్శంగా నిలిచారు. నా సినిమా రికార్డులు నాకు తెలియవు. కానీ, అభిమానులు టకటకా చెబుతారు.


మీకు ఏపీ సీయం జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని. మీకు తెలుసా? మీ సినిమా విడుదల  సందర్భంగా ఆయన పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం?

తెలుసు. కడప (అభిమాన సంఘం) టౌన్‌ ప్రెసిడెంట్‌! అయితే, రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఎన్టీఆర్‌గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన అభిమాని కానివారు ఎవరు? అప్పట్లో పెద్ద పార్టీ కాంగ్రెస్‌. అందులో 90 శాతం మంది నాన్నగారి అభిమానులే. 


ఎన్టీఆర్‌ జీవితాన్ని  చూసినప్పుడు ‘నాన్నగారు ఆ సందర్భంలో అలా చేసి ఉండాల్సింది కాదు’ అని అనిపించే ఘటన ఏమైనా ఉందా?

నేను దైవాన్ని బాగా నమ్ముతా. డెస్టినీ కాబట్టి... జరిగిపోయింది అనుకుంటాను తప్పితే, ‘ఇలా చేసి ఉండాల్సింది కాదు’ అని ఎప్పుడూ అనుకోను. జరగాల్సింది జరిగిందంతే! వేదాంతపరంగా చూస్తే... ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు ఉంటాయి. అంతా విధి!


ఎన్టీఆర్‌ గురించి తెలియని విషయం ఏదైనా చెబుతారా?

నాన్నగారి జీవితం తెరచిన పుస్తకం. ఆయన గురించి అభిమానులకు అంతా తెలుసు. నా గురించి తెలిసినట్టే! ఇంతకు ముందు చెప్పి ఉంటాను... సినిమాల విషయానికి వస్తే, నన్ను మాత్రం ఆయనెప్పుడూ కొడుకుగా చూడలేదు. నా సినిమాలు చూడడం గానీ, బాబుతో సినిమాలు చేయమని ఇతర నిర్మాతలకు రికమండ్‌ చేయడం గానీ ఎప్పుడూ చేయలేదు. నాన్నతో సినిమాలు చేసినప్పుడు... సెట్‌లో ఆయన దర్శకుడు, నేను ఆర్టిస్ట్‌. అంతే! కొడుకుగా ఎప్పుడూ గారం చేయలేదు.


రాజకీయ ప్రచారంలో భాగంగా ప్రజాచైతన్య రథం ఎక్కిన ఎన్టీఆర్‌... ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడే బస చేశారు. మీరూ హిందూపూర్‌లో హాస్టల్‌, హాస్పటల్స్‌లో బస చేశారు. తండ్రి స్ఫూర్తి అనుకోవచ్చా?

నాన్నను అనుకరించడం కాదు. అది రక్తంలో ఉందంతే!


అరవైయేళ్లు పూర్తైన సందర్భంలో మీ లక్ష్యం ఏంటి?

జీవితంలో మైలురాళ్లు చేరుకున్నప్పుడు, పుట్టినరోజులకు రిజల్యూషన్స్‌ తీసుకున్నామని అంటుంటారు. అయితే, నేనెప్పుడూ ఏదీ ప్లాన్‌ చేసుకోను. విధిని నమ్ముతాను. ఆర్టిస్టుగా వినోదం పంచుతూ సినిమా మాధ్యమం ద్వారా ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తా. క్యాన్సర్‌ హాస్పటల్‌ ద్వారా, ఎమ్మెల్యేగా సేవలు కొనసాగిస్తా. భవిష్యత్‌ ప్రణాళికల గురించి అంతకంటే ఆలోచించను. ఇంతకు ముందు చెప్పినట్టు... అయామ్‌ స్టిల్‌ స్వీట్‌ 16. అరవైయేళ్లు అనుకోను. నాకు ఓపిక, సత్తా ఉన్నాయి.


సినిమాలపై కాన్సంట్రేషన్‌ కంటిన్యూ అవుతుందన్నమాట! మీ జీవితంలో ఎప్పుడైనా ‘ఇలా చేసుండాల్సింది కాదు. ఫలనా సమయంలో నేనలా ఉండాల్సింది కాదు’ అనేది ఏమైనా ఉందా?

లేదు. నేను ఎటువంటి క్యారెక్టర్స్‌కి సూటవుతాననేది నాకు, నా అభిమానులకు బాగా తెలుసు. ఒకొక్కరూ ఒక్కో తరహా పాత్రలకు సూటవుతారు. నాకు అడ్వాంటేజ్‌ ఏంటంటే... పౌరాణికాలు, జానపదాలు, సాంఘీకాలు - అన్ని రకాల పాత్రలు చేయగలను. మొనాటినీని అడ్డుకుంటూ కొత్త నేపథ్యంలో చిత్రాలు చేయగలననీ, కళామతల్లి ఆశీస్సులు  ఉన్నాయని నా నమ్మకం ఉంది(నవ్వుతూ...) ఇప్పుడు 60 కాబట్టి, ఇంకో 60 ఏళ్ల జీవితం ఉంది. ఇప్పుడు వెస్ట్రన్‌ కల్చర్‌ ఎక్కువ వస్తోంది. ఇదివరకూ మారడానికి ఎన్నో ఏళ్లు పట్టేది. ఇప్పుడు ప్రతి వారం మారుతున్నారు. నా మనవడు లేదా ముని మనవడు  కావచ్చు... తర్వాత తరం ‘ఈ రోజు కోసం బతుకుతున్నాం. రేపటి గురించి ఆలోచించడం లేదు’ అంటారేమో! అప్పుడు ఇది వరకటి కంటే భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 


మీరు, తారకరత్న, కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌... ఇలా అందర్నీ ఒక ఫ్రేములో చూడాలని అభిమానుల కోరిక. మీ వరకూ వచ్చిందా?

మంచి సబ్జెక్ట్‌ వస్తే తప్పకుండా నటిస్తాం.  డబ్బు చేసుకోవడానికో, వ్యాపారం కోసమో అయితే నేను చేయను. అందరం కలిసి చేస్తున్నామంటే ఓ స్థాయి ఉంటుంది కదా! అందుకు తగ్గట్టు ఆ సినిమా కథ బ్రహ్మాండంగా ఉండాలి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పకుండా చేస్తా.


తెలుగు సినిమా భవిష్యత్‌ ఏంటి? హైదరాబాద్‌లో ఉంటుందా? విశాఖ లేదా విజయవాడ షిఫ్ట్‌ చేయాలనే ప్రయత్నాలు గతంలో జరిగాయి!

ఇప్పుడు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఎందుకంటే... మెట్రో పాలిటన్‌ జీవితానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. విశాఖ కాస్మో పాలిటన్‌ సిటీ. అక్కడ నేను చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. ప్రభుత్వం కూడా అభివృద్ధి చేస్తామంటోంది. చూద్దాం! ప్రస్తుతం కరోనా, సమాజం గురించి ఆలోచించాలి తప్ప, ‘ఇండస్ట్రీని ఎక్కడ అభివృద్ధి చేద్దాం’ అనే తొందర అవసరం లేదు. అమరావతిలో ఈ 9న మీటింగ్‌ అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం! 


షూటింగులు ఎప్పట్నుంచి మొదలు కావచ్చు?

నేను రెడీ! వందమందితో షూటింగ్‌ చేయడానికైనా!! నేనసలు పట్టించుకోను. నా నమ్మకాలు, నా పూజ ... ఇవన్నీ చూసుకుంటాను. ముహూర్తాలు చూసుకుని ఇంటి నుంచి బయలుదేరతా.  ఇండస్ట్రీలో భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది. అది కొంచెం రిస్కే. అందుకని, తొందర పడాల్సిన అవసరం లేదు. ఎంతోమంది రోజు గడవని కార్మికులున్నారు.  వాళ్లూ బతికి ఉండాలి కదా! అయితే  లేని పోని కరోనా తెచ్చుకుని కష్టాలు పడడం ఎందుకు? షూటింగులు మొదలు కావడానికి మూడు నాలుగు నెలలు పడుతుందని నా నమ్మకం.


Advertisement
Advertisement
Advertisement